ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగానే ఆరు గ్యాంటీలు అమలు అవుతాయి: మంత్రి ఉత్తమ్‌

- - Sakshi

ఆరు గ్యారంటీల అమలుకే ప్రజా పాలన

28వ తేదీ నుంచి దరఖాస్తులనుస్వీకరించాలి

సన్నాహక సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు

హాజరైన మంత్రులు వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు

నల్లగొండ: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు జరుగనున్న ప్రజాపాలన కార్యక్రమ సన్నాహకాల్లో భాగంగా నల్లగొండలోని ఎంఎన్‌ఆర్‌ కన్వెన్షన్‌లో మంగళవారం నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గ్రామ, వార్డు సభల సందర్భంగా ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రజలు ఇచ్చే దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు. దరఖాస్తులు నింపేందుకు.. స్వీకరణకు హెల్ప్‌ డెస్క్‌లు, ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉంటే బృందాల సంఖ్య పెంచాలన్నారు.

ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నాం : మంత్రి ఉత్తమ్‌
రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ప్రభుత్వ ఉద్దేశాలను నెరవేర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణం, రూ.పది లక్షలకు ఆరోగ్యశ్రీ పెంపు అమలు చేశామన్నారు. రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చే కార్యక్రమం త్వరలో మొదలు పెడతామన్నారు.

ప్రజా పాలనలో స్వీకరించే దరఖాస్తుల ఆధారంగానే ఆరు గ్యారంటీల అమలు అవుతాయని చెప్పారు. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖలో జిల్లాకు అన్యాయం జరిగిందని పదేళ్లలో ఒక్క ఎకరాకు కూడా అదనంగా నీరందలేదన్నారు.

ఈ ప్రభుత్వం పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తుందన్నారు. రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ మాఫియాను కఠినంగా శిక్షిస్తామన్నారు. రేషన్‌ సరఫరాను ప్రక్షాళన చేస్తామన్నారు.

తెలంగాణ పునర్నిర్మాణంలో పాలు పంచుకోవాలి : మంత్రి కోమటిరెడ్డి
రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాలసీలను పేదలకు అందే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. ప్రజాపాలన సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా టెంట్లు, మంచినీటి సౌకర్యం, కుర్చీలు, ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.

అధికారులు బాధ్యతాయుతంగా పని చేసి తెలంగాణ పునర్నిర్మాణంలో పాలు పంచుకోవాలన్నారు. బెల్టు షాపులు, గంజాయి అమ్మకాలపై పోలీసులు శ్రద్ధ పెట్టాలని, ఇసుక, గంజాయి, వైన్‌ మాఫియాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌పాటిల్‌ మాట్లాడుతూ ఈ నెల 28 నుంచి జరిగే ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి గ్రామాలు, పట్టణాల్లో 151 బృందాలను ఏర్పాటు చేశామని, సూర్యాపేట జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ సీహెచ్‌.ప్రియాంక మాట్లాడుతూ జిల్లాలో 58 టీమ్‌లు ఏర్పాటు చేసామని, దరఖాస్తుల స్వీకరణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

యాదాద్రి భువనగిరి కలెక్టర్‌ హనుమంతు కె.జెండగే మాట్లాడుతూ జిల్లాలో పక్కా ఏర్పాట్లతో ప్రజా పాలన విజయవంతానికి సిద్ధంగా ఉన్నామని, మొత్తం 51 టీమ్‌లతో దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.

సమావేశంలో ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బాలునాయక్‌, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్‌రెడ్డి, మందుల సామేల్‌, నలమాద పద్మావతి, నల్లగొండ ఎస్పీ అపూర్వరావు, యాదాద్రి డీసీపీ రాజేష్‌చంద్ర, సూర్యాపేట ఏఎస్‌పీ నాగేశ్వర్‌రావు, అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్‌, భాస్కర్‌రావు, వెంకట్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top