
పాక్‌కు భారత్ హెచ్చరిక
న్యూఢిల్లీ: భారత్‌ను హెచ్చరిస్తూ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రస్థాయిలో స్పందించింది. కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలుచేస్తూ దుస్సాహసానికి పాల్పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని పాకిస్తాన్‌ను గురువారం భారత్ హెచ్చరించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ఒక ప్రకటన విడుదలచేశారు.
‘‘భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ నేతలు తరచూ పూర్తి నిర్లక్ష్యపూరిత, యుద్దోన్మాద, విద్వేషపూరిత వ్యాఖ్యానాలు చేస్తున్నారు. పాకిస్తాన్ తన గత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేంకు భారత వ్యతిరేక వాణిని తరచూ వినిపిస్తోంది. మరోసారి ఏదైనా కవ్వింపు చర్యలతో దుస్సాహసానికి తెగిస్తే తీవ్రమైన పర్యావసా నాలను చవిచూడాల్సి వస్తుంది. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్‌తో భారత్ తన సత్తాను మీకు రుచి చూపించింది’’ అని జైశ్వాల్ అన్నారు.
ఇటీవల అమెరికాలో పర్యటించినవేళ ట్రంప్ భేటీ సమయంలో భారత్‌నుద్దేశిస్తూ మునీర్ హెచ్చరిక వ్యాఖ్యలు చేయడం తెల్సిందే. ‘‘ భారత్ కారణంగా పాకిస్తాన్ ఉనికి ప్రశ్నార్థకంగా మారితే అణుబాంబు ప్రయోగానికికైనా సిద్ధం. మా దేశం ఇబ్బందుల్లో పడితే సగం ప్రపంచాన్ని మాతోపాటు సమస్యల సుడిగుండంలోకి తీసుకెళ్తాం’’ అని వ్యాఖ్యానించారు. మునీర్ వ్యాఖ్యలపై ఆనాడే భారత్ ఘాటుగా బదులిచ్చింది. ‘‘ అణు బెదిరింపులకు భయపడేది లేదు. పాతకాలంనాటి అణుబెదిరింపులు ఆపితే మంచిది. అణ్వాయుధాలు ప్రయోగిస్తామనడం పూర్తి బాధ్యతారాహిత్యం. సైన్యం కనుసన్నల్లో పాలన వెళగబెట్టే పాక్ లాంటి దేశం నుంచి ఇలాంటి అణుబెదిరింపులు రావడం అంతర్జాతీయ సమాజానికి అత్యంత ప్రమాదకరం’’ అని భారత్ ఆందోళన వ్యక్తంచేసింది.