ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు | ayatollah khamenei funeral india announces delegates | Sakshi
Sakshi News home page

ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు

Jun 29 2026 3:50 PM | Updated on Jun 29 2026 4:34 PM

ayatollah khamenei funeral india announces delegates

టెహ్రాన్‌: ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా ఆలీ ఖమేనీ అంత్యక్రియలకు సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారి వివరాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. బిహార్ గవర్నర్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా ఆలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ దాడి అనంతరం సైతం భీకరమైన యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో ఖమేనీ అంత్యక్రియలకు అనుకూల సమయం లభించలేదు. దీంతో ఇంతకాలం పాటు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్‌ ఎట్టకేలకు జూలై 4 నుంచి అంత్యక్రియలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు మసూజ్ ఫెజెష్కియన్ ఈ కార్యక్రమాలకు హాజరుకావాల్సిందిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అధికారికంగా ఆహ్వానం అందించారు. అయితే, అదే సమయంలో ప్రధానమంత్రి ముందే ఖరారైన షెడ్యూల్ ప్రకారం ఇండోనేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల పర్యటనలో ఉండటం వల్ల ఆయన ఈ కార్యక్రమాల్లో స్వయం పాల్గొనలేకపోతున్నారని కేంద్రం తెలిపింది. దీంతో సుప్రీం లీడర్ అంత్యక్రియలకు భారత్ తరఫున బిహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్, కేంద్ర సహాయ మంత్రి శ్రీ పబిత్రా మార్గరీటాలు హాజరు కానున్నట్లు పేర్కొంది.

ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియల షెడ్యూల్‌

జూలై 4న టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా కాంప్లెక్స్‌లో ఖమేనీ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. దీనితో అంత్యక్రియల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతాయి. టెహ్రాన్, కోమ్ నగరాల్లో బహిరంగ ఊరేగింపులు నిర్వహిస్తారు. అలాగే ఇరాక్ లోని పవిత్ర నగరాలైన నజాఫ్, కర్బలాల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు చేపడతారు. జూలై 9 న ఖమేనీ సొంత ఊరైన మషహాద్‌లోని ప్రసిద్ధ 'ఇమామ్ రెజా' పుణ్యక్షేత్రంలో జూలై 9న అంతిమ కార్యక్రమం జరగనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement