న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ దేశ ప్రస్తుత తాత్కాలిక ప్రధాన సలహాదారు, నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్‌పై తీవ్ర విమర్శలతో మండిపడ్డారు. ఆర్థికవేత్తగా అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న ఆయన దానిని దుర్వినియోగం చేస్తున్నారని హసీనా ఆరోపించారు. సీఎన్‌ఎన్- న్యూస్ 18కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ యూనస్‌పై అంతర్జాతీయ సమాజానికున్న భ్రమలు తొలగిపోతున్నాయని, ఆయనను అందరూ ఎన్నికకాని దేశాధినేతగా చూస్తున్నారన్నారు. అతని పరిపాలన రాజ్యాంగాన్ని కూల్చివేస్తున్నదని, మైనారిటీలను రక్షించడంలో విఫలమవుతున్నదని షేక్ హసీనా ఆరోపించారు.
దేశాన్ని మతోన్మాదంగా మారుస్తూ, సామాజికంగా తిరోగమన దేశీయ ఎజెండాను అనుసరిస్తున్న యూనస్ ‘ఉగ్రవాదుల ఫ్రంట్‌మన్’గా ఉన్నారంటూ హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన మంత్రివర్గంలో రాడికల్ తీవ్రవాదులు ఉన్నారని, ఫలితంగా మైనారిటీలు అణచివేతకు గురవుతున్న వాతావరణం ఏర్పడిందని హసీనా పేర్కొన్నారు. యూనస్ ప్రజాస్వామ్య ఆధారాలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. తొమ్మిదిసార్లు ఎన్నికైన అవామీ లీగ్‌ను రాబోయే ఎన్నికల నుండి నిషేధించాలనే ఆయన నిర్ణయాన్ని ఆమె తప్పుబట్టారు.
యూనస్ ప్రజాస్వామ్య పాలన మార్పునకు చిహ్నం కాదని, అతనికి ప్రజల్లో విస్తృత మద్దతు లేదని, అతను ఎన్నిక కాని వ్యక్తి అని హసీనా ఆరోపించారు. అందుకే ఆయన లక్షలాది మంది మద్దతు కలిగిన పార్టీని ఎన్నికల నుండి బహిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారని హసీనా ఆరోపించారు. ఇతర దేశాల వారు యూనస్‌ను స్నేహితునిగా భావిస్తే, వారు మోసపోతున్నట్లేనని హసీనా పేర్కొన్నారు. ఆ నోబెల్ గ్రహీత తన గత రచనలతో పొందిన ఇమేజ్‌ను ప్రస్తుతం తప్పుడు దారిలో ఉపయోగిస్తున్నారని హసీనా ఆరోపించారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: ‘మహిళా డాక్టర్’ను ‘డీకోడ్’ చేసిన సన్నిహితులు


