కాకినాడ జిల్లా సామర్లకోటలో నిర్మించిన వైఎస్సార్ జగనన్న కాలనీ (ఫైల్)
నిరుపేదలకు పక్కా ఇళ్ల కల్పనలో దొంగ లెక్కలతో బాబు సర్కారు మోసం
వైఎస్ జగన్ పాలనలో మంజూరైన ఇళ్లను పూర్తి చేయడంలోనూ వైఫల్యం
1.70 లక్షలకు పైగా ఇళ్లు కట్టకుండానే కట్టేసినట్టు కాకిలెక్కలు
2024 జూన్ నుంచి 5.50 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్టు ప్రచారం
పేదలకు ఉచితంగా స్థలాలు ఎక్కడా పంపిణీ చేయని దుస్థితి
అన్ని హామీలకు తిలోదకాలిస్తూ.. ప్రచారం మాత్రం తారస్థాయిలో
సాక్షి, అమరావతి: ‘నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు.. లేదా ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల భృతి. ప్రతి మహిళకు నెలకు రూ.1,500 సాయం’ వంటి సూపర్ సిక్స్‌తోపాటు ఇతర హామీలకు దిక్కు మొక్కు లేకున్నా.. హామీలన్ని అమలు చేసేశామని సీఎం చంద్రబాబు ఊదరగొడుతున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలో నిరుపేదలకు పక్కా గూడు కల్పనలోనూ దొంగ లెక్కలతో వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం బురిడీ కొట్టించేస్తోంది. పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం మంజూరు, పక్కా ఇళ్ల నిర్మాణం అంటూ 2024 ఎన్నికల మేనిఫెస్టో ద్వారా చంద్రబాబు హామీలు ఇచ్చారు.
గద్దెనెక్కి రెండేళ్లయినా పేదలకు గజం స్థలం మంజూరు చేసిన పాపాన పోలేదు. పక్కా గృహాల మంజూరు తూతూ మంత్రంగా ఉంది. తానిచ్చిన హామీలను అమలు చేయకపోగా, గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం విషయంలోనూ పేదలను నిలువునా దగా చేసేస్తున్నారు. ఏకంగా 1.70 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండానే చేసేసినట్టు దొంగ లెక్కలు చూపిస్తూ ఏకంగా ప్రభుత్వమే 420 వేషాలు వేస్తోంది. ఈ అంశం గత కొద్ది నెలలుగా గృహ నిర్మాణ శాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కాకి లెక్కలతో షో
చంద్రబాబు ప్రభుత్వం గతేడాది నవంబర్, ఈ ఏడాది మార్చిలో రెండు పర్యాయాలు సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం పేరిట హడావుడి చేసింది. రెండు విడతల్లో 5.50 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందించినట్టు డబ్బా కొట్టుకుంది. ఈ క్రమంలో వాస్తవాలు పరిశీలిస్తే ఆ ఇళ్లన్నీ కూడా గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంజూరు చేసి, నిర్మించినవే. సీఎం చంద్రబాబు పేదలకు పంపిణీ చేసిన ఇంటి ధ్రువీకరణ పత్రాల్లోనూ 2019–24 మధ్య ఆ ఇళ్లు మంజూరు చేసినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో బాబు సర్కార్ నవ్వులపాలైంది.
ఇదిలా ఉండగా, గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్లను తన ఖాతాలో వేసుకునే క్రమంలో వాస్తవ లెక్కలను సైతం చంద్రబాబు సర్కారు కప్పెట్టేసినట్టు విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు రెండేళ్లలో నిరి్మంచినట్టు ప్రచారం చేసుకున్న 5.50 లక్షల ఇళ్లు గత ప్రభుత్వంలో వైఎస్సార్, జగనన్న కాలనీల్లో మంజూరు చేసినవే. వీటిలో 1.70 లక్షలకు పైగా ఇంకా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అరకొర నిర్మాణంలో ఉన్న ఇళ్లను సైతం పూర్తి చేసినట్టు కాకి లెక్కలు చూపి సామూహిక గృహ ప్రవేశాల పేరిట చంద్రబాబు రాష్ట్రంలో పెద్ద షో చేశారు.
బాబు చేసింది శూన్యం
రాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇళ్లు కల్పనే లక్ష్యంగా గత వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల స్థలాలను ఉచితంగా మహిళల పేరిట పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం ద్వారా ఏకంగా 17 వేలకుపైగా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
జగనన్న కాలనీల్లో 19 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. వీటికి టిడ్కో ఇళ్లు 2.62 లక్షలు అదనం. కాగా, ఎన్నికలు ముగిసే నాటికి 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వం లబి్ధదారులకు అందజేసింది. ఇక సాధారణ ఇళ్లలో 8 లక్షలకు పైగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఈ ఇళ్ల నిర్మాణాన్ని చంద్రబాబు గాలి కొదిలేశారు. కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం నిర్మాణం పూర్తవ్వని ఇళ్లను సైతం పూర్తి చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు.


