రీల్‌పై కనిపించే స్టార్స్ లైఫ్ తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. ఆ స్టార్స్ జీవితంలో జరిగిన సంఘటనలు, కెరీర్ కోసం వారు చేసిన కృషి వంటి అంశాలతో వచ్చే సినిమాలకు చాలా క్రేజ్ నెలకొంటుంది. ప్రస్తుతం అలాంటి క్రేజీ చిత్రాలు కొన్ని ఉన్నాయి. వెండితెర పై కనిపించే యాక్టర్స్, తెరవెనక విభాగాల్లో కృషి చేసే టెక్నీషియన్స్... ఇలా సిల్వర్ స్క్రీన్‌కి ఏయే స్టార్ లైఫ్ రానుంది? వారిపాత్రల్లో కనిపించనున్న స్టార్స్ ఎవరో తెలుసుకుందాం.
కిశోర్ కుమార్‌గా ఆమిర్
‘ఖైకేపాన్ బనారస్ వాలా’... ‘డాన్’లోని ఈ పెప్పీ నంబర్ నేటికీ ఫేమస్..., ‘ఓ సాథీ రే’... ‘ముకద్దర్ కా సికందర్’లోని ఈ విషాద గీతాన్ని ఇప్పటికీ చాలామందిపాడుకుంటారు. ‘మేరే సప్‌నోం కీ రాణి కబ్’... ‘ఆరాధన’లోని ఐకానిక్ రొమాంటిక్ సాంగ్ ఇది. ఇలా మాస్, రొమాన్స్, విషాదం... అన్నిపాటలూ కిశోర్‌కుమార్ గాత్రంతో జీవం పోసుకున్నాయి. అందుకే ఆయన దేశం గర్వించదగ్గ గాయకుడిగా నిలిచి పోయారు. కిశోర్‌కుమార్ గొప్ప నటుడు కూడా. దాదాపు 80 చిత్రాల్లో నటించారు.
కిశోర్‌కుమార్ భౌతికంగా దూరమై 35 ఏళ్లు పైనే అయినా (13 అక్టోబరు 1987లో మరణించారు)పాట రూపంలో నేటి తరానికీ వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బయోపిక్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కించనున్నారు. కిశోర్ కుమార్‌పాత్రను రణ్‌బీర్ కపూర్‌తో చేయిద్దామనుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా అనురాగ్ తెలిపారు.
అయితే అదే టైమ్‌లో రణ్‌బీర్‌కి ‘రామాయణ్’ ఆఫర్ రావడంతో ఆ సినిమాకి డేట్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ బయోపిక్‌లో ఆమిర్ ఖాన్‌ని నటింపజేయాలని అనురాగ్ అనుకున్నారు. ఇదంతా ఏడాది క్రితమే జరిగింది. అయితే ఎలాంటి అప్‌డేట్ లేదు. ‘‘ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఆమిర్ నటిస్తారా? లేదా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేను. అగ్రిమెంట్ పూర్తయిన తర్వాతే చెబుతాను’’ అని అనురాగ్ ఆ మధ్య ఓ సందర్భంలో తెలిపారు. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉందని బాలీవుడ్ టాక్.
ఇళయరాజాగా ధనుష్
1980వ దశకంలో ఇళయరాజాపాట వినపడని ఇల్లు ఉండదు...పాడుకోని ప్రేక్షకులు ఉండరు. ప్రేమ, విషాదం, సెంటిమెంట్, మాస్... ఇలా అన్ని రకాలపాటలకు బీట్స్ అందించిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ‘మంచు కురిసే వేళలో ...’ (అభినందన), ‘ఆమనిపాడవే...’ (గీతాంజలి), ‘కలయా... నిజమా...’ (కూలీ నెం. 1 ) ఇలా ఎన్నో ప్రేమపాటలను అందించారు ఇళయరాజా. తెలుగులో ‘అభిలాష, అన్వేషణ, సాగర సంగమం, రుద్రవీణ, మహర్షి’ వంటి పలు చిత్రాలకు సంగీతం అందించిన ఈ మ్యూజిక్ మేస్ట్రో బయోపిక్ వెండితెరకు రానుంది.
స్టార్ హీరో ధనుష్ మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజాగా నటించనున్నట్లు 2024 మార్చిలో అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఈ చిత్రం ఆరంభమైంది. అయితే ఆ తర్వాత పెద్దగా అప్‌డేట్ రాలేదు. పైగా లోకేశ్ కనగరాజ్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ‘డీసీ’ టైటిల్‌తో సినిమా ఆరంభం కావడంతో ఇళయరాజా బయోపిక్ ఆగి పోయిందనే ప్రచారం మొదలైంది.
అయితే అవి జస్ట్ రూమర్స్ మాత్రమే. ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత ధనుష్‌తో ఇళయరాజా బయోపిక్‌ని పట్టాలెక్కించేలా అరుణ్ మాథేశ్వరన్ ప్లాన్ చేశారట. మరోవైపు ధనుష్ కూడా వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. లోకేశ్ కనగరాజ్‌తో తెరకెక్కిస్తున్న సినిమా పూర్తయ్యే సమయానికి ధనుష్ చేతిలోని తాజా చిత్రాలు కూడా పూర్తవుతాయట. ఆ తర్వాత నాన్‌స్టాప్‌గా ఇళయరాజా బయోపిక్ షూట్‌ని జరపాలనుకుంటున్నారని సమాచారం.
మధుబాల ఎవరు?
హిందీ సినిమా రంగంలోని ప్రముఖ తారలలో మధుబాల ఒకరు. అందం, అభినయంతో నాటి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి పోయారామె. మధుబాల జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శక–నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ ఓ సినిమాకి సన్నాహాలు చేశారు. ఆలియా భట్ నటించిన ‘డార్లింగ్స్’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమైన జస్మీత్ కె. రీన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ చిత్రంలో మధుబాలపాత్రను కియారా అద్వానీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని భన్సాలీ ప్రతినిధులు పేర్కొన్నట్లుగా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. మరి... మధుబాలగా ఎవరు నటిస్తారు? ఈ బయోపిక్ షూటింగ్ ఎప్పుడు ఆరంభం అవుతుందనేది వేచి చూడాల్సిందే.
కియారానే మీనాకుమారి?
ప్రముఖ నటి, ట్రాజెడీ క్వీన్‌గా పేరు పొందిన మీనా కుమారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో కియారా అద్వానీ నటించనున్నారట. ‘కమల్ ఔర్ మీనా’ అనే టైటిల్‌తో ఈ చిత్రానికి సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రకథాంశం ప్రధానంగా మీనా కుమారి, నిర్మాత కమల్ అమ్రోహిల మధ్య ఉన్న సంక్లిష్టమైన అనుబంధంపై ఉంటుందని టాక్. దాదాపు 500 చేతిరాత లేఖల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుందని, 1950ల నుంచి 1970ల మధ్య మీనా కుమారి జీవితాన్ని చూపించనుందని వినికిడి. కాగా, గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఒక బయోపిక్ ప్రాజెక్ట్‌ను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు కియారా.
‘‘నేను ఇప్పటికే కొన్ని స్క్రిప్ట్స్ చదువుతున్నాను. వాటిలో నాకు బాగా నచ్చిన ఒక బయోపిక్ ఉంది. ఇది ఒక జానర్‌కు సంబంధించినది కాదు.... ఈ కథ ఆత్మకు సంబంధించినది’’ అని ఆమె ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కియారా పేర్కొన్నది మీనా కుమారి బయోపిక్ గురించే అనే ఊహాగానాలు ఉన్నాయి. కాగా మీనా కుమారిపాత్రకు కృతీ ససన్ కూడా బాగుంటారని సిద్ధార్థ్ పి. మల్హోత్రా ఈ బ్యూటీని సంప్రదించారట. అయితే కియారానే నటించే చాన్స్ మెండుగా ఉందని టాక్. ఇదిలా ఉంటే... ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా కూడా మీనా కుమారి జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కించాలనుకున్నారు. అయితే ఈ సినిమా చేసే ఉద్దేశం లేదని ఆ తర్వాత ఆయన పేర్కొన్నారు.
క్వీన్ ఆఫ్ ది సౌత్
గ్లామర్ క్వీన్ అనిపించుకున్న సిల్క్ స్మిత జీవితం ఆధారంగా హిందీలో ‘ది డర్టీ పిక్చర్’ వచ్చిన సంగతి తెలిసిందే. దక్షిణాదిన ‘సిల్క్‌స్మిత – క్వీన్ ఆఫ్ ది సౌత్’ టైటిల్‌తో ఓ సినిమా నిర్మాణంలో ఉంది. జయరామ్ శంకరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ బయోపిక్‌లో సిల్క్ స్మితగా చంద్రిక రవి కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన చంద్రిక రవి లుక్‌కి మంచి స్పందన లభించింది. స్మితలానే చంద్రిక ఉందనే కితాబులు అందాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదల చేయాలనుకుంటున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ప్రకటన వచ్చి, లుక్ విడుదల చేసి దాదాపు మూడేళ్లవుతోంది. సో... ఈ ప్రాజెక్ట్ ఏ దశలో ఉందనే విషయం తెలియాల్సి ఉంది.
ఎం.ఎస్. సబ్బులక్ష్మిగా రష్మిక
ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఇక సినిమాల పరంగా వస్తే... ‘సేవా సదనమ్, శకుంతలై, సావిత్రి, మీరా’ వంటి తమిళ చిత్రాల్లో నటించారు సుబ్బులక్ష్మి. ఆమె బయోపిక్‌ని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించనుందని సమాచారం. ఈ చిత్రంలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మిపాత్ర కోసం సాయి పల్లవిని తీసుకోవాలనుకుంటున్నారనే వార్త వినిపించింది.
అయితే, హిందీ ‘రామాయణ్’ రెండు భాగాలు, ఇతర చిత్రాల షూట్‌తో బిజీగా ఉండటం వల్ల సాయి పల్లవి ఈ చిత్రానికి డేట్స్ సర్దుబాటు చేయలేక పోతున్నారట. ఆ తర్వాత సాయి పల్లవి స్థానంలో ‘కాంతార’ ఫేమ్, కన్నడ నటి రుక్మిణీ వసంత్‌ని తీసుకోవాలనుకుంటున్నారనే వార్త వినిపించింది. అయితే తాజా వార్తల ప్రకారం సుబ్బులక్ష్మిపాత్రకు రష్మికా మందన్నాని ఎంపిక చేశారట. లుక్ టెస్ట్ కూడా జరిగిందని సమాచారం. ఈ చిత్రం గురించి నిర్మాణ సంస్థ ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు. మరి... ఎప్పుడు ప్రకటిస్తారు? ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగా ఎవరు నటిస్తారు? అనేది వేచి చూడాల్సిందే.
సిల్వర్ స్క్రీన్‌కి సిల్వెస్టర్ స్టాలోన్ జీవితం
హాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్స్, హీరోల లిస్ట్ తీస్తే... అందులో ప్రముఖంగా ఉండే పేర్లలో సిల్వెస్టర్ స్టాలోన్ పేరు ఒకటి. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా... స్టాలోన్ బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్నారు. ముఖ్యంగా ‘రాకీ, రాంబో’ చిత్రాల ఫ్రాంచైజీలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు సిల్వెస్టర్ స్టాలోన్. ఆయన జీవితం ఆధారంగా ‘ఐ ప్లే రాకీ’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ప్రధానంగా ఈ చిత్రం 1976లో క్లాసిక్ సినిమాగా నిలిచిన ‘రాకీ’ (ఈ చిత్రానికి స్టాలోన్ కథ అందించి, నటించారు) ముందు స్టాలోన్ పడిన కష్టాలు, పోరాటాలను ఆవిష్కరించేలా ఉంటుందని టాక్.
అందుకే ‘ఐ ప్లే రాకీ’ అని టైటిల్ పెట్టినట్లు సమాచారం. నిరుద్యోగి అయిన ఒక సాధారణ వ్యక్తి తనను తాను నమ్ముకుని రాకీ బాల్బోవా అనే బాక్సర్ కథను రాసి, ఆ సినిమాను నిర్మించేందుకు హాలీవుడ్ స్టూడియోలతో చేసిన పోరాటమే ఈ బయోపిక్ అని భోగట్టా. ఈ చిత్రంలో యంగ్ స్టాలోన్‌పాత్రలో ఆంథోనీ ఇ΄్పోలిటో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత పీటర్ ఫారెల్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
సిల్వెస్టర్ స్టాలోన్ తన కెరీర్ ఆరంభంలో పడిన ఇబ్బందులు, నిరాశలను అధిగమించి హాలీవుడ్ లెజెండ్‌గా ఎలా ఎదిగారో చూపించే ఈ చిత్రం యూఎస్‌లో ఈ ఏడాది నవంబరు 13న, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా నవంబరు 20న విడుదల కానుంది. ఇదిలా ఉంటే...పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా రూపొందిన ‘మైఖేల్’ ఆ మధ్య విడుదలై, సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం హాలీవుడ్‌లో సిల్వెస్టర్ స్టాలోన్ ‘ఐ ప్లే రాక్’ మాత్రమే కాకుండా... క్వీన్ ఆఫ్‌పాప్‌గాపాపులార్టీ తెచ్చుకున్న మడోన్నా వంటి వారి బయోపిక్స్‌కి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.
తొలి తరం సూపర్ స్టార్ జీవితంతో...
భారతదేశపు తొలి తరపు సూపర్ స్టార్లలో రాజేష్ ఖన్నా ముందు వరుసలో ఉంటారు. కెరీర్‌లో ఐదేళ్లల్లో వరుసగా 15 సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన రికార్డ్ ఆయన సొంతం. 1969 నుంచి 1974లోపు ఆయన 15 సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. వాటిలో ‘ఆరాధన’, ‘దో రాస్తే’ (1969), ‘సచ్చా జూతా, సఫర్’ (1970), ‘కటీ పతంగ్, ఆనంద్’ (1971), ‘అమర్ ప్రేమ్’ (1972) వంటి సినిమాలు ఉన్నాయి. ఇలా వరుస హిట్స్ అందించిన ఈ స్టార్ ఆ తర్వాత కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఒక స్టార్‌గా ముఖ్యంగా అమ్మాయిల్లో ఆయనకు అభిమానులు ఎక్కువ.
రక్తంతో ప్రేమలేఖలు రాసేవారట. ఆ స్థాయి ఫ్యాన్స్ ఉండేవారు. ఇక రాజేష్ ఖన్నా మరణం ఇప్పటికీ ఓ మిస్టరీ.. ఆయన వృత్తి, వ్యక్తిగత జీవితాల ఆధారంగా గౌతమ్ చింతామణి రాసిన ‘డార్క్ స్టార్: ది లోన్‌లీనెస్ ఆఫ్ బీయింగ్ రాజేష్ ఖన్నా’ పుస్తకం హక్కులను నిర్మాత నిఖిల్ ద్వివేది దక్కించుకున్నారు. ఆ పుస్తకం ఆధారంగా ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ దర్శకత్వంలో రాజేష్ ఖన్నా బయోపిక్‌ని సిల్వర్ స్క్రీన్‌కి తీసుకు రావాలన్నది నిఖిల్ ద్వివేది ఆలోచన.
అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. మరి... ఈ బయోపిక్ దర్శకత్వ బాధ్యతలు ఎవరు చేపడతారు? రాజేష్ ఖన్నాపాత్రలో ఎవరు నటిస్తారు? అనే విషయాలపై చర్చలు జరుగుతున్నాయి. టాలీవుడ్‌లోని ఒక యువ హీరోకి ఈ ఆఫర్ రాగా, రాజేష్ ఖన్నా స్టైల్‌ని మ్యాచ్ చేయలేనని ఆ హీరో ఈ ప్రాజెక్ట్‌ని సున్నితంగా తిరస్కరించారట. వాçస్తవానికి ఈ సినిమాకి నాలుగైదేళ్ల ముందే సన్నాహాలు చేశారు నిఖిల్. అయితే ఈ మధ్యకాలంలో ఎలాంటి అప్‌డేట్ లేదు. మరి... రాజేష్ ఖన్నా బయోపిక్ షూట్ ఎప్పుడు ఆరంభమవుతుంది? ఎవరు నటిస్తారు? అనేది కాలమే చె΄్పాలి.
గురు దత్ బయోపిక్ లేనట్లే
భారతీయ చలనచిత్ర చరిత్రలో మేటి దర్శకుడు, నటుడు అయిన గురుదత్ జీవితం ఆధారంగా కొన్నాళ్ల క్రితం ఓ బయోపిక్ ప్రకటన వెలువడింది. తొలి చిత్రం ‘ధర్మ్’తో నేషనల్ అవార్డు అందుకున్న దర్శకురాలు భావనా తల్వార్ ఈ బయోపిక్‌ను ప్రకటించారు. షీతల్ తల్వార్‌తో కలిసి భావనా తల్వార్ ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు. గురుదత్ కెరీర్‌లోని సంచలన చిత్రాల్లో ఒకటైన ‘ప్యాసా’నే టైటిల్‌గా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు. అయితే గురు దత్ కుమార్తె నీనా మెమన్ తన తండ్రి జీవిత కథపై సినిమా తీయడానికి వేరే ఎవరికీ అనుమతి లేదని, ఇది కాపీరైట్ ఉల్లంఘన అవుతుందనీ నోటీసులు పంపడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. సో... ప్రస్తుతానికి గురుదత్ బయోపిక్ లేనట్లే.
- డిజి భవాని


