యుక్త వయసు.. జీవితంలో చాలా కీలకమైన దశ. కానీ, ఈ తరుణంలో శరీరంలో వచ్చే మార్పులు యువతను చాలా ప్రభావితం చేస్తాయి. అదే సమయంలో తల్లిదండ్రులు, సమాజం వారి నుంచి ఆశించడమూ మొదలవుతుంది. ఇవన్నీ కలిసి వారిలో ఒత్తిడి, ఆందోళన పెంచుతాయి. ఏ సందర్భంలో విఫలమైనా నిరాశ పరిచి, కుంగదీస్తాయి. యువత ఎలాంటి సమస్యనైనా సింహాల్లా పరిష్కరించగలరు అన్నారు స్వామి వివేకానందుడు. వారు సింహాల్లా ఎదగాలంటే ఏం చేయాలి..
ఎవరి పాత్ర ఏమిటి?
ఏషియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. 70 శాతం మంది విద్యార్థుల్లో నిత్యం మధ్యస్థం నుంచి తీవ్ర స్థాయి ఆందోళన కనిపించిందట. సగానికిపైగా విద్యార్థుల్లో నిరాశా నిస్పృహలు పట్టి పీడిస్తున్నాయి. మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే.. 65 శాతం మంది తమ భావోద్వేగాలను లేదా ప్రవర్తనను నియంత్రించుకోలేకపోతున్నారట.
అనేక కారణాలు
‘టీనేజర్ జీవితం చాలా కీలకమైనది. వారి శరీరంలో జరిగే మార్పుల ప్రభావం ఒక ఎత్తయితే.. సమాజంలో గుర్తింపుకోసం వారు పడే ఆరాటం మరొక ఎత్తు. ‘డిజిటల్ ప్రపంచం’ వారిని ఊపిరి సలపనివ్వకుండా చేస్తోంది’ అంటున్నారు మానసిక నిపుణులు. మీ పిల్లల్లో అలసట, ఒత్తిడి, ఆందోళన, బాధ, కోపం వంటి వాటికి ఈ కింది అంశాలు కారణాలు కావచ్చు.
» చదువు ఒత్తిడి
» సోషల్ మీడియా, స్నేహితుల ప్రభావం
» వీడియో గేమ్స్ అతిగా ఆడటం
» సంబంధాలను సరిగ్గా మేనేజ్ చేయలేకపోవడం
» అతి సమాచారం (చదువు లేదా వినోదం) వల్ల మెదడుపై అధిక ఒత్తిడి
» బంధువులు లేదా బయటివాళ్లు భయపెట్టడం లేదా తీవ్రమైన ఒత్తిడికి గురిచేయడం
» ప్రమాదాలు లేదా దుర్ఘటనలు
» ఆర్థికపరమైన అంశాలు
» వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన సమస్యలు
వీటి ఫలితంగా టీనేజర్లు దేనిమీదా శ్రద్ధ పెట్టలేరు. ఆహారం సరిగ్గా తీసుకోరు. నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఇవి శారీరక, మానసిక అనారోగ్యాలకు దారితీస్తాయి.
ఇలా చేసి చూడండి!
టీనేజర్లు అంటే రేపటి పౌరులు. వారు అన్ని విధాలా ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లిదండ్రులూ, వాళ్లు చదివే కాలేజీల యాజమాన్యాలూ శ్రద్ధ పెట్టాలి.
» ‘చదువు, చదువు’ అని వారిని ఒత్తిడి చేయడం తగ్గించాలి.
» శారీరక వ్యాయామం ముఖ్యమనే విషయం వారికి అర్థమయ్యేలా చెప్పాలి.
» కాలేజీల్లో జీవన నైపుణ్యాలు నేర్పించాలి. కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలి.
» చదువు ఒక్కటే కాకుండా, ఆటలు వంటి పాఠ్యేతర కార్యకలాపాలు కూడా నిర్వహిస్తుండాలి.
» రోజులో కనీసం 8–9 గంటలు నిద్రపోయేలా చూడాలి.
» రాత్రిపూట నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందే.. సెల్‌ఫోన్ లేదా టీవీ లేదా కంప్యూటర్‌లను దూరం పెట్టాలి.
» తల్లిదండ్రులు తాము చెప్పేది శ్రద్ధగా వింటారు.. తమ సమస్యకు పరిష్కారం చూపగలుగుతారు అనే నమ్మకం పిల్లల్లో కలిగించాలి.
» ముఖ్యంగా అమ్మాయిలు లైంగిక హింస లేదా దాడులకు గురైనప్పుడు వారిని ఓదార్చడం, ఆ క్షోభ నుంచి వారు బయటపడేలా చేయడంలో తల్లిదండ్రులే కీలకం.
తల్లిదండ్రులూ.. గమనించండి!
పిల్లలను తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ ఉండాలి. వారి వ్యవహార ధోరణి, ఆహారపు అలవాట్లు, ఫోన్ వాడకం.. వీటన్నింటినీ పరిశీలించాలి. ఇంటికి వచ్చి వెళ్లే స్నేహితులు, బంధువులమీద కూడా ఒక కన్ను వేయాలి. వారి వల్ల కూడా పిల్లలు ప్రభావితం కావచ్చు. మీ పిల్లల్లో ఈ కింది లక్షణాలు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి.
» ప్రతి పనికీ అలసిపోవడం లేదా ఎప్పుడు చూసినా అలసటగా కనిపించడం
» ఏ పనిమీదా శ్రద్ధ పెట్టలేకపోవడం
» భావోద్వేగాలు వెంటవెంటనే మారిపోతుండటం
» ఆకలి లేకపోవడం
» తరచూ ఒంటి నొప్పులు అనడం
» ఏ విషయాన్నీ సరిగ్గా వ్యక్తీకరించలేకపోవడం
అమ్మాయిలపైనా ప్రభావం
కేంద్ర నేర గణాంక విభాగం (ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం 2022లో 13,044 మంది విద్యార్థులు బలవంతంగా తమ ప్రాణాలు తీసుకున్నారు. 2023లో ఈ సంఖ్య 13,892కు పెరిగింది. సాధారణంగా అబ్బాయిలే ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతుంటారు అనుకుంటారు అందరూ. కానీ, 2021–23 మధ్య.. అమ్మాయిల సంఖ్య కూడా పెరగడం గమనార్హం.


