సినిమా అనేది రంగుల ప్రపంచం. తెరపై ముఖానికి రంగులు వేసుకుని ప్రేక్షకులను అలరించే నటీనటుల వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, జీవిత పోరాటాలు ఉంటాయి. ఆ బాధలను అధిగమించి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నవారే నిజమైన స్ఫూర్తిగా నిలుస్తారు. నటి రాగిణి కూడా అలాంటి వారిలో ఒకరు. బుల్లితెరతో పాటు వెండితెరపైనా తన నటనతో అలరిస్తున్న ఆమె వ్యక్తిగత జీవితం.. నిజంగా ఇప్పటి తరానికి ఆదర్శంగా నిలుస్తుంది. కేవలం 13 ఏళ్ల వయసులోనే పెళ్లి.. 14 ఏళ్లకే తల్లిగా మారిన రాగిణి.. ఆ తర్వాత ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. భర్త దూరమైనా వెనక్కి తగ్గలేదు. కొడుడును తండ్రి లేని లోటు తెలియకుండా పెంచడమే కాదు.. తన కాళ్లపై తాను నిలబడి నటిగా ఎదిగి, నలుగురూ గుర్తించే స్థాయికి చేరుకున్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగితే విజయం సాధించవచ్చని ఆమె ప్రయాణం చెబుతుంది. తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనుభవాల గురించి రాగిణి గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సినిమా, టీవీ రంగాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి రాగిణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ‘అమృతం’ సీరియల్‌లో అంజి భార్య శాంతగా నవ్వులు పంచిన ఆమె.. ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. దాదాపు 30 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు 550కు పైగా సీరియల్స్‌తో పాటు సుమారు 190 సినిమాల్లో నటించారు. బుల్లితెర, వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అయితే ఆమె వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుంటే మాత్రం.. ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతటి పోరాటం ఉందో అర్థమవుతుంది.
13 ఏళ్లకే పెళ్లి.. 14 ఏళ్లకే తల్లి
గతంలో ఓ ఇంటర్వ్యూలో రాగిణి చెప్పిన వివరాల ప్రకారం.. 14 మంది పిల్లలున్న కుటుంబంలో ఆమె 12వ సంతానం. చిన్న వయసులోనే ఆమెకు పెళ్లి చేశారు. కేవలం 13 ఏళ్ల వయసులో వివాహం కాగా.. 14 ఏళ్లకే మగబిడ్డకు జన్మనిచ్చారు. పెళ్లైన తర్వాత భర్త నుంచి శారీరకంగా, మానసికంగా వేధింపులు ఎదురయ్యాయి. ముఖ్యంగా డబ్బు కోసం తనను వేధించేవాడట. పెళ్లైన కొద్దికాలానికే భర్త తనను వదిలి మరో మహిళను వివాహం చేసుకున్నాడని రాగిణి తెలిపారు. దీంతో చిన్న వయసులోనే బిడ్డతో ఒంటరిగా మిగిలిపోయారు. అయినప్పటికీ ఆమె కుంగిపోలేదు. తన జీవితాన్ని తానే చక్కదిద్దుకోవాలని నిర్ణయించుకున్నారు.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా వచ్చి రూ. 150 కోట్లు కొల్లగొట్టిన తమిళ సినిమా)
డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభం
భర్త వదిలేసిన తర్వాత రాగిణి తన చిన్న కుమారుడిని తీసుకుని కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రితో పాటు తల్లిని కూడా హైదరాబాద్‌కు తీసుకొచ్చి కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. జీవనం సాగించేందుకు తొలుత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేసేవారు. ఒక్కో డ్యాన్స్ ప్రోగ్రామ్‌కు అప్పట్లో రూ.500 పారితోషికం వచ్చేదని రాగిణి చెప్పుకొచ్చారు. నెలకు ఆరు ప్రోగ్రామ్స్ చేస్తే సుమారు రూ.3 వేల వరకు సంపాదించేవారు. అందులో రూ.750 ఇంటి అద్దెకు, రూ.1,000 తండ్రి మందులకు, మరో రూ.1,000 కుటుంబ అవసరాలకు ఖర్చు చేసేవారు. మిగిలిన రూ.200-300ను దాచుకునేవారు. ఆ డబ్బుతో బస్సులో టీవీ కార్యాలయాలు, స్టూడియోల చుట్టూ తిరుగుతూ నటించే అవకాశాల కోసం ప్రయత్నించేవారట.
అక్క పిల్లలకు కూడా అన్నీ తానై..
తన పిల్లల భవిష్యత్తు కోసం రాగిణి ఎంతో కష్టపడ్డారు. ఒంటరిగానే పిల్లలను పెంచుతూ వారి చదువుకు ప్రాధాన్యం ఇచ్చారు. తన కొడుకుని మాత్రమే కాదు.. తన ఆరో అక్క పిల్లలను కూడా ఆమె చదివించారు. అక్క చనిపోవడంతో ఆ పిల్లలకు కూడా అన్నీ తానై చూసుకున్నారట.వారంతా బాగా చదువుకొని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అయ్యారని.. పిల్లలు జీవితంలో స్థిరపడటం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని రాగిణి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
క్యాస్టింగ్ కౌచ్‌పై రాగిణి వ్యాఖ్యలు
ఇండస్ట్రీలో తొలి రోజుల్లో ఎదురైన అనుభవాల గురించి కూడా రాగిణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ అంశంపై ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. మహిళలు తమ హద్దులను స్పష్టంగా నిర్ణయించుకోవాలని ఆమె సూచించారు. తన అభిప్రాయం ప్రకారం.. ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నామనేది కూడా చాలా ముఖ్యమని రాగిణి చెప్పారు. ఎదుటివారితో అతిగా చనువుగా ఉండకుండా, గౌరవప్రదమైన దూరాన్ని పాటిస్తే అనవసరమైన ఇబ్బందులు తగ్గుతాయని ఆమె పేర్కొన్నారు. తాను మాత్రం ఎప్పుడూ హద్దులు దాటకుండా, తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండేదానినని తెలిపారు.


