పాకిస్తాన్‌కు బిగ్‌ షాక్‌.. భారత్‌ దెబ్బ అదుర్స్‌ | India Slams Pakistan At UN, Says Indus Waters Treaty Must Evolve With Changing Times, More Details Inside | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు బిగ్‌ షాక్‌.. భారత్‌ దెబ్బ అదుర్స్‌

Jun 19 2026 8:54 AM | Updated on Jun 19 2026 10:01 AM

Anupama Singh Strong Counter To Pakistan Over Sindhu Water

దాయాది దేశం పాకిస్తాన్‌పై భారత్‌ మరోసారి విరుచుకుపడింది. ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్‌, పాక్‌ మధ్య సింధూ జలాల ఒప్పంద విషయంలో పాకిస్తాన్‌ను కడిగిపారేసింది. పాత ఒప్పందానికి ఇప్పుడు కాలం చెల్లిపోయిందని గట్టి హెచ్చరికలు చేసింది. అలాగే, అంతర్జాతీయ వేదికలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనే పాక్‌ కుటిల ప్రయత్నాలకు భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటరిచ్చింది.

జెనీవాలో శుక్రవారం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 62వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత్‌ తన 'రైట్ ఆఫ్ రిప్లై'ను ఉపయోగించుకుంది. ఈ సందర్భంగా భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ అనుపమ సింగ్ మాట్లాడుతూ.. భారత్‌పై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరి అత్యంత స్పష్టంగా ఉందన్నారు. ఒకవైపు ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధానంగా మార్చుకున్న పాకిస్తాన్‌, అంతర్జాతీయ సహకార ఫలాలను, డిమాండ్ చేయడం ఆ దేశ అవివేకానికి నిదర్శనమన్నారు. 1960లో కుదిరిన ఈ ఒప్పందం ప్రస్తుత పరిస్థితులకు, మారుతున్న ప్రపంచ పరిణామాలకు ఎంతమాత్రం సరిపోదని తేల్చి చెప్పారు. కాలం మారిందని, అలాగే ఒప్పందం కూడా మారాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆరు దశాబ్దాల నాటి ఈ ఒప్పందాన్ని ఎప్పటికీ చెక్కుచెదరని శాశ్వత హక్కుగా లేదా జవాబుదారీతనం లేని అధికారంగా భావించలేమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ వేదికలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనే పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పాలన్నారు.

అలాగే, పాక్‌ను ఫ్రాంకెన్‌స్టైన్ స్టేట్ (సొంతంగా సృష్టించిన భూతం చేతిలోనే నాశనమయ్యే పరిస్థితి)గా అభివర్ణించారు. పాక్‌ తన అంతర్గత సవాళ్ల పరిష్కారంపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. పాక్ రక్షణ మంత్రే స్వయంగా ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, వారిని మోహరించడం తమ ప్రభుత్వ విధానమని గతంలో బహిరంగంగానే అంగీకరించారని ఆమె గుర్తు చేశారు. అంతటి ఉగ్రవాద చరిత్ర ఉంచుకుని, మళ్లీ తామే ఉగ్రవాద బాధితులమని పాక్ చెప్పుకోవడం ఒక పెద్ద హాస్యాస్పదంగా ఉందన్నారు. వారు పెంచిన ఉగ్రవాద భూతమే ఇప్పుడు తనను తిరిగి కరుస్తుంటే పాక్ షాక్‌కు గురవుతోందని దుయ్యబట్టారు.

అయితే, గతేడాది పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో, పాకిస్తాన్ ఉగ్రవాదానికి స్వస్తి పలికేంత వరకు సింధూ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భారత్ నిర్ణయించింది. పాకిస్తాన్‌ మనుగడ పూర్తిగా సింధూ నదీ వ్యవస్థపైనే ఆధారపడి ఉంది. పాక్‌లో 16 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమిలో దాదాపు 80 శాతం భూమికి ఈ నదీ జలాలే ఆధారం. అంతేకాకుండా, ఆ దేశం ఉపయోగించే మొత్తం నీటి వినియోగంలో 93 శాతం సింధూ నది నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో, తన దేశ ఆర్థిక, భౌగోళిక మనుగడకు కారణమైన నదీ జలాల విషయంలో పాక్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని భారత్ సూచించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement