మునుగోడు : గ్రామాల్లో మూగజీవుల దాహార్తి తీర్చేందుకు నిర్మించిన ప్రతి నీటి తొట్టిలో నీరు నింపి ఉంచాలని జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్ రెడ్డి పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. పలు గ్రామాల్లోని నీటి తొట్లలో నీరు నింపకపోవడంతో గురువారం సాక్షి దినపత్రికలో నీరు లేక.. దాహం కేక! అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి జెడ్పీ సీఈఓ స్పందించారు. మునుగోడు ఎంపీడీఓ యుగేంధర్‌రెడ్డికి ఫోన్‌చేసి పశువుల కోసం నిర్మించిన నీటి తొట్లలో నీరు నింపేలా చొరవచూపాలని సూచించారు. దీంతో ఆయన.. కార్యదర్శులకు సూచించగా పలు గ్రామాల్లోని నీటి తొట్లను ట్యాంకర్లు, ఇతర మార్గాల ద్వారా నింపి ఉంచారు.
108 సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
మునుగోడు : 108 సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఫోన్ కాల్ వచ్చిన వెంటనే ప్రమాదస్థలానికి వెళ్లి బాధితులను ఆసుపత్రులకు తరలించాలని 108 ప్రోగ్రామ్ జిల్లా మేనేజర్ ఎస్‌కే.సలీం అన్నారు. గురువారం మునుగోడులోని 108 వాహనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులతోపాటు ఆ వాహనంలోని ప్రథమ చికిత్సకు అందుబాటులో ఉన్న పరికరాలను పరిశీలించి మాట్లాడారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో వడదెబ్బకు గురైయ్యేవారి సంఖ్య పెరుగుతుందన్నారు. వారికి అవసరమైన ఓఆర్‌ఎస్ ప్యాకెట్లతో పాటు ఇతర మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట సిబ్బంది ప్రదీప్, రమేష్, డాక్టర్ నర్మద తదితరులు ఉన్నారు.
నల్లగొండ, మల్లేపల్లిలో టాస్క్‌ఫోర్స్ దాడులు
నల్లగొండ, కొండమల్లేపల్లి : నల్లగొండ, కొండమల్లేపల్లి పట్టణాల్లోని హోటళ్లు, దాబాలు, గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలపై గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నల్లగొండలోని ప్రసాద్, నందిని, క్రితుంగ హోటళ్లలో, మల్లేపల్లిలోని నేహా, సాయినందిని హోటళ్లలో, తేజస్విన్ వాటర్ ప్లాంట్స్‌పై దాడులు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్న మొత్తం 68 డొమెస్టిక్ (వంట గ్యాస్) సిలిండర్లను సీజ్ చేసి సంబంధిత వ్యక్తులపై 6ఎ కేసు నమోదు చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి పి.వెంకటేష్ తెలిపారు. ఈ దాడుల్లో సిపిల్ సప్లయ్, టాస్క్‌ఫోర్స్, రెవెన్యూ అధికారులు ఎస్‌డీ.ముబీన్, ఎండి.ముక్తార్, ఎ.దీపక్, ఆర్.సైదులుగౌడ్, జ్యోతి, ఎ.సైదులు, కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
యూజీడీ పనులు త్వరగా పూర్తిచేస్తాం
మిర్యాలగూడ : పట్టణంలో భూగర్భ డ్రెయినేజీ (యూజీడీ) నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మున్సిపల్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ప్రజారోగ్య శాఖ ఎస్‌ఈ కందుకూరి వెంకటేశ్వర్లుతో కలిసి మిర్యాలగూడ పట్టణంలో యూజీడీ పనులు, అమృత్ నీటి ట్యాంక్ నిర్మాణాలను పరిశీలించారు. తాళ్లగడ్డ ఇందిరమ్మ కాలనీ సమీపంలోని ఎస్టీపీ–1, రాంనగర్ బంధం డంపింగ్ యార్డు పక్కన ఉన్న ఎస్టీపీ–2 (వ్యర్థపు నీటి శుద్ధి ప్లాంట్లు) పనులను తనిఖీ చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు. హౌసింగ్ బోర్డులో నిర్మిస్తున్న ఉపరితల నీటి ట్యాంక్ పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణాల్లో నాణ్యత లోపాలు లేకుండా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. తాళ్లగడ్డ వద్ద అదనంగా మరో శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ డీఈ వెంకన్న, ఏఈలు నవీన్, అంజలి, ప్రజారోగ్య శాఖ ఏఈ సాయితేజ పాల్గొన్నారు.


