‘‘నాకు ఎప్పుడూ కథే ముఖ్యం. కథ బాగుంటేనే సినిమా ఆడుతుంది. ‘ఓ..! సుకుమారి’ చిత్రంలో కూడా కథ, కామెడీ, ఎమోషన్స్ అన్నీ అద్భు తంగా ఉంటాయి. నేను నటించిన ‘మసూద’ సినిమాని పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో ఎంజాయ్ చేశారు. అలాంటి విజయమే ‘ఓ..! సుకుమారి’ చిత్రానికి కూడా దక్కుతుందనే నమ్మకం ఉంది’’ అని తిరువీర్ తెలిపారు. భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘ఓ..! సుకుమారి’. తిరువీర్, ఐశ్వర్యా రాజేష్ జోడీగా నటించారు. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతూ– ‘‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా హిట్ అయిన తర్వాత నేను సైన్ చేసిన మొదటి సినిమా ‘ఓ..! సుకుమారి’. హీరోయిన్‌ను ముట్టుకుంటే షాక్ కొడుతుందనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాకి చాలా కనెక్ట్ అయ్యాను’’ అని పేర్కొన్నారు. ‘‘చాలా మంచి సినిమా తీశాం. ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’ అన్నారు మహేశ్వర్ రెడ్డి. ‘‘ఈ సినిమాలో ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలుంటాయి’’ అని భరత్ దర్శన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కెమెరామేన్ కుషేందర్, నటులు జీవన్, గవి రెడ్డి మాట్లాడారు.


