
నిర్భయమైన వైఖరి స్వీయ వ్యక్తీకరణకు పేరుగాంచిన విద్యాబాలన్, నటన, గ్లామర్‌ల కలబోతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. దక్షిణాది నటి సిల్క్ స్మిత జీవిత కధ ఆధారంగా రూపొందిన డర్టీ పిక్చర్ ద్వారా సౌత్ ప్రేక్షకల ప్రశంసలూ దక్కించుకున్న విద్యాబాలన్‌కు తరచుగా ఎదురయే విమర్శ, లేదా సలహా ఏదైనా ఉందంటే అది ఆమె ఓవర్ వెయిట్ గురించి మాత్రమే. గతంలోనూ కొన్నిసార్లు బరువు పెరిగి తగ్గి, పెరిగి...మార్పులకు గురవుతున్న విద్యాబాలన్... ఇటీవల కొన్ని ఇంటర్వ్యూల సందర్భంగా తన శరీరపు బరువు విషయంలో సంవత్సరాలుగా తనపై వచ్చిన విమర్శల నేపధ్యంలో ఈ సమస్యను అధిగమించడానికి తాను పడిన వ్యయ ప్రయాసల్ని ఆమె వెల్లడించింది.
‘ నేనొక సిగ్గుపడని ఆశావాదిని నాకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది. బరువు తగ్గడానికి నేను చేయని పోరాటం లేదు. నిజాయితీగా చెప్పాలంటే, ఆ విషయానికి వస్తే నాలో ఏ తప్పు లేదని నేను అనుకుంటున్నాను అంటుందామె. బరువుపై విమర్శలను చూసి బెదిరిపోని ఆమె మనస్తత్వం, విమర్శలను తట్టుకోవడానికి సినీరంగంలో కొనసాగడానికి సహాయపడిందని ఆమె అభిప్రాయపడుతోంది. ‘‘ఆ వైఖరి నాకు సహాయపడింది. నేను ప్రధాన పాత్రలు పోషించడం కొనసాగించాను ఎలాంటి అభద్రతాభావాలు నన్ను ఎప్పుడూ వెనక్కి నెట్టలేదు‘ అంటూ ఓవర్ వెయిట్ అనే సమస్యను జయించడానికి ఆత్మవిశ్వాసం ఎంత అవసరమో చెప్పకనే చెబుతుందామె.
‘నా జీవితాంతం, నేను సన్నగా మారడానికి ప్రయత్నించాను. తీవ్రమైన ఆహార నియమాలు పాటించాను. అన్ని రకాల వ్యాయామాలను చేశాను. కొన్నిసార్లు బరువు తగ్గాను, కానీ మళ్లీ తిరిగి బరువు పెరిగిపోయేదాన్ని.‘ అంటూ గుర్తు చేసుకుంది.
ఇటీవల బాగా వెయిట్ లాస్ అయి స్లిమ్ గా కనపడుతున్న విద్యాబాలన్...ఈ సంవత్సరం ప్రారంభంలో చెన్నైకి చెందిన పోషకాహార సంస్థ తో కనెక్ట్ అయినప్పుడు తన సమస్య ఏమిటో తనకి అర్ధం అయిందని చెప్పింది. ‘వారు నాకు, ’మీది కొవ్వు కాదు, అది ఇన్‌ఫ్లమేషన్’ అని చెప్పారు. అది నా విషయంలో గేమ్–ఛేంజర్ గా పనిచేసింది అని ఆమె వివరించింది తాను స్వతహాగా శాఖాహారిని అని కూరగాయలు తింటున్నా కూడా బరువు పెరగడానికి కారణం ఈ సంస్థను కలిసిన తర్వాత తనకు అర్ధమైందని అంటోంది.
‘‘ అన్ని కూరగాయలు ఆరోగ్యకరమైనవని మనం అనుకుంటాము, కానీ అది నిజం కాదు. మీ శరీరానికి ఏది సరైనదో మీరు అర్థం చేసుకోవాలి. మరొకరికి పనికొచ్చేది మీకు పనికి రాకపోవచ్చు. అదే విధంగా పాలకూర సొరకాయ వంటి కొన్ని నాకు సరిపోవని నాకు అంతకు ముందు తెలియదు’’ అంటూ వెల్లడించింది.
ఆత్మవిశ్వాసం అద్దం నుంచి రాదు అది లోపలి నుంచి వస్తుంది అని అంటున్న విద్య... దీర్ఘకాలంగా తాను చేస్తున్న బరువుపై పోరాటంలో సరైన సక్సెస్‌నే సాధించారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆమె తన ఆహారంలో ‘ఇన్‌ఫ్లమేషన్‌ను తొలగించే‘ విధానాన్ని అవలంబించింది, శరీర బరువు త్వరగా తగ్గించగలిగింది. అవగాహనతో కూడిన ఈ విజయం ఇకపైనా కొనసాగిస్తుందని ఆమె అభిమానులు ఆశించవచ్చు.