బిహార్ శాసనసభ ఎన్నికల పర్వం చివరి దశకు చేరుకుంది. రెండో విడత ఎన్నికల పోలింగ్ నవంబర్ 11న (మంగళవారం) జరుగుతుంది. దీంతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. రెండో విడత ఎన్నికల పోలింగ్‌కు ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులను ఒడ్డాయి. పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమరం ప్రధానంగా ఎన్డీఏ, మహాగఠ్‌బంధన్ (Mahagathbandhan) కూటముల మధ్య జరుగుతోంది. ఎన్డీఏలో బీజేపీ, జేడీయూ ప్రధాన పార్టీలు. మహాగఠ్‌బంధన్‌లో కాంగ్రెస్, ఆర్జేడీ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఇవే కాకుండా ఇతర చిన్న పార్టీలు కూడా రెండు కూటములతో జట్టు కట్టాయి. ఆయా కూటముల్లో ఏయే పార్టీలు ఉన్నాయనే దాని గురించి సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు నెటిజనులు. చిన్న పార్టీలు కూడా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటి గురించి నెట్టింట చర్చ నడుస్తోంది. మరోవైపు కొత్త పార్టీ జన్ సురాజ్ ఒంటరిగా బరిలోకి దిగింది. రాజకీయ నేతగా మారిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (prashant kishor) ఈ పార్టీని స్థాపించారు.
ఎన్డీఏ కూటమిలోని 5 పార్టీలు బిహార్ ఎన్నికల్లో కలిసి కట్టుగా పోటీకి దిగాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో పాటు సీఎం నితీశ్ కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ (యునైటెడ్), కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM), ఉపేంద్ర కుష్వాహా నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM).. ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాయి.
ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్‌లో ఏడు పార్టీలు పాలు పంచుకున్నాయి. కాంగ్రెస్‌తో సహా తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ), ముఖేష్ సహానీకి చెందిన వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ), ఇంద్రజీత్ ప్రసాద్ గుప్తా నాయకత్వంలోని ఇండియన్ ఇన్‌క్లూజివ్ పార్టీ (ఐఐపీ) మహాగఠ్‌బంధన్ పేరుతో బిహార్ ఎన్నికల బరిలోకి దిగాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ (సీపీఐఎంఎల్-లిబరేషన్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (CPIM) వంటి వామపక్ష పార్టీలు కూడా ప్రతిపక్ష కూటమిలో భాగంగా ఉన్నాయి.
ఎన్డీఏ కూటమి
1. భారతీయ జనతా పార్టీ
2. జనతాదళ్ (యునైటెడ్)
3. లోక్ జనశక్తి పార్టీ
4. హిందుస్థానీ అవామ్ మోర్చా
5. రాష్ట్రీయ లోక్ మోర్చా
మహాగఠ్‌బంధన్
1. కాంగ్రెస్ పార్టీ
2. రాష్ట్రీయ జనతాదళ్
3. వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ
4. ఇండియన్ ఇన్‌క్లూజివ్ పార్టీ
5. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
6. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్
7. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
ఎవరెవరికి ఎన్ని సీట్లు?
ఎన్డీఏ కూటమిలోని బీజేపీ, జేడీయూ చెరో 101 సీట్లలో పోటీ చేస్తున్నాయి. లోక్ జనశక్తి పార్టీ 29, హిందుస్థానీ అవామ్ మోర్చా 6, రాష్ట్రీయ లోక్ మోర్చా 6 స్థానాల్లో బరిలో నిలిచాయి.
మహాగఠ్‌బంధన్ విషయానికి వస్తే.. రాష్ట్రీయ జనతాదళ్ 145, కాంగ్రెస్ 45, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ 19, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 6, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 5 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మరో 12 చోట్ల మహాగఠ్‌బంధన్‌లోని పార్టీలు స్నేహపూర్వక పోటీకి దిగాయి.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలు
1. బిహార్ ఎన్నికల 2025 ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారు?
నవంబర్ 14న ప్రకటించబడతాయి.
2. బిహార్ ఎన్నికలు 2025లో ఎన్ని దశలు ఉన్నాయి?
నవంబర్ 6, నవంబర్ 11న రెండు దశల్లో జరుగుతున్నాయి..
3. బిహార్ శాసనసభలో సీట్లు ఎన్ని ?
బిహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 122 సీట్లు అవసరం.
4. బిహార్ ఎన్నికలు 2025లో ఏ పార్టీలు పోటీ చేస్తున్నాయి?
ప్రధాన పోటీ NDA (BJP, JD(U), HAM), మహాగఠ్‌బంధన్ (RJD, కాంగ్రెస్, లెఫ్ట్) మధ్య ఉంది. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోంది.
5. మొదటి దశలో పోలింగ్ ఎంత ?
మొదటి దశలో 65.08% పోలింగ్ నమోదైంది. ఇది 2020, 2024 ఎన్నికల కంటే ఇది ఎక్కువ.
5. బిహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు?
జేడీయూ పార్టీకి చెందిన నితీశ్ కుమార్. ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు.
చదవండి: బిహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం


