ఐఐఎం, ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యార్థుల్లో 93 శాతం మందికి ప్లేస్‌మెంట్స్‌ | 93 percent of IIM and IIT and NIT students get placements | Sakshi
Sakshi News home page

ఐఐఎం, ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యార్థుల్లో 93 శాతం మందికి ప్లేస్‌మెంట్స్‌

Oct 5 2026 3:43 AM | Updated on Oct 5 2026 3:43 AM

93 percent of IIM and IIT and NIT students get placements

పదేళ్లలో వార్షిక వేతనాలు రెట్టింపు

ఐఐఎం విద్యార్థుల్లో సగం మందికి పైగా రూ.40 లక్షలకుపైనే వేతనం 

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో 2018లో 1.62 లక్షల మంది విద్యార్థులు 

2024లో 2.44 లక్షలకు చేరిన విద్యార్థుల సంఖ్య 

ఐఐఎంలలో 2018లో 9,298 మంది.. 2024లో 18,243 మంది విద్యార్థులు 

ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక వెల్లడి

సాక్షి, అమరావతి: దేశంలో ఐఐఎం (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌), ఐఐటీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ), ఎన్‌ఐటీ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)ల్లో చదివిన విద్యార్థుల్లో 93 శాతం మందికి ప్లేస్‌మెంట్‌ లభిస్తోంది. వీరి వార్షిక వేతనాలు పదేళ్లలో రెట్టింపయ్యాయి. జాతీయ ప్రాముఖ్యతగల ఉన్నత విద్యాసంస్ధలు.. ప్రధానంగా ఐఐఎం, ఐఐటీ, ఎన్‌ఐటీల పనితీరుపై ఎస్‌బీఐ రీసెర్చ్‌ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నాణ్యమైన విద్యను అందిస్తున్న ఈ విద్యాసంస్థల పనితీరు ఎంతో ఆకట్టుకునేలా ఉందని ఆ నివేదిక పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం.. అధునాతన పరిశోధన నైపుణ్యాలను పొందడం, ప్రపంచస్థాయి కెరీర్‌ అవకాశాలను అందిపుచ్చుకోవడం, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో నైపుణ్యాన్ని సాధించడం కోసం విద్యార్థులు ఈ విద్యాసంస్థల్ని ఎంచుకుంటున్నారు. 

2023–24 నుండి రికార్డు స్థాయిలో ప్రవేశాలు
2023–24 విద్యా సంవత్సరంలో ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఉన్నతవిద్యలో ప్రవేశం పొందినవారి సంఖ్య రికార్డుస్థాయికి చేరింది. 2013–14లో ఐఐటీ, ఐఐఎం, ఎన్‌ఐటీల సంఖ్య 59. వీటిసంఖ్య 2025–26 నాటికి 76కు పెరిగింది. 2013–14 నుంచి 2025–26 మధ్య ఏడు ఐఐటీలు, తొమ్మిది ఐఐఎంలు, ఒక ఎన్‌ఐటీ ఏర్పాటయ్యాయి. 2017–18లో ఐఐటీ, ఎన్‌ఐటీల్లో మొత్తం విద్యార్థులు 1.62 లక్షల మంది ఉండగా.. ఈ సంఖ్య  27 శాతం వృద్ధితో 2023–24 విద్యాసంవత్సరానికి 2.44 లక్షలకు పెరిగింది. 

ఐఐఎంలలో విద్యార్థుల సంఖ్య 2017–18లో 9,298 ఉండగా.. 2023–24 నాటికి 18,243కు పెరిగింది. ఐఐఎం పీజీ  ప్రోగ్రామ్‌లలో 2017–18లో 26.3 శాతం ఉన్న విద్యార్థినుల సంఖ్య 2023–24లో 37.7 శాతానికి పెరిగింది. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో విద్యార్థినుల వాటా సుమారు 20 శాతం. అంటే 2023–24లో ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థల్లో ప్రతి ఐదుగురు విద్యార్థుల్లో ఒక విద్యార్థిని, ఐఐఎంలలో ప్రతి ముగ్గురు విద్యార్థుల్లో ఒక విద్యార్థిని ఉన్నారు. 

వేతనాలు రెట్టింపు
ఐఐఎంలలో ప్లేస్‌మెంట్ల సంఖ్య 2015–16లో సుమారు 7,500 ఉండగా 2023–24లో ఈ సంఖ్య 13,700కి పెరిగింది. ఇదేకాలంలో ఐఐటీల్లో ఈ సంఖ్య 9,500 నుంచి 17,500కి పెరిగింది. ఎన్‌ఐటీల్లో కూడా ఇదేకాలంలో ప్లేస్‌మెంట్లు సుమారు 18 వేల నుంచి 29 వేలకు చేరింది. మొత్తం విద్యార్థుల్లో 93 శాతం మందికి ప్లేస్‌మెంట్లు లభించాయి. ఐఐఎం, ఐఐటీ, ఎన్‌ఐటీలు అన్నింటిలోను 2025–26తో పోలిస్తే 2023–24 నాటికి ఉద్యోగాలు పొందినవారిలో సగం మందికిపైగా వేతనం 105 శాతం పెరిగింది. ఐఐఎంలలో చదువుకుని ఉద్యోగాలు పొందివారిలో సగం మందికిపైగా వేతనం 2023–24లో రూ.40 లక్షల మార్కును దాటింది. గత తొమ్మిదేళ్లలో ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో చదువుకుని ఉద్యోగాలు పొందినవారిలో సగం మందికిపైగా వేతనం రెట్టింపు అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement