2023–24 రక్తహీనత నివారణలో ఏపీదే అగ్రస్థానం | AP ranks first in anemia prevention | Sakshi
Sakshi News home page

2023–24 రక్తహీనత నివారణలో ఏపీదే అగ్రస్థానం

Apr 19 2025 3:03 AM | Updated on Apr 19 2025 3:03 AM

AP ranks first in anemia prevention

2023–24లో 91.1శాతం కవరేజీతో తొలి స్థానంలో నిలిచిన ఏపీ 

82.9శాతం కవరేజీతో ఏడో స్థానంలో తెలంగాణ 

దేశంలో 67.1శాతం పిల్లల్లో రక్తహీనత 

59.1శాతం మంది కౌమార బాలికల్లో రక్తహీనత 

ఏపీలో 63.2శాతం, తెలంగాణలో 70శాతం మంది పిల్లల్లో అనీమియా 

ప్రతి నలుగురు మహిళల్లో ముగ్గురి ఆహారంలో తక్కువ ఐరన్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: ‘రక్తహీనత ముక్త్‌ భారత్‌’ పథకంలో అమలులో భాగంగా 2023–24లో పిల్లలు, బాలికలు, గర్భిణులకు ఐరన్, ఫోలిక్‌ యాసిడ్‌ సప్లిమెంట్లు అందించే ప్రక్రియలో 91.1శాతం కవరేజీతో దేశంలోనే తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. 82.9శాతం కవరేజీతో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. 

ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2024–25 రెండో త్రైమాసికంలో 15.4 కోట్ల మంది పిల్లలు, కౌమార బాలికలకు ఐరన్, ఫోలిక్‌ యాసిడ్‌ సప్లిమెంట్లను అందించినట్లు తెలిపింది. ప్రతి నలుగురు భారతీయ మహిళల్లో ముగ్గురికి అందుతున్న ఆహారంలో ఐరన్‌ తక్కువగా ఉంటోందని పేర్కొంది. 

పురుషుల్లోనూ 25శాతం మందిలో.. 
జాతీయ ఆరోగ్య సర్వే–5 (2019–21) ప్రకారం భారతదేశంలో 67.1శాతం మంది 6 నుంచి 59 నెలల మధ్య వయసున్న పిల్లలు, 59.1శాతం మంది 15 నుంచి 19 సంవత్సరాల మధ్య గల కౌమార బాలికలు, 15–49 సంవత్సరాల మధ్య ఉన్న 52.2శాతం మహిళలు, గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారని పేర్కొంది. అయితే 15 నుంచి 49 సంవత్సరాల మధ్య పురుషుల్లో రక్తహీనత ప్రభావం మహిళలతో పోలిస్తే కాస్త తక్కువగానే ఉంది. 

ఈ వయసులోని మహిళల్లో 57శాతం రక్తహీనత ఉంటే.. పురుషుల్లో 25శాతం రక్తహీనత నమోదైంది. అదే సమయంలో తెలంగాణలోని 70శాతం మంది పిల్లల్లో, 64.7శాతం కౌమార బాలికల్లో, 53.2శాతం గర్భిణుల్లో రక్తహీనత ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 63.2శాతం పిల్లల్లో, 60.1శాతం బాలికల్లో, 53.7శాతం గర్భిణుల్లోలో రక్తహీనత సమస్య ఉందని జాతీయ ఆరోగ్య సర్వే–5 గుర్తించింది. 

కాగా.. రక్తహీనత ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 49 సంవత్సరాల వయసు గల 500 మిలియన్ల మహిళలను, 5 సంవత్సరాలలోపు (6–59 నెలలు) 269 మిలియన్ల పిల్లలను ప్రభావితం చేస్తోందని కేంద్రం తెలిపింది. కాగా దాదాపు 30శాతం గర్భిణులు కాని స్త్రీలు (539 మిలియన్లు), దాదాపు 37శాతం గర్భిణులు (32 మిలియన్లు) రక్తహీనతతో బాధపడుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement