తాగునీటిపై నీటి మూటలు | 80 percent of the work on the drinking water projects in Pulivendula was completed by the previous govt | Sakshi
Sakshi News home page

తాగునీటిపై నీటి మూటలు

Oct 5 2026 3:40 AM | Updated on Oct 5 2026 3:40 AM

80 percent of the work on the drinking water projects in Pulivendula was completed by the previous govt

ఇంటింటికీ తాగునీరు–కొళాయి కనెక్షన్‌’ సూపర్‌ సిక్స్‌ 2.0 హామీకి నీళ్లు వదిలిన చంద్రబాబు 

మూడేళ్లుగా పట్టించుకోకుండా ‘స్థానిక’ ఎన్నికల ముందు నేడు మరో స్టంట్‌

గత ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలు రద్దు చేసి తాజాగా శంకుస్థాపన డ్రామాలు

ఉద్దానం తాగునీటి పథకాలు లాంటివి ఒక్కటంటే ఒక్కటీ పూర్తి చేయని బాబు సర్కారు

పులివెందులలో మంచినీటి పథకాల పనులు గత ప్రభుత్వంలోనే 80 శాతం పూర్తి

వైఎస్‌ జగన్‌ హయాంలోనే దాదాపు రూ. 27 వేల కోట్లతో జలజీవన్‌ కార్యక్రమాలు

రాష్ట్రంలో 39,34,701 ఇళ్లకు కొత్తగా తాగునీటి కొళాయిలు గత సర్కారు చొరవే

సాక్షి, అమరావతి: ఒకవైపు వ్యవసాయానికి సాగునీటిపై రైతులను మభ్యపుచ్చి నిండా ముంచేసిన చంద్రబాబు సర్కారు స్థానిక ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాలకు తాగునీటిపైనా మరో డ్రామాకు సిద్ధమైంది! రెండున్నరేళ్లుగా రక్షిత మంచినీటి సరఫరా పథకాల ఊసెత్తకుండా  హడావుడిగా సోమవారం వైఎస్సార్‌ కడప జిల్లాలో ‘జేజేఎం–అమరజీవి జలధార’ పనుల శంకుస్థాపనకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 2019–24 మధ్య మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రాష్ట్రంలో 39,34,701 ఇళ్లకు కొత్తగా తాగునీటి కొళాయిలు ఏర్పాటుచేయగా చంద్రబాబు సర్కారు కేవలం 2,69,735 ఇళ్లకు మాత్రమే అందించింది. 

కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉద్దానం లాంటి తీవ్ర సమస్యాత్మక ప్రాంతంలో రూ.700 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని పూర్తిచేస్తే చంద్రబాబు సర్కారు అలాంటిది ఒక్కటంటే ఒక్క పథకాన్ని ఇప్పటివరకు పూర్తిచేయలేదు. పులివెందుల పరిధిలోని ఏడు మండలాల్లో గ్రామాల తాగునీటి అవసరాలను తీర్చేందుకు రూ. 480 కోట్లతో సమగ్ర మంచినీటి పథకం నిర్మాణ పనులు వైఎస్సార్‌సీపీ హయాంలోనే 80 శాతానికి పైగా పూర్తవగా మిగిలిన పనులను రెండేళ్లుగా పూర్తి చేయకుండా చంద్రబాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. 

స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట ప్రొద్దుటూరు వేదికగా ‘జేజేఎం–అమరజీవి జలధార’ పనుల శంకుస్థాపన పేరుతో మరో నాటకానికి తెర తీసినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.  ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన పనులను రద్దు చేసిన చంద్రబాబు సర్కారు వాటిలో కొన్నింటిని ఇప్పుడు తిరిగి తెరపైకి తేవడం మినహా కొత్తగా చేసిందేమీ లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక కేంద్రం జలజీవన్‌ మిషన్‌ కార్యక్రమాన్ని 2028 వరకు దేశమంతటా పొడిగించగా దానినీ సీఎం చంద్రబాబు తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారు.

గత ప్రభుత్వంలోనే దాదాపుగా పూర్తి.. 
రాష్ట్రంలో ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటిని అందించే లక్ష్యంతో వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉండగా జల జీవన్‌ మిషన్‌లో భాగంగా రూ. 26,823 కోట్లతో రక్షిత సమగ్ర తాగునీటి పథకాల నిర్మాణాలతో పాటు మరో 77,917 గ్రామ స్థాయి రక్షిత మంచినీటి పథకాలు, తాగునీటి కొళాయిల ఏర్పాటు పనులను మంజూరు చేసింది. ఉద్దానం లాంటి పథకాలు పూర్తికాగా పులివెందుల, డోన్‌ వంటి సమగ్ర రక్షిత పథక నిర్మాణ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. రాష్ట్రంలో మూడో వంతుకు పైగా ఇళ్లకు గత ప్రభుత్వంలోనే తాగునీటి కొళాయిల ఏర్పాటు పూర్తవగా మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. 

‘ఇంటింటికీ రక్షిత తాగునీరు– ప్రతి ఇంటికీ కొళాయి కనెక్షన్‌’ ఏర్పాటు చేస్తామంటూ సూపర్‌ సిక్స్‌ 2.0 హామీల్లో చంద్రబాబు పేర్కొన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక 25 శాతానికి లోపే పనులు జరిగాయనే సాకుతో రూ.10.680.50 కోట్లతో గత ప్రభుత్వం మంజూరు చేసిన 44,194 చిన్న పనులతో పాటు రూ. 750 కోట్ల సమగ్ర రక్షిత మంచినీటి పథకం పనులను సైతం రద్దు చేశారు. రెండేళ్లకుపైగా కాలయాపన చేసి గతంలో రద్దు చేసిన పనుల స్థానంలో జల జీవన్‌ మిషన్‌ కార్యక్రమాలను మంజూరు చేసింది. వీటిని ఇప్పడే కొత్తగా మంజూరు చేసి ప్రారంభోత్సవాలు చేస్తున్నట్లు హడావుడి చేస్తోంది.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన తాగునీటి పథకాల పనులను రద్దు చేస్తూ చంద్రబాబు సర్కారు జారీ చేసిన ఉత్తర్వులు   

రద్దు చేసి..  కేంద్రం చుట్టూ ప్రదక్షిణ
2024 డిసెంబరు 21న రద్దు చేసిన 44 వేల పనుల నిధులతో  కేవలం బడా కాంట్రాక్టర్లు మాత్రమే చేపట్టే ఏడు సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్మాణ పనులకు చంద్రబాబు సర్కారు పచ్చ జెండా ఊపింది. మొత్తం రూ. 9,355 కోట్లతో  ఏడు సమగ్ర రక్షిత మంచినీటి పథకాలకు ఈ ఏడాది మార్చి 26న ఆదేశాలిచ్చింది. తర్వాత వీటినే పది మంచి నీటి పథకాలుగా మార్పు చేస్తూ 2026 జులై 22న మరో జీవో జారీ చేసింది. వీటి టెండర్ల ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. 

అయితే ఒకసారి రద్దు చేసి మళ్లీ మంజూరు చేసిన పనులకు 50 శాతం వాటా నిధులు పొందాలంటే వాటికి కేంద్రం ఆమోదం తీసుకోవాలి. ఈ అనుమతులు ఇప్పటికి కేంద్రం మంజూరు చేయలేదని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా ఫలితం రాలేదు. కేంద్రం నుంచి అనుమతి రాకుండానే శంకుస్థాపన కార్యక్రమాలకు ప్రభుత్వం సిద్ధమైందని అధికారులు పేర్కొంటున్నారు. 

కార్పొరేషన్‌ పేరుతో రుణాలు..
జల్‌ జీవన్‌ వాటర్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ పేరుతో చంద్రబాబు  సర్కారు  రూ.13,650 కోట్ల రుణ సమీకరణకు అనుమతి ఇచ్చింది . ఇప్పటికి  రూ. 1,600 కోట్లు అప్పులు చేసినా గ్రామాల్లో మంచినీటి నిర్మాణ పనుల పురోగతి లేదు. కోవిడ్‌లోనూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ పథకాల కోసం రుణాలు తీసుకోకుండా దీర్ఘకాలిక కిడ్నీ జబ్బుల బాధిత ప్రాంతం ఉద్దానంలో రూ. 700 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకం మొదలు పెట్టి పూర్తి చేయడం గమనార్హం. 

మరో రూ. 750 కోట్లతో పులివెందుల, డోన్‌ నియోజకవర్గాల్లో పనులను దాదాపు పూర్తి చేసింది. పైగా 2014–19 మధ్య టీడీపీ హయాంలో మంచినీటి పథకాల పేరిట తెచ్చిన అప్పుల్లో రూ. 300 కోట్ల మేర వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వడ్డీతో సహా తీర్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. చంద్రబాబు సర్కారు మంచినీటి పథకాల పేరిట ఇటీవల తెచ్చిన అప్పులో దాదాపు రూ. 200 కోట్లు ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన కొందరు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ల రూపంలో చెల్లించారనే విమర్శలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement