జిల్లాలో అత్యధికంగా వరి, పత్తి సాగు చేసే రైతులే ఉన్నారు. పంటల రుణ సదుపాయం పెంపుతో జిల్లాలో వారందరికీ ఆర్థిక వెసలుబాటు కలుగనుంది. జిల్లాలో ప్రస్తుతం 12 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తుండగా, 5.5 లక్షలకుపైగా ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. మరో 5.75 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేస్తున్నారు. దీంతో అత్యధికంగా పంటలు సాగు చేసే రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రభుత్వం పంటల రుణ పరిమితిని పెంచింది. ఈ మేరకు బ్యాంకర్ల కమిటీ, కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు ఆధీనంలో రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా 44 రకాల సాగు పంటలకు, 84 రకాల ఉద్యాన వన పంటలకు, మత్స్య, పౌల్ట్రీ, డెయిరీ రంగాలకు రుణ పరిమితిని పెంచింది. పెంచిన రుణ పరిమితి 2026–27 ఆర్థిక సంవత్సరానికి వర్తించనుంది. అలాగే 2025–26 ఆర్థిక సంవత్సరంలో రుణాలు ఇవ్వని కొన్ని రకాల పంటలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలో 12 లక్షలకు ఎకరాలకుపైగా పంటలు సాగుచేసే రైతులకు మరింత ఆర్థిక వెసలుబాటు లభించనుంది.
రూ.2 వేల నుంచి రూ.4 వేలు పెంపు
జిల్లాలో అత్యధికంగా రైతులు పండించే వరి, పత్తి పంటలకు ప్రభుత్వం ఈసారి రుణాన్ని పెంచింది. ఈ పంటలకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన రుణాలపై ఇకపై అదనంగా రూ.2 వేల నుంచి రూ.4 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. మొన్నటివరకు వరిసాగు చేసే ఎకరం పొలంపై రూ.44 వేల నుంచి రూ.46 వేలు రుణంగా ఇచ్చిన బ్యాంకులు ఇకపై రూ.ఎకరానికి 48 వేల చొప్పున రుణ ఇవ్వనున్నాయి. వర్షాధారంగా (రేయిన్ ఫెడ్) పండించే పత్తి పంట ఎకరాకు రూ.46 వేల నుంచి రూ.48 వేలు ఇచ్చిన బ్యాంకులు ఈసారి రూ.50 వేల చొప్పున రుణాలను అందించనున్నాయి.
మిర్చి పంటకు పెంచిన రుణ సదుపాయం
ముఖ్యంగా మిర్చి పంటకు ఎకరానికి గత ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన రుణ పరిమితిపై ఈసారి రూ. 4 వేల నుంచి రూ. 6 వేలు పెంచింది. గతంలో మిర్చి పంట వేసే రైతులకు ఎకరానికి రూ.84 వేల నుంచి రూ.86 వేలు రుణంగా ఇచ్చిన బ్యాంకులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిర్చి పంటకు ఎకరానికి రూ.90 వేల చొప్పున ఇవ్వనున్నాయి.
గతేగాది ఇవ్వని పంటలకు ఈసారి..
2025–26 ఆర్థిక సంవత్సరంలో రుణాలను ఇవ్వని వివిధ రకాల పంటలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. నీటి పారుదల సౌకర్యం కలిగి ఉండి పత్తి సాగు చేసే రైతులకు గత ఆర్థిక సంవత్సరంలో రుణాలను ఇవ్వలేదు. ఈసారి ఎకరానికి రూ.52 వేల చొప్పున రుణాలను బ్యాంకులు ఇవ్వనున్నాయి. అలాగే వరి పంట (డైరెక్ట్ సీడ్ రైస్) ఎకరానికి రూ.45 వేలు, చిల్లీస్ (విత్ మల్చింగ్) రూ.లక్ష, పుదీనా రూ.35 వేలు, అంటు కట్టిన కూరగాయలు ఎకరానికి రూ.70 వేలు, మల్బరీకి రూ.64 వేలు, జోవర్ (స్వీట్) రూ.24 వేలు చొప్పున ఈసారి రుణాలను ఇవ్వనున్నాయి.
గొర్రెలు, మేకలు యూనిట్లకూ పెంపు
గొర్రెలు, మేకలు, బ్రాయిలర్ కోళ్ల యూనిట్లపైనా ప్రభుత్వం రుణ పరిమితి పెంచింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో గొర్రెల యూనిట్‌కు రూ.26 వేల నుంచి రూ.28 వేలు రుణంగా ఇవ్వగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో యూనిట్‌కు రూ.32 వేలు ఇవ్వనున్నాయి. మేకల యూనిట్‌కు రూ.27 వేల నుంచి రూ.29 వేలు ఇవ్వగా, ఇకపై రూ.35 వేలు రుణంగా బ్యాంకులు ఇవ్వనున్నాయి. బ్రాయిలర్, లేయర్ కోళ్లపైనా కూడా రుణ పరిమితిని పెంచింది.
రుణం పెంచిన ప్రభుత్వం
ఫ వరికి ఎకరాకు రూ.48 వేలు
ఫ ఉద్యాన, పౌల్ట్రీ, డెయిరీ రంగాలకూ పెంపు
ఫ అత్యధికంగా మిర్చికి రూ.90 వేలు
ఫ ఈ ఏడాది డైరెక్ట్ సీడ్ రైస్, జొన్న పంటలకూ రుణాలు
రుణపరిమితి(ఎకరానికి రూ.లలో)
పంటలు గతంలో పెంచింది
వరి 46,000 48,000
పత్తి 48,000 50,000
మిర్చి 86,000 90,000
గొర్రెల యూనిట్ 28,000 32,000
మేకల యూనిట్ 29,000 35,000


