స్కూల్ ఉద్యోగాల కుంభకోణంలో అరెస్టయిన పార్థ చటర్జీ
కోల్‌కతా: స్కూల్ సిబ్బంది నియామకాల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ ఎట్టకేలకు బెయిల్ లభించింది. మంగళవారం ఆయన అలీపూర్ జైలు నుంచి విడుదలయ్యారు. 2016లో చేపట్టిన స్కూళ్లలో బోధనేతర సిబ్బంది నియామకాల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఛటర్జీపై అభియోగాలు వచ్చాయి. దీంతో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు 2022 జూలై 23న అరెస్ట్ చేశారు.
అనారోగ్యానికి గురైన ఆయన్ను అధికారులు ఏప్రిల్‌లో ముకుందాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. సోమవారం ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు మొత్తం 8 మంది సాక్షుల వాంగ్మూలాల నమోదు పూర్తయినందున ఆయనకు బెయల్ ఇచ్చేందుకు అంగీకరించింది.
చదవండి: లగ్జరీ అపార్ట్‌మెంట్ : గోడకు పెన్సిల్‌తో రంధ్రం?! వైరల్ వీడియో
ఈ మేరకు కోర్టు ఆదేశాలు వెలువడటంతో ప్రెసిడెన్సీ జైలు అధికారులు ఛటర్జీని విడుదల చేశారు. సాక్షుల వాంగ్మూలాల నమోదు పూర్తయితే పార్థ ఛటర్జీకి బెయిలివ్వ వచ్చునంటూ ఆగస్ట్ 18వ తేదీన సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతకుముందే, ఛటర్జీకి ఈడీ కేసుల్లో బెయిల్ మంజూరైంది. ఆయన్ను మరే లాభదాయక పదవుల్లో నియమించరాదనే షరతుతో కలకత్తా హైకోర్టు సెప్టెంబర్ 26న బెయిల్‌కు పచ్చజెండా ఊపింది. బెయిల్‌పై పార్థ ఛటర్జీ విడుదలవడంతో కోల్‌కతాలోని ఆయన నివాసం వద్ద టీఎంసీ కార్యకర్తలు హడావుడి చేశారు.
ఇదీ చదవండి: 100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద


