పాక్‌ను వీడుతున్న భారతీయులు.. ఎంత మంది వచ్చారంటే? | Over 450 Indians Leave From Pakistan Via Wagah Border, Know How Many People Went To Pakistan | Sakshi
Sakshi News home page

పాక్‌ను వీడుతున్న భారతీయులు.. ఎంత మంది వచ్చారంటే?

Apr 27 2025 7:13 AM | Updated on Apr 27 2025 4:31 PM

450 Indians Leave From Pakistan

లాహోర్‌: పహల్గాం ఉగ్రదాడి కారణంగా భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రికత్తలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులు.. పాకిస్తాన్‌ నుంచి స్వదేశం చేరుకుంటున్నారు. మూడు రోజుల్లో 450 మందికి పైగా భారతీయులు పాక్‌ను వీడారు. వాఘా సరి హద్దు గుండా వారంతా భారత్‌కు చేరుకున్నారు.  

శనివారం పాక్‌ను వీడిన వారిలో పీఎస్‌ఎల్‌ (పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌) 2025 ప్రసార సంస్థలో భాగమైన 23 మంది భారతీయులు ఉన్నారని పాక్‌ అధికారులు తెలిపారు. శుక్రవారం 300 మంది, గురువారం 100 మంది భారతీయులు ఇదే మార్గంలో స్వదేశానికి తిరిగి వెళ్లారని వెల్లడించారు. ఇక 200 మంది పాకిస్తానీయులు భారత్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారని పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో దీర్ఘకాలిక వీసాలు, ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ), ‘రిటర్న్‌ టు ఇండియా’ స్టాంపులు ఉన్నవారు సరిహద్దు దాటడానికి అధికారులు నిరాకరించారు.

మరోవైపు సిక్కు కుటుంబాలతో సహా కొందరు భారత సంతతి కి చెందిన విదేశీయులను భారత ఇమ్మిగ్రేషన్, భద్రతా అధికారులు పాకిస్తాన్‌లోకి ప్రవేశించ కుండా అడ్డుకున్నారు. లాహోర్‌కు 80 కిలోమీ టర్ల దూరంలోని నాన్‌కానా సాహిబ్‌లో నివసి స్తున్న భారత సంతతికి చెందిన కెనడియన్‌ సిక్కు కుటుంబం వాఘా సరిహద్దు గుండా భారత్‌లోకి ప్రవేశించడాన్ని అడ్డుకున్నారు. దుబాయ్‌ మీదుగా విమాన మార్గం గుండా ప్రయాణించాలని సూచించారు.

అటారీ–వాఘా సరిహద్దు మూసివేత.. ఆగిపోయిన బ్యాండ్, బాజా, బరాత్‌..!
భారత్, పాకిస్తాన్‌ల మధ్య రాజుకున్న ఉద్రిక్తతలు.. సరిహద్దుల మూసివేత సామాన్యులకు ఎన్నో అవస్థలు తెచ్చిపెట్టాయి. రాజస్తాన్‌లోని బర్మేర్‌కు చెందిన షైతాన్‌ సింగ్‌ అనే యువకుడికి పాకిస్తాన్‌లోని సింధు ప్రావిన్స్‌కు చెందిన కేసర్‌ కన్వర్‌తో నాలుగేళ్ల క్రితమే పెళ్లి నిశ్చయమైంది. వరుడికి, అతడి కుటుంబీలకు వీసా దొరక్క పెళ్లి ఇప్పటిదాకా జరగలేదు. ఫిబ్రవరి 28న వీసాలు మంజూరయ్యాయి. ఈ నెల 30వ తేదీన సింధ్‌ ప్రావిన్స్‌లోని అమర్‌కోట్‌లో వధువు ఇంట్లో వివాహ వేడుక జరగాల్సి ఉంది. ఇందుకోసం సరిహద్దులకు రెండువైపులా ఉన్న కుటుంబాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇంతలోనే చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలతో బుధవారం అట్టారీ–వాఘా సరిహద్దును అధికారులు మూసివేశారు. విషయం తెలియని షైతాన్‌ సింగ్‌ కుటుంబం ఊరేగింపుగా అటారీ–వాఘా బోర్డర్‌ పాయింట్‌కు చేరుకుంది. అక్కడ ఆర్మీ అధికారులు అసలు విషయం చెప్పడంతో అంతా షాకయ్యారు.

‘ఎప్పటి నుంచో ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నాం. కానీ, ఇలా జరిగింది’అంటూ షైతాన్‌ సింగ్‌ ఆవేదన చెందారు. ‘మమ్మల్ని ఆహ్వానించేందుకు బోర్డర్‌ పోస్ట్‌ వద్దకు చేరుకున్న మా బంధువులు చేసేది లేక తిరిగి వెళ్లిపోయారు’అని అతడి సోదరుడు చెప్పారు. ఉగ్రదాడుల కారణంగా తమ బంధుత్వాలు కూడా దెబ్బతింటున్నాయని అతడు పేర్కొన్నాడు. అయితే, ఈ కుటుంబానికి మరో చిన్న ఆశ మిగులుంది. అదేంటంటే, వీరి వీసాల గడువు మే 12వ తేదీ వరకు ఉండటం. అప్పటికల్లా తిరిగి సరిహద్దులు తెరుచుకుంటాయని, పెళ్లి జరుగుతుందని ఆశతో వీరున్నారు. కాగా, భారత, పాకిస్తాన్‌ సరిహద్దులకు సమీప ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఉంటున్న సోధా రాజ్‌పుట్‌ వర్గం ప్రజల మధ్య వివాహ సంబంధాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement