ఆలయ పూజారి ఫిర్యాదు.. ఇద్దరు బీజేపీ ఎంపీపై కేసు నమోదు | Baidyanath Temple Issue Case Against BJP MP Nishikant Dubey And Manoj Tiwari, More Details Inside | Sakshi
Sakshi News home page

ఆలయ పూజారి ఫిర్యాదు.. ఇద్దరు బీజేపీ ఎంపీపై కేసు నమోదు

Aug 9 2025 9:18 AM | Updated on Aug 9 2025 9:18 AM

Baidyanath Temple Issue Case Against BJP MP Nishikant Dubey And Manoj Tiwari

రాంచీ: బీజేపీ ఎంపీలు మనోజ్‌ తివారీ, నిశికాంత్‌ దూబేలకు ఊహించని షాక్‌ తగిలింది. ఆలయంలో పూజలు జరుగుతున్న వేళ ఆంక్షలు ఉన్నప్పటికీ.. ఎంపీలు ఇద్దరూ నిర్లక్ష్యంగా ఆలయంలోకి ప్రవేశించారు. ఈ నేపథ్యంలో ఆలయ పూజరి.. ఎంపీ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. శ్రావణమాసం నేపథ్యంలో బీజేపీ ఎంపీలు మనోజ్‌ తివారీ, నిశికాంత్‌ దూబే ఆగస్టు రెండో తేదీన జార్ఖండ్‌ దేవ్‌గఢ్‌లోని బాబా వైద్యనాథ్ ఆలయానికి వెళ్లారు. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో.. ఆలయంలోకి వీఐపీ, వీవీఐపీల ప్రవేశాలను నిలిపివేశారు. కానీ, బీజేపీ ఎంపీలు ఇద్దరు మాత్రం ఇవేవీ లెక్క చేయలేదు. భద్రతా సిబ్బంది అడ్డు చెప్పినప్పటికీ.. లెక్కచేయకుండా ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేశారు. ఏకంగా గర్భ గుడిలోకి ప్రేవేశించి పూజలు జరిపారు. వారి ప్రవర్తనతో గుడిలో ఉన్న పూజారులు సైతం ఖంగుతిన్నారు. ఈ క్రమంలో ఎంపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆలయ పూజారి కార్తీక్‌నాథ్‌ ఠాకూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తన ఫిర్యాదులో భాగంగా.. ఎంపీలు బలవంతంగా ప్రవేశించడం, భద్రతా సిబ్బందితో వాదనకు దిగినట్లు తెలిపారు. మత సంప్రదాయం, మనోభావాలను దెబ్బతీసినట్టు చెప్పుకొచ్చారు. ఆగస్టు 2న రాత్రి 8.45 నుండి రాత్రి 9 గంటల ఈ ఘటన జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలోని భక్తులు భయాందోళనకు గురయ్యారని, తొక్కిసలాట వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. దీంతో ఎంపీలు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రాంచీ పోలీసులు వెల్లడించారు.

ఇక, పోలీసులు కేసు నమోదు చేయడంపై నిశికాంత్‌ దూబే స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా నితికాంత్‌ దూబే..‘పూజలు చేసినందుకు తనపై కేసు నమోదు చేశారన్నారు. ఇప్పటివరకు 51 కేసులు నమోదయ్యాయని తెలిపారు. రేపు తాను అరెస్టు అయ్యేందుకు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్తానన్నారు. మరోవైపు, మనోజ్‌ తివారీ మాత్రం దీనిపై ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం.

ఇదిలా ఉండగా.. శ్రావణ మాసంలో కన్వరియాలు వేలాదిగా బాబా బైద్యనాథ్ ధామ్ వెళ్తారు. బీహార్‌లోని సుల్తాన్‌గంజ్ నుండి జార్ఖండ్‌లోని దేవఘర్ వరకు 105 కిలోమీటర్ల తీర్థయాత్రకు బయలుదేరి 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఆలయంలో పవిత్ర గంగా జలాన్ని అర్పించడానికి బయలుదేరుతారు. నెల రోజుల పాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు దాదాపు 55 లక్షల మంది కన్వరియాలు ఆలయంలో పవిత్ర జలాన్ని అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement