ఉన్న కొద్దిపాటి సిబ్బందిపైనే పనిభారం
నడిగూడెం : నడిగూడెం మండల పరిధిలోని నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలో గల పలు మేజరు కాల్వలకు ఏళ్ల తరబడి సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో సంబంధిత అధికారులకు కాల్వల నిర్వహణ భారంగా మారింది. నీటి విడుదల, పలు చోట్ల కంపచెట్లు తొలగింపు, రాళ్ల తొలగింపు పనుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నడిగూడెం, అనంతగిరి, కోదాడ మండలాల పరిధిలోని పలు గ్రామాలకు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారానే వేలాది ఎకరాలకు నీరు అందిస్తున్నారు. లష్కర్ల కొరత కారణంగా ఉన్న కొద్దిపాటి సిబ్బందిపైనే పని ఒత్తిడి పడుతుందని వాపోతున్నారు.
అధ్వానంగా కొమరబండ మేజరు కాల్వ
నడిగూడెం మండల పరిధిలోని రామాపురం గ్రామ సమీపంలో గల నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా 121 కిలోమీటరు వద్ద కొమరబండ మేజరు కాల్వ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి దాదాపు 2520 ఎకరాల ఆయకట్టుకు మేజరు, మైనరు కాల్వల ద్వారా 40 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ కాల్వ రామాపురం, యఖలాస్‌ఖాన్‌పేట, తెల్ల బల్లి గ్రామాల మీదుగా కొమరబండ వరకు దాదాపు 8.50 కిలో మీటర్ల వరకు వెళ్తుంది. ఈ కాల్వపై పలు చోట్ల మైనరు కాల్వలున్నాయి. పలు చోట్ల కంపచెట్లమయంగా, నాచు, పిచ్చిచెట్లు పెరిగి ఉండడంతో చివరి భూములకు నీరందడంలేదని రైతులు వాపోతున్నారు. ఈ కాల్వపై ఇద్దరు లష్కర్లు, ఒక వర్క్ ఇన్‌స్పెక్టర్ ఉండగా ఒక ఏఈ ఉన్నారు. ఈ కాల్వపై కనీసం ముగ్గురు లష్కర్లు ఉండాలి, కానీ ఇద్దరు మాత్రమే ఉన్నారు.
బలహీనంగా కాల్వ కట్టలు
మండల పరిధిలోని చాకిరాల 123 కిలోమీటరు వద్ద ఉన్న నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా ఉన్న కొమరబండ మేజరు కాల్వ శ్రీరంగాపురం, రత్నవరం, వసంతాపురం, వాయిలసింగారం, గోల్‌తండా, అనంతగిరి, శాంతినగర్, గోండ్రియాల, కొత్తగూడెం, మంగళితండా వరకు 26.81 కిలో మీటర్లు దూరం ఉన్న ఈ కాల్వ కింద 16,896 ఎకరాల ఆయకట్టు ఉంది. దీని ద్వారా 270 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ కాల్వకు కనీసం 5 నుంచి 8 మంది లష్కర్లు ఉండాలి. కానీ ముగ్గురు లష్కర్లు, ఇద్దరు వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు.
చివరి భూములకు నీరందని
పాలారం మేజరు కాల్వ
సిరిపురం సమీపంలోని నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా 128.40 కిలో మీటరు వద్ద పాలారం మేజరు కాల్వ ఏర్పాటు చేశారు. ఈ కాల్వ కింద సిరిపురం, వల్లాపురం, త్రిపురవరం, పాలారం, చనుపల్లి గ్రామాల పరిధిలో 4967 ఎకరాల ఆయకట్టు ఉంది. 13 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ కాల్వ నిత్యం సమస్యల వలయంగా మారింది. లైనింగ్ సరిగ్గా లేకపోవడం, కాల్వ కట్టల బలహీనంగా ఉండడం, మేజరు, మైనరు కాల్వల్లో నిత్యం నాచు, కంపచెట్లు పెరుగుతుండడంతో నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. ఈ కాల్వకు ఇద్దరు లష్కర్లు, ఒక వర్క్ ఇన్‌స్పెక్టర్ మాత్రమే ఉన్నారు. సంబంధిత నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు స్పందించి మేజరు కాల్వకు సరిపడా సిబ్బందిని నియమించి, చివరి భూములకు నీరందించేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
సిబ్బందిని నియమించాలి
రత్నవరం వద్ద ఉన్న కొత్తగూడెం మేజరు కాల్వ కట్టలు, మైనరు కాల్వ కట్టలు బలహీనంగా ఉన్నాయి. గతంలో పలుసార్లు కాల్వకు గండ్లు పడ్డాయి. తక్షణమే మరమ్మతులు చేపట్టాలి. కాల్వలను పర్యవేక్షించేందుకు సరిపడా సిబ్బందిని నియమించి చివరి భూములకు నీరందేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
– కురాకుల కృష్ణమూర్తి, రైతు, రత్నవరం


