లక్నో: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వెలువడిన అన్ని ఎగ్జిట్ పోల్స్‌ను సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తోసిపుచ్చారు. అవి అధికార పార్టీ రూపొందించిన కల్పిత సర్వేలని అభివర్ణించారు. మార్పును కోరుతూ ఎన్నికల్లో ఓటువేసిన ఓటర్లను ఆయన అభినందించారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడుపుతూ, యువతకు ఉద్యోగాలను సృష్టించే ప్రగతిశీల ప్రభుత్వం బీహార్‌లో త్వరలో ఏర్పడబోతోందని అఖిలేష్ పేర్కొన్నారు.
అఖిలేష్ తన ‘ఎక్స్’ పోస్టులో బీహార్‌లోని ప్రతి ఓటరకు అభినందనలు తెలిపారు. ఉద్యోగాలను సృష్టించే కొత్త ప్రగతిశీల ప్రభుత్వం ఏర్పడుతుందంటూ, ముందస్తు అభినందనలు తెలిపారు. అధికార పార్టీ తప్పుదారి పట్టించే ఎగ్జిట్ పోల్స్‌ను రూపొందించిందని ఆయన విమర్శించారు. ఇవి ప్రజలను గందరగోళపరిచేలా ఉన్నాయన్నారు. ఎన్నికల కమిషన్ ఓట్ల లెక్కింపునకు అన్ని రోజులు తీసుకుంటే, ఈ ఛానెల్స్ కేవలం ఒక గంటలో ఫలితాలను ఎలా అందించగలవు? వారి తప్పుడు గ్రాఫిక్స్ కొన్ని రోజుల ముందుగానే తయారవుతాయి. వారు ‘వనరులు’ అందించే వారితో పొత్తు పెట్టుకుంటారు’ అని ఆరోపించారు.
ఈ ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మేవారు ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను పరిశీలించాలని అఖిలేష్ యాదవ్ సూచించారు. నాడు యూపీలో చాలా మంది ప్రముఖ బీజేపీ నేతలు ఓటమిని చవిచూశారన్నారు. బీహార్‌లో మహాకూటిమికి చెందిన చెందిన ప్రతి సభ్యుడు, అభ్యర్థి, మద్దతుదారుడు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అక్రమాలు జరిగితే వాటిని నిరోధించాలని విజ్ఞప్తి చేశారు. ఓటింగ్ యంత్రాల స్థానాలను నిశితంగా పరిశీలించాలని, కౌంటింగ్ రోజున 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘మహాకూటమి గెలుస్తోంది. మీకు విజయ ధృవీకరణ పత్రం వచ్చే వరకు విశ్రాంతి తీసుకోకండి’ అని ఆయన అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: Delhi blast: అయోధ్యలో స్లీపర్ సెల్? వారణాసిలో..


