తాడేపల్లి: ఏపీలో పోలీసు వ్యవస్థ మరింత దిగజారిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. పోలీసులే తప్పతాగి యాక్సిడెంట్ చేసే పరిస్థితికి వచ్చారని, గంజాయి సరఫరా చేస్తూ పోలీసులు పట్టుబడితే 24 గంటల వరకు ఎస్పీ స్పందించలేదని మండిపడ్డారు. వంద రోజుల్లో గంజాయిని నిర్మూలించామని హోంమంత్రి చెప్పారని, కానీ ఏపీలో ఎక్కడ చూసినా గంజాయే కనిపిస్తోందన్నారు. గతంలో పోలీసులే దొంగలను పట్టుకుంటే, ఇప్పుడు పోలీసులను ప్రజలు పట్టుకుంటున్నారన్నారు.
ఈరోజు(మంగళవారం, ఆగస్టు 18వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘ ఇంత జరుగుతున్నా హోంమంత్రి ఎందుకు నోరు మెదపటం లేదు?, దీన్నుంచి బయట పడే మార్గాలను వెతుక్కుంటున్నారా?, జగన్ హయాంలో ఏర్పాటు చేసిన సెబ్ ఏమైంది?, పోలీసులే గంజాయి సరఫరావారితో కలిసి వ్యాపారం చేస్తున్నారు. ఏపీలో జనం జెన్ జీ అంటుంటే పోలీసులు గంజాయి అంటున్నారు.
ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకునే పార్టీల నేతలు ఇప్పుడు ఏమయ్యారు?, పవన్ కళ్యాణ్ తన సోదరునికి పదవులు ఇచ్చుకునే పనిలో ఉన్నారు. ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్న ప్రభుత్వ పెద్దలు.. మరి గంజాయి సరఫరా చేస్తున్న పోలీసులను ఏం చేయాలి?, హోంమంత్రి పబ్జీ ఆడుకుంటూ టైం పాస్ చేస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టులో ఒక కూలీ చనిపోతే ఆ కేసును కప్పి పెట్టేశారు. రాష్ట్రంలో అసలేం జరుగుతోంది?, సంపూర్ణ విద్యావ్యవస్థను లోకేష్ సర్వనాశనం చేశారు.
ఆడపిల్లలు బహిర్భూమికి వెళ్లటానికి రోడ్లపై వరుసగా నిలబడిన వీడియోలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ఇంతకంటే చేతగాని ప్రభుత్వం మరోటి లేదు. డీఎస్సీలో అక్రమాలపై ప్రశ్నిస్తే అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెప్పారు. టీడీపీ నేతలు చేసే దుర్మార్గాలకు పోలీసులు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. జనసేన నేత నాగేంద్ర ఒక మహిళను రోడ్డుపై కొట్టినా చర్యల్లేవ్. గంజాయి మత్తులో జరుగుతున్న దారుణాలకు ఎవరు బాధ్యత వహించాలి?, మెడికో ప్రియాంక ఇద్దరు తాగుబోతులు కర్కశత్వానికి బలైంది. అయినప్పటికీ హోంమంత్రి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కనీసం పట్టించుకోలేదు. వినుకొండలో నడిరోడ్డు మీద యువకుడిని హత మార్చారు. ఈ హత్య లన్నీ ప్రభుత్వ హత్యలే’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


