రోహ్తాస్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ పోలింగ్ ముగిసి, నవంబర్ 14న ఓట్ల లెక్కింపునకు సిద్ధమవుతున్న సమయంలో రోహ్తాస్ జిల్లాలోని ససారంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ఉంచిన మార్కెట్ కమిటీ ప్రాంగణంలోని స్ట్రాంగ్ రూమ్ బయట మహాఘట్‌బంధన్ (Grand Alliance) అభ్యర్థులు, మద్దతుదారులు ఆందోళనకు దిగారు. స్ట్రాంగ్ రూమ్ లోపల ఉన్న సీసీటీవీ కెమెరాలు అకస్మాత్తుగా ఆగిపోయాయని, ఎటువంటి తనిఖీ లేకుండా ఒక ట్రక్కు ఆవరణలోకి ప్రవేశించిందని వారు ఆరోపిస్తున్నారు.
స్ట్రాంగ్ రూమ్ సీసీటీవీ కెమెరాలు ఆగిపోయిన వెంటనే, ఒక ట్రక్కు ఆవరణలోకి రావడం చూసి, దినారాకు చెందిన ఆర్‌జేడీ అభ్యర్థి రాజేష్ యాదవ్, ససారాం నేత సత్యేంద్ర సాహ్ తమ మద్దతుదారులతో ఆందోళనకు దిగారు. ఈవీఎంలను ట్యాంపర్ చేయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ఈవీఎంలు ఉంచిన చోటుకు రాత్రిపూట ఖాళీ ట్రక్కు ఎందుకు వచ్చింది?’ అని ప్రశ్నిస్తూ, స్ట్రాంగ్ రూమ్ ముందు నిరసనకు దిగారు. ఓటమి భయంతోనే ఎన్డీఏ.. ఈవీఎంలను మార్చేందుకు ప్రయత్నిస్తోందని, రోహ్తాస్‌లోని ఏడు స్థానాల్లోనూ మహాఘట్‌బంధన్ గెలవడం ఖాయమని వారు అన్నారు.
విషయం తెలియగానే, రోహ్తాస్ డీఎం ఉదితా సింగ్ ఎస్పీ రోషన్ కుమార్ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు ట్రక్కును తనిఖీ చేయగా, అందులో ఈవీఎంలను ఉంచేందుకు ఉద్దేశించిన ఖాళీ పెట్టెలు మాత్రమే ఉన్నాయని గుర్తించారు. ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎంలను తిరిగి ఉంచడానికి ఈ పెట్టెలను ఆలస్యంగా తీసుకువచ్చినట్లు ఎస్డీఎం అశుతోష్ రంజన్ వివరించారు. ఈ విషయంలో ఎవరికైనా సందేహాలు ఉంటే, సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా చూపిస్తామని డీఎం ఉదితా సింగ్ హామీ ఇచ్చారు. అయితే.. పెట్టెలు ఖాళీగా ఉంటే, వాటిని రాత్రిపూట ఎందుకు తీసుకువచ్చారు? అని నిరసనకారులు అని ప్రశ్నించారు, పోలీసుల అప్రమత్తతపై సందేహాలు వ్యక్తం చేశారు.
నవంబర్ 14న జరగబోయే ఓట్ల లెక్కింపుకు ముందే రోహ్తాస్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మహాఘట్‌బంధన్ నేతలు దీనిని ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే అని ఆరోపించారు. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు జిల్లా యంత్రాంగం కౌంటింగ్ కేంద్రం చుట్టూ 144 సెక్షన్ విధించాలని, అదనపు భద్రతా బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: ‘యూనస్ ఉగ్రవాదుల ఫ్రంట్‌మన్’.. హసీనా ఆగ్రహం


