A Mother Died of a Heart Attack ahead of Her Son’s Birthday in Hyderabad - Sakshi
Sakshi News home page

విషాదం.. నాలుగు రోజుల్లో కుమారుడి జన్మదినం..

Jul 23 2023 2:44 AM | Updated on Jul 23 2023 11:26 AM

- - Sakshi

తమ కుమారుడి మొదటి జన్మదిన వేడుకలకు సంబంధించిన సామగ్రి కొనుగోలు కోసం తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఓ షాపింగ్‌మాల్‌కు వెళ్లారు.

నల్గొండ: తమ కుమారుడి మొదటి జన్మదిన వేడుకలకు సంబంధించిన సామగ్రి కొనుగోలు కోసం తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఓ షాపింగ్‌మాల్‌కు వెళ్లారు. అక్కడే సామగ్రి ఖరీదు చేస్తుండగా తల్లి అకస్మాత్తుగా గుండెపోటుకు గురైంది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. వివరాలిలా ఉన్నాయి. చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలోని మార్కండేయనగర్‌ కాలనీకి చెందిన గోశిక ప్రవీణ్‌కుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. నల్లగొండకు చెందిన స్వాతి(30)తో వివాహం జరిగింది. వీరికి కుమార్తె స్వీటి(05), కుమారుడు విబ్బు ఉన్నారు.

వీరు ప్రస్తుతం ఉద్యోగరీత్యా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఈనెల 25న కుమారుడి మొదటి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందుకుగాను ఇటీవల స్వగ్రామానికి వచ్చారు. ప్రస్తుతం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈమేరకు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో షాపింగ్‌ చేస్తుండగా స్వాతి అకస్మాత్తుగా కిందపడిపోయింది. అక్కడే ఉన్న భర్త ప్రవీణ్‌, కుటుంబ సభ్యులు కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందింది. దీంతో చిన్నారులు తల్లిలేని వారయ్యారు. కుమారుడి జన్మదిన వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తూ గుండెపోటుకు గురై తల్లి మృతిచెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నిలిపింది. ఇదిలా ఉండగా శనివారం దైవ దర్శనం నిమిత్తం శ్రీశైలం దేవస్థానానికి వెళ్లే ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఇంతలోనే ఇలా జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement