ఇటీవల మహారాష్ట్రలో ఓ మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానం కోసం బీజేపీ, ఎంఐఎం పార్టీలు కలవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటనపై తాజాగా అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఎంఐఎం పార్టీ ఎట్టిపరిస్థితుల్లో బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. సముద్రం లోని రెండు చివరలు ఎప్పటికీ కలవవు అని తెలిపారు.
కొద్దిరోజుల క్రితం మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం జరిగింది. అక్కడి అకోట్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానం కోసం బద్రశత్రువులైన బీజేపీ, ఎంఐఎం పార్టీలు పొత్తుపెట్టుకున్నాయి. అధికారం కోసం ఉప్పునిప్పులా ఉన్న రెండు పార్టీలు కలవడమేంటని ముక్కున వేలేసుకున్నారు. అయితే దీనిని ఆరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. అది తనకు తెలియకుండా జరిగిందని అలా పొత్తు పెట్టుకున్న నాయకులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
తాజాగా ఈ అంశంపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. "అకోలాలో ఎంఐఎం కార్పొరేటర్లు ఐదుగురు గెలిచారు. అయితే అధికారం కోసం ఒక గ్రూపుకు మద్దతిస్తామన్నారు. అయితే ఆ గ్రూపు బీజేపీతో కలిసి ఉన్న సంగతి వారికి తెలియదు. అయితే ఆగ్రూపులో బీజేపీ ఉన్న సంగతి తెలిసిన తర్వాత సపోర్టును ఉపసంహరించుకోవాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు లేఖ రాయాలని కోరాం" అని ఒవైసీ అన్నారు
బీజేపీ, ఎంఐఎం పార్టీలు విభిన్న ధృవాలని సముద్రానికి ఉన్న రెండు తీరాల్లాంటివారని అవి ఎప్పటికీ కలవవని ఒవైసీ తేల్చిచెప్పారు. అంతేకాకుండా తమ పార్టీకి చెందిన నెతలేవరైనా పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పొత్తు పెట్టుకుంటే అధిష్ఠానం వారిపై చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఇటీవల మహాయుతి కూటమి ఆఫర్ చేసిన కోఆప్షన్ మెంబర్ తీసుకున్న ఇంతియాజ్ జలీల్ అనే వ్యక్తిని పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు ఒవైసీ పేర్కొన్నారు.
కాగా ఇటీవల జరిగిన మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సత్తా చాటింది. మున్సిఫల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 125 సీట్లు గెలిచిన ఆపార్టీ గత నెలలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో 85 సీట్లు సాధించింది. దీంతో మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీకి చెందిన కార్పొరేటర్లు 200మంది ఉన్నట్లు అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. 2017లో జరిగిన ఎన్నికల్లో81 కార్పొరేటర్ స్థానాలు సాధించిన ఎంఐఎం ఈ సారి వాటి సంఖ్య 200కు పెంచుకుంది.


