
వేతనాలు పెంచాలంటూ గత కొద్ది రోజులుగా సినీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో గత 16 రోజులుగా తెలుగు సినిమాల షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. ఇప్పటికే ఈ సమస్యల పరిష్కారం కోసం ఫిల్మ్ చాంబర్ అటు నిర్మాతలతో, ఇటు కార్మికులతో చర్చలు జరిపింది. కార్మికులు కోరినట్లుగా 30 శాతం జీతాలు పెంచేందుకు నిర్మాతలు ఒప్పుకోవట్లేదు. కార్మికులు సైతం మొట్టు దిగడం లేదు. పలు దఫాల చర్చల అనంతరం తాము పెట్టిన కండీషన్లకు ఒప్పుకుంటే రూ. 2 వేలలోపు జీతాలు ఉన్న వారికి పర్సంటేజీల ప్రకారం పెంచుతామని నిర్మాతలు ప్రకటించారు. ఇందుకు కార్మికులు విముఖత వ్యక్తం చేశారు. దీంతో ఈ సమస్య చివరకు అగ్రహీరో చిరంజీవి(Chiranjeevi) ఇంటికి చేరింది.
(చదవండి: భారీగా రోడ్డెక్కిన సినీ కార్మికులు.. స్తంభించిన టాలీవుడ్)
పరిష్కారం చూపాలంటూ అటు నిర్మాతలు, ఇటు ఫెడరేషన్ నాయకులు చిరంజీవిని కలిశారు. ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని, ఫెడరేషన్ కార్యదర్శి అమ్మిరాజు తో పాటు 20 క్రాఫ్ట్స్ నుంచి వచ్చిన 72 మందితో చిరంజీవి భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో అన్ని సమస్యలపై చర్చించారు. యూనియన్ నాయకులు చెప్పిన సమస్యలను ఓపికతో వినడమే కాకుండా స్వయంగా వాటిని నోట్ చేసుకున్నాడు. తన దృష్టికి వచ్చిన విషయాలను ఫెడరేషన్ నాయకులతో చర్చించి, క్లారిటీ తీసుకున్నారు. ఇక త్వరలో మరోసారి చిరంజీవి అటు నిర్మాతలు, ఇటు కార్మిక సంఘాల నాయకులతో కలిసి భేటి కానున్నారు.
ఈ సమావేశంతో ఈ సమస్యకు ముగింపు పలకాలని చిరంజీవి భావిస్తున్నారట. ఇండస్ట్రీకి పెద్దన్న కాదని చిరంజీవి చెబుతున్నప్పటికీ.. దాసరి నారాయణ మరణం తర్వాత ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా అందరూ చిరంజీవి దగ్గరకే వెళ్తున్నారు. చిరంజీవి కూడా తాను పెద్దన్నను కాదంటూనే సమస్య వచ్చినప్పుడు మాత్రం ఆ పాత్ర పోషిస్తున్నాడు. టాలీవుడ్ సమ్మె విషయంలోనూ అందరి చూపు చిరంజీవి వైపే వెళ్లాయి. ఆయన రంగంలోకి దిగడంతో అటు నిర్మాతలు, ఇటు కార్మికులు తమకు న్యాయం జరుగుతుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. చిరంజీవి ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని ఫెడరేషన్ చెప్పింది. నేడో , రేపో చిరంజీవి ఇరు వర్గాలతో సమావేశం నిర్వహించి, సమ్మెకు ముగింపు పలకాలని భావిస్తున్నాడట. మరి ‘మెగా’ ప్రయత్నం ఫలిస్తుందా? లేదా? చూడాలి.