నల్లగొండ : నల్లగొండలోని ఎస్‌బీఆర్ ఫంక్షన్ హాల్‌లో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు పీఎం విశ్వకర్మ ట్రేడ్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.నవీన్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, అభివృద్ధి సౌలభ్య కార్యాలయం, హైదరాబాద్ ఆధ్వర్యంలో విశ్వకర్మీయ వ్యాపారులకు స్టాల్స్ ఏర్పాటుకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి, విక్రయాల పెంపునకు, వ్యాపార అవకాశాలను విస్తరించుకోవడానికి స్టాల్స్ ఏర్పాటు ఉత్తమ అవకాశమని పేర్కొన్నారు. స్టాల్స్ పరిమిత సంఖ్యలో ఉన్నాయని ఆసక్తి గల పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు వెంటనే దరఖాస్తులు చేసుకోవాలని ఆయన తెలిపారు. వివరాలకు 9885832642 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
పోలీస్ కబడ్డీ క్రీడాకారిణికి ఎస్పీ అభినందన
నల్లగొండ : ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో బంగారు పతకం సాధించిన నల్లగొండ పోలీస్ కబడ్డీ క్రీడాకారిణి షేక్ నౌషీన్‌ను ఎస్పీ శరత్‌చంద్ర పవార్ బుధవారం అభినందించారు. కబడ్డీలో ప్రతిభ చూపి ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్‌కు నౌషీన్ ఎంపికయ్యారు. జమ్ముకశ్మీర్‌లో ఈ నెల 7 నుంచి 13 వరకు జరగనున్న జాతీయ కబడ్డీ పోటీల్లో నౌషిన్ తెలంగాణ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
బీఓఎస్ సభ్యుల నియామకం
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ నూతన సభ్యులను నియమిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆధ్వర్యంలో సిలబస్ కూర్పు, పరీక్షల నిర్వహణ విధానం మూల్యాంకనం, వంటి అంశాలను చర్చించి ఆయన ఆమోదించారు. బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీఓఎస్) మెంబర్లుగా అలువాల రవి, జక్క సురేష్ రెడ్డి, శ్వేత, వి.అనురాధ, మెంబర్ కన్వీనర్‌గా లక్ష్మీప్రభ, ఇతర సభ్యులుగా వాస్తవ అపర్ణ, ఏదుళ్ల శ్రీధర్‌రెడ్డిని నియమించారు. వీరి నియామకం రెండేళ్ల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు.
పథకాలపై విద్యార్థులకు అవగాహన
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో బుధవారం కామర్స్ విద్యార్థులకు జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని ఎంప్లాయిమెంట్ జనరేషన్ స్కీంపై అవగాహన కల్పించారు. పథకం ప్రధాన ఉద్దేశాలు, అర్హతలు, బ్యాంకు రుణం, సబ్సిడీ, దరఖాస్తు విధానాన్ని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, జక్కా సురేష్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, లార్షవర్ధన్, పి.మల్లేష్, ఉయ్యాల శివ, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
నూతన కోర్సులో
చేరేందుకు దరఖాస్తులు
నల్లగొండ : నల్లగొండలోని ప్రభుత్వ ఐటీఐలో కేంద్ర ప్రభుత్వ పీఎంకేవీవై 4.0 పథకం కింద నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ వెహికల్ సర్వీస్ టెక్నిషియన్ కోర్సులో చేరాలనుకునే ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వెంకన్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు ఈ నెల 6లోగా కళాశాలలో లేదా, 8919234137 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.


