ఇంటి గుట్టు దాచినా తప్పించుకోలేరు! | - | Sakshi
Sakshi News home page

ఇంటి గుట్టు దాచినా తప్పించుకోలేరు!

Mar 13 2026 7:38 AM | Updated on Mar 13 2026 7:38 AM

నల్లగొండ టూటౌన్‌ : ఇంటి గుట్టు ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడు అనే సామెత మనందరికి బాగా తెలుసు. కానీ నేడు ఇంటి గుట్టు దాచినా దాగదులే అనే విధంగా టెక్నాలజీ పెరిగింది. వ్యాపారం విషయానికొస్తే ఏ వ్యాపారం మీద బ్యాంకు రుణం తీసుకోవాలన్నా బ్యాంకు అధికారులు ట్రేడ్‌ లైసెన్స్‌ అడుగుతుంటారు. కొందరు వ్యక్తులు వ్యాపారం చేయకున్నా వారు ఉంటున్న ఇంటి నంబర్‌తో ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకుంటున్నారు. దాంతో సంబంధిత బ్యాంకుల వారు రుణం మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ కొత్తగా వచ్చిన ఆన్‌లైన్‌ విధానంతో ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోగానే సంబంధిత నివాస భవనం కమర్షియల్‌ భవనంగా గుర్తిస్తున్నారు. హైదరాబాద్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో ఆటోమేటిక్‌గా నివాస ఆస్తి పన్ను నుంచి కమర్షియల్‌ ఆస్తి పన్నుగా మారిపోతుంది. దాంతో రూ.ఐదారు వేలు ఉన్న ఆస్తి పన్ను ఐదారింతలు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి వ్యాపారం చేసినా ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోవాల్సిందే. కానీ, చాలా మంది వ్యాపారం పెట్టకుండానే బ్యాంకులో రుణం కోసం ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకుంటారు. అయితే అద్దెకు ఉండే వారు సదరు ఇళ్ల నంబర్లపై ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకుంటుండడంతో ఇళ్ల యాజమానులను బెంబేలెత్తిస్తోంది. ఇక నుంచి వ్యాపారం చేసినా, చేయకుండా ఇంటి నంబర్‌ మీద ట్రేడ్‌ లెసెన్స్‌ తీసుకున్నా ఆటోమేటిక్‌గా కమర్షియల్‌గా మారి ఆస్తి పన్ను పెరుగుతుంది. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలతోపాటు, నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కూడా ఇకనుంచి ఆన్‌లైన్‌ విధానం అమలు కానుంది.

నీలగిరిలో 345 మందికి వాణిజ్య పన్ను..

నీలగిరి నగరంలో ఇటీవల 345 మంది భవనాలు ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోవడంతో కమర్షియల్‌ భవనాలుగా మారిపోయాయి. ఇవన్నీ నివాస భవనాలు మాత్రమే. వీటిలో 30కిపైగానే వ్యాపార కార్యకలాపాలు నడుస్తుండగా, మిగతావి మాత్రం నివాస భవనాలుగానే ఉన్నాయి. నివాస భవనాల ఇంటి నంబర్లు వేసి ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోవడంతో కమర్షియల్‌గా మారిపోయాయి. నల్లగొండ పట్టణంలోని బొట్టుగూడలో ఓ నివాస భవనం కమర్షియల్‌గా వినియోగిస్తున్నా, నివాసం ఆస్తి పన్ను కింద కేవలం రూ.600 మాత్రమే ఉంది. దీనికి ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోవడంతో ఈ పన్ను రూ.60 వేలకు పెరిగింది. మరో భవనానికి రూ.6 వేలు ఉండగా, రూ.42 వేలకు పెరిగింది. అదేవిధంగా ఓ ఇంట్లో అద్దెకు ఉన్న వ్యక్తి బ్యాంకు రుణం కోసం ఇదే ఇంటి నంబర్‌తో ట్రేడ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కార్పొరేషన్‌ అధికారులు ట్రేడ్‌ లైసెన్స్‌ మంజూరు చేయడంతో ఇక్కడ కమర్షియల్‌గా మారడంతో రూ.30 వేలకు ఆస్తి పన్ను వచ్చింది. సంబంధిత ఇంటి యాజమాని ఇంత ఆస్తి పన్ను ఎందుకు వచ్చిందని ఆరా తీయడంతో ఆయనకు తెలియకుండానే అద్దెకుంటున్న వ్యక్తి ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకున్నట్లు బయపడింది. సదరు ఇంటి యాజ మాని అద్దెకు ఉన్న వ్యక్తితోనే ఆస్తి పన్ను కట్టించాడు. ఇక నుంచి మన ఇల్లు నివాసమా, లేక వాణిజ్య భవనమా అనేది దాచినా దాగే పరిస్థితి ఉండదు.

ఫ ఇంటి నంబర్‌తో ట్రేడ్‌ లైసెన్స్‌ పొందితే కమర్షియల్‌ భవనంగా గుర్తింపు

ఫ ఆటోమేటిక్‌గా మారుతున్న ఆస్తి పన్ను

ఫ రూ.వందల నుంచి రూ.వేలుగా మార్పు

ఫ కొత్తగా ఆన్‌లైన్‌ విధానం అమలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement