Telangana News: ఎస్కార్ట్‌ లేకుండానే ఈవీఎంల తరలింపు.. అడ్డుకున్న గ్రామస్తులు
Sakshi News home page

ఎస్కార్ట్‌ లేకుండానే ఈవీఎంల తరలింపు.. అడ్డుకున్న గ్రామస్తులు

Published Fri, Dec 1 2023 2:54 AM | Last Updated on Fri, Dec 1 2023 10:11 AM

- - Sakshi

నాగారం: నాగారం మండలం పేరబోయినగూడెంలో గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత అధికారులు ఎస్కార్ట్‌ లేకుండా ఈవీఎంలను తరలిస్తుండటంతో గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.పేరబోయినగూడెం గ్రామంలో సాయంత్రం 5:10గంటలకు పోలింగ్‌ ముగిసింది. అధికారులు ఎస్కార్ట్‌ లేకుండానే ఈవీఎం బాక్సులను మినీ బస్సులో ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న నరసింహులగూడెం వరకు తరలించారు.

అదే మాదిరిగా నరసింహులగూడెంలో ఉన్న ఈవీఎంను కూడా మినీ బస్సులో తరలించేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో సెక్టోరియల్‌ అధికారి అదనపు ఈవీఎంలను తన కారులో వేసుకుని నర్సింహులగూడేనికి చేరుకున్నాడు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, గ్రామస్తులు కారులో ఉన్న ఖాళీ ఈవీఎంలను గమనించి ఎక్కడివి అని ప్రశ్నించారు.

ఈ క్రమంలో సెక్టోరియల్‌ అధికారి అదనపు ఖాళీ ఈవీఎంలు అని చెప్పే ప్రయత్నం చేస్తుండగానే ఎస్కార్ట్‌ లేకుండా ఈవీఎం బాక్సులను తరలించవద్దని ఆందోళనకు దిగారు. కారులో ఉన్న ఖాళీ ఈవీఎంలు పోలింగ్‌ అయిన ఈవీఎంల స్థానంలో మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు.

దీంతో సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సెక్టోరియల్‌ అధికారి వెంట అదనపు ఏవీఎంలు ఉంటాయని గ్రామస్తులకు వివరించే ప్రయత్నిం చేశారు. అయినా ఆందోళన విరమించకుండా బాక్సులు తారుమారు చేసే కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

అనంతరం పోలీసులు అక్కడి నుంచి ఎస్కార్ట్‌ వాహనం ఇచ్చి ఈవీఎంలను తరలించారు. గ్రామస్తులు అనుమానంతో ఈవీఎంలు తరలిస్తున్న వాహనాన్ని భద్రపరిచే స్థలం తుంగతుర్తి వరకు వెంబడించారు.

సెక్టోరియల్‌ అధికారి కారు అద్దాలు ధ్వంసం
తుంగతుర్తి గోదాం ఎదుట కాంగ్రెస్‌ కార్యకర్తలు అధికసంఖ్యలో గుమిగూడి ఈవీఎంలు తరలిస్తున్న సెక్టోరియల్‌ అధికారి కారును అడ్డగించారు. అనంతరం కారు అద్దాలను ధ్వంసం చేశారు. తమ ఎదుట ఖాళీ ఈవీఎంలను ఓపెన్‌ చేయాలని ఆందోళనకు దిగారు.

దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అదుపుచేసి ఈవీఎంలను గోదాముకు తరలించారు. ఈ విషయంపై తమకు వివరణ ఇవ్వాలని కార్యకర్తలు ఆర్వో వెంకట్‌రెడ్డి, డీఎస్పీ రవిలను కోరారు. దీంతో వారు కాంగ్రెస్‌ నాయకులకు, ఏజెంట్ల ఎదుట ఖాళీ ఈవీఎంలను తెరిచి వారి అనుమానాన్ని నివృత్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement