అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ (Darshan) కటకటాలపాలయ్యాడు. ప్రియురాలి కోసం దర్శన్ ఊచలు లెక్కపెడుతుంటే.. ఆయన నటించిన కొత్త సినిమా ప్రమోషన్స్ కోసం దర్శన్ భార్య కష్టపడుతోంది. ప్రకాశ్ వీర్ దర్శకత్వం వహించిన డెవిల్ సినిమా షూటింగ్ గతంలోనే పూర్తయిపోయింది. వచ్చే నెల డిసెంబర్ 12న ఈ మూవీ రిలీజ్ కానుంది.
నోట మాట రాలేదు
దీంతో సినిమా ప్రమోషన్స్ కోసం దర్శన్ తరపున అతడి భార్య విజయలక్ష్మి మీడియా ముందుకు వచ్చింది. ఇటీవలే ఆడియో లాంచ్ కార్యక్రమానికి హాజరైంది. తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైంది. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. నేనెప్పుడూ సినిమా ఈవెంట్లకు వెళ్లలేదు. తొలిసారి ఇంత పెద్ద మొత్తంలో జనం ముందుకు రావడం.. వాళ్లందరూ డి బాస్ అంటూ నినాదాలు చేయడం చూసి చాలా సంతోషించాను.
నిర్మాతలే అన్నదాతలు
వాళ్లు చాలాసేపటివరకు అలా నినాదాలు చేస్తూ నన్ను మాట్లాడనివ్వలేదు. అభిమానుల ప్రేమాభిమానాలకు నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి. ఓపక్క సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుంటే దర్శన్ డెవిల్ సినిమా రిలీజ్ గురించే ఆందోళన చెందాడు. నిర్మాతలే మన అన్నదాతలు. నా వల్ల వారికి ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకూడదు అని చెప్పాడు. అభిమానులు కురిపించిన ప్రేమ గురించి చెప్పినప్పుడు మీ అందర్నీ ఆయన సెలబ్రిటీలుగా అభివర్ణించాడు.
అభిమానులంటే ప్రేమ
అభిమానులు ఆయన్ను అంతలా ఎందుకు ప్రేమిస్తారో తెలుసా? దర్శన్ మంచి మనిషి అని వాళ్లకు బాగా తెలుసు. అభిమానులకు ఓ విషయం చెప్పమన్నాడు. తన గురించి కంగారు పడొద్దని, తన సినిమాలకు సపోర్ట్ చేయమని కోరాడు. తనెంత ఎదిగినా ఒదిగే ఉంటాడు. బయటకు వెళ్లినప్పుడు ఎక్కడైనా ఆటోలపై దర్శన్ అనే స్టిక్కర్ కనిపిస్తే వెంటనే ఆటోవాలాను కలిసి థాంక్యూ చెప్తాడు. అభిమానులంటే ఆయనకు అంతిష్టం.
పెయిన్ కిల్లర్ ఇంజక్షన్స్
ఇప్పటికీ వృద్ధాశ్రమంలో ఉన్న ఓ కళాకారుడి బాగోగులను దర్శనే చూసుకుంటున్నాడు. నేను తన సినిమా సెట్స్‌కు పెద్దగా వెళ్లేదాన్ని కాదు. రాజస్తాన్, బ్యాంకాక్ లాంటి ప్రదేశాల్లో షూటింగ్ అయినప్పుడు మాత్రం నేను, మా కొడుకు వినిశ్ తనకు తోడుగా ఉన్నాం. ఎందుకంటే ఆయన శారీరకంగా, మానసికంగా అలిసిపోయేవాడు. నడుమునొప్పి, వెన్ను నొప్పి తట్టుకోలేక పెయిన్‌కిల్లర్ ఇంజక్షన్స్ తీసుకుని డెవిల్ సెట్‌కు వెళ్లేవాడు. యాక్షన్ సన్నివేశాల్లో చాలా దెబ్బలు తగిలించుకున్నాడు.
హీరోయిన్‌కు సలహా
అప్పుడు దర్శకనిర్మాతలు కూడా ఆయనకు అండగా నిలబడ్డారు. హీరోయిన్ రచనతో రొమాంటిక్ సన్నివేశాలు చేసేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. నేనున్నానని ఇబ్బందిగా ఫీలవద్దని రచనతో అన్నాను. ఇకపోతే నేను ఇంట్లోనే ఉండి సింపుల్‌గా బతకడానికే ఇష్టపడతాను. కానీ కొన్ని నెలలుగా మా జీవితాలు ఎంతో భారంగా సాగుతున్నాయి. నేను బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది.
కన్నీళ్లు దిగమింగుకుని
ఓ పక్క పని, మరోపక్క పోలీసులు, లాయర్స్‌ను కలవడం, నా కొడుకును చూసుకోవడం.. ఇలా అన్నీ ఒక్కదాన్నే చేసుకోవాల్సి వస్తోంది. దర్శన్‌కు, ఈ ప్రపంచానికి కనిపించకుండా ఎన్నోసార్లు ఏడ్చాను. ఆ బాధ దర్శన్ ఇట్టే కనిపెట్టేస్తాడు. అందుకే తనను కలవడానికి వెళ్లినప్పుడు బలవంతంగా చిరునవ్వు పులుముకునేదాన్ని. అంతా బానే ఉందని అబద్ధాలు చెప్తుంటాను అని విజయలక్ష్మి చెప్పుకొచ్చింది.
చదవండి: ఏయ్, ఏం పొడిచావ్? సీరియల్ స్టార్.. ఏడుపొక్కటే వచ్చంటూ గలీజ్ పంచాయితీ


