తెలిసీతెలియక ఆన్‌లైన్ గేమ్ ఆడిన చౌటుప్పల్‌లోని మల్లికార్జుననగర్ కాలనీకి చెందిన మహిళ అవిశెట్టి రాజేశ్వరి చివరికి తన ప్రాణాల మీదికి తెచ్చుకుంది. ఆటలో పెట్టుబడి పెట్టేందుకుగాను తన డబ్బుతోపాటు ఇతరుల వద్ద అప్పుగా తీసుకువచ్చింది. చివరికి అప్పు ఇచ్చిన వ్యక్తుల నుంచి ఎదురైన తీవ్రమైన ఒత్తిడితో మానసికంగా ఇబ్బందికి గురైంది. గడువు కోరినా సదరు వ్యక్తులు వినకపోగా ఇంటిపైకి వచ్చి నిలదీయడంతో అవమానంగా భావించింది. దాంతో 2023 జూన్ 27న తన ఇద్దరు కుమారులు అనిరుధ్, హర్షవర్ధన్‌లను నీటి సంపులో వేసి ఆ తర్వాత తానూ అందులోనే దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఫ కుటుంబ కలహాలతో మనస్తాపం
ఫ తీవ్ర మానసిక ఒత్తిడితో
బలవన్మరణాలు
ఫ పిల్లలను కూడా బలిగొంటున్న
తల్లిదండ్రులు
ఫ ట్రైన్‌కు ఎదురుగా వెళ్లి ఇద్దరు
పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య ఘటన
మరవక ముందే మరో విషాదం
ఫ సోమవారం బీబీనగర్ మండలం
గొల్లగూడెంలో ఇద్దరు పిల్లలను
చంపి తల్లి ఆత్మహత్య
చౌటుప్పల్, భువనగిరి : కుటుంబంలో నెలకొన్న చిన్నచిన్న కారణాలకే చాలా మంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కొన్నిమార్లు పెద్ద పెద్ద సమస్యలే ఉన్నా పరిష్కారం వైపు ఆలోచన చేయడంలేదు. ఇందులో ఎక్కువగా మహిళలే ఉంటున్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందన్న విషయాన్ని మర్చి తమకు ఏదో జరిగిపోయిందనుకొని అర్ధరహితంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ సమయంలో తమతోపాటు నవమాసాలు మోసి కని పెంచిన బిడ్డలను సైతం చంపుతున్నారు. ఫలితంగా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. నెలరోజుల క్రితం బీబీనగర్ మండలానికి చెందిన ఓ మహిళ ఘట్కేసర్ వద్ద తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలుకు అడ్డంగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరవకముందే తాజాగా సోమవారం మరో ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. బీబీనగర్ మండలం గొల్లగూడెంలో కుటుంబ కలహాల గృహిణి ఐశ్వర్య కుటుంబ కలహాలతో తన ఇద్దరు పిల్లలు ఝాన్సీ, పండును ఊపిరాడకుండా చేసి చంపి ఆ తర్వాత తానూ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
15ఏళ్ల క్రితం భార్యతోపాటు
బిడ్డలను చంపిన భర్త
చౌటుప్పల్‌లో 15 ఏళ్ల కిత్రం వార్డు మాజీ సభ్యుడు లింగస్వామి తన భార్యతో పాటు ఇద్దరు కుమారులను హత్య చేశాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. చికిత్స పొందిన తర్వాత కోలుకున్నాడు. సమాజంలో చక్కటి గుర్తింపు పొందిన ఆ వ్యక్తి భార్య, బిడ్డలను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, కనీసం ఆలోచన ఎందుకు చేయలేదో ఇప్పటికీ అంతుచిక్కడంలేదు.
2021లో ఒకేసారి తల్లి, ఇద్దరు కుమార్తెలు
భార్యభర్తల నడుమ నెలకొన్న కలహాల నేపథ్యంలో 2021 జూలై 8న చౌటుప్పల్‌లోని రాంనగర్‌కాలనీలో తొర్పునూరి ఉమారాణి తన ఇద్దరు కుమార్తెలు హర్షిణి, లాస్యలను చంపి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. అదే ఘటనలో తన చిన్న కుమార్తె శైనీని సైతం చంపేందుకు ఉరి బిగించినప్పటికీ తృటిలో తప్పించుకుంది. ప్రాణాలతో బయట పడిన చిన్నారికి తండ్రి ఉన్నప్పటికీ తల్లి ప్రేమకు మాత్రం దూరమైంది. ప్రస్తుతం బంధువుల సంరక్షణలో ఉంది. మద్యపానం ఆ కుటుంబంలో చిచ్చురేపింది.
ట్రైన్‌కు ఎదురుగా వెళ్లి..
బీబీనగర్‌కు చెందిన పిన్నింటి విజయశాంతిరెడ్డి, కుమార్తె చేతన, కుమారుడు విశాల్‌రెడ్డితో కలిసి ఈఏడాది జనవరి 31న మేడ్చల్ జిల్లా చర్లపల్లి–ఘట్కేసర్ మధ్య రైలు మార్గంలో ట్రెయిన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. సురేందర్‌రెడ్డి సొంతూరు భువనగిరి మండలం బొల్లేపల్లి కాగా 20 ఏళ్ల కిత్రం బీబీనగర్‌కు వలస వెళ్లారు. అక్కడ నుంచి బోడుప్పల్‌కు మకాం మార్చారు. విజయశాంతిరెడ్డి తన పిల్లలతో కలిసి బోడుప్పల్‌లో ఉంటుండగా సురేందర్ రెడ్డి దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలతో కలిసి విజయశాంతిరెడ్డి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అప్పట్లో అందరిని కలిచివేసింది.
కనుపాపలను కాపాడుకోవాల్సిన కనులే కారు చీకటిలో దారిని వెతుక్కుంటున్నాయి. అమ్మ లాలిపాట వినాల్సిన పసిప్రాయాలు చేయని నేరానికి నిస్సహాయంగా మట్టిలో కలిసిపోతున్నాయి. కన్న ప్రేమ కసాయిగా మారిన క్షణం.. తమ పంచ ప్రాణాలను సైతం తోడు తీసుకెళ్తున్నాయి. తాను లేకపోతే తన పిల్లలు ఏమైపోతారోననే అపోహ మాతృత్వానికి మాయని మచ్చను మిగిలిస్తోంది. అభం శుభం తెలియని అమాయక పసిప్రాణాలను చిది మేయటంకాదు.. కారుచీకట్లు కమ్ముకున్నా రేపటి సూర్యోదయం కోసం వేచి చూడడమే జీవితం అన్న సూక్తిని గుర్తించుకోవాలి.
మానసిక స్థితిని గమనిస్తూ ఉండాలి
పెద్దలు కుటుంబంలోని ఇతర సభ్యుల మానసిక స్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. మానసిక స్థితిలో తేడా కనిపిస్తే వెంటనే వారితో మాట్లాడి విషయం ఏమిటో కనుక్కోవాలి. వారితో చర్చించి సమస్య ఏమైనా ఉంటే పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అప్పటికి కూడా కాని పక్షంలో మానసిక వైద్యులను సంప్రదించి వారిచే కౌన్సిలింగ్ ఇప్పించాలి. లేని పక్షంలో ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది.
– డాక్టర్ మనోహర్, సూపరింటెండెంట్, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి


