
‘‘మనం ఎంత ఖర్చుపెట్టినా ప్రేక్షకుల నమ్మకాన్ని కొనలేం. సినిమాలు స్పీడ్‌గా చేయాలని, రెండు మూడు సినిమాలు వరుసగా చేసేసి, ప్రేక్షకులను ఒక్కసారి నిరుత్సాహపరిచినా నాకు బాధగా ఉంటుంది. నేను దక్కించుకున్న క్రెడిబిలిటీ, నా కష్టం తాలూకు విలువ పోతుంది. నా సినిమా వస్తోంది... థియేటర్స్‌కు రండి అని ఆడియన్స్‌ని నేను కాన్ఫిడెంట్‌గా, ధైర్యంగా పిలిచేలా నా సినిమాలు ఉండాలనుకుంటాను. ‘మిరాయ్’ ఇలాంటి చిత్రమే’’ అని తేజ సజ్జా అన్నారు. తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం తేజ సజ్జా చెప్పిన సంగతులు.
⇒ ఫుల్ ఫ్యామిలీ అండ్ క్లీన్ ఫిల్మ్ ‘మిరాయ్’. యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, డివోషన్, ఎలివేషన్... ఇలా అన్ని అంశాలు ఉన్న చిత్రం ఇది. చార్మినార్‌లోని కుర్రాడు వాడి ధర్మం ఏంటో వాడు గ్రహించి, తనకి, యోధ ప్రపంచానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుని, ఓ పెద్ద ఆపదను ఆపడానికి ఎంత దూరం వెళ్లాడు? తల్లి ఆశయం కోసం ఏం చేశాడు? ప్రపంచం అంతరించబోతున్నటువంటి ఓ పెద్ద ఆపద రాబోతున్నప్పుడు మన ఇతిహాసాల్లో వేల సంవత్సరాల క్రితం పెట్టి ఉంచిన సమాధానాన్ని ఈ కుర్రాడు ఎలా కనుక్కుంటాడు? అన్నది ఈ సినిమా కథాంశం.
⇒ ఈ చిత్రంలో తొమ్మిది యాక్షన్ సీక్వెన్స్‌లు వరకు ఉన్నాయి. వయసులో ఉన్నాను కాబట్టి ఫిజికల్ చాలెంజ్‌లు ఏం అనిపించలేదు. ఈ సీక్వెన్స్‌లు చూసి, ఆడియన్స్ ఎంత థ్రిల్ అవుతారో చూడాలనుకుంటున్నాను. టీజీ విశ్వప్రసాద్‌గారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆడియన్స్‌కు నచ్చే మంచి సినిమా తీద్దామనుకునే నిర్మాత. ఆయనలాంటి నిర్మాతలు అరుదు. అందుకే ఆయనతో మరో సినిమా చేస్తున్నాను.
⇒ నా చిత్రాలతో ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేయాలని తపన పడుతుంటాను. కొత్తదనంతో కూడిన సినిమాలు చేయాలనుకుంటాను. ఆ ప్రెజర్ ఉంది. కానీ ‘హను–మాన్’ సినిమా సక్సెస్‌తో నాపై కొత్తగా పెరిగిన ఒత్తిడి ఏం లేదు. చె΄్పాలంటే ఒక రకంగా ‘హను–మాన్’ సినిమా విషయంలోనే ఒత్తిడి ఫీలయ్యాను. కొన్ని ఇబ్బందికర పరిస్థితుల మధ్య ఆ సినిమా విడుదలైంది. ఈ సినిమా విజయం సాధించింది కదా అని ‘మిరాయ్’ సినిమాలో మార్పులు చేర్పులు చేయలేదు.
⇒ మా నాన్నగారు హార్డ్‌వర్కింగ్ పర్సన్. ఆయన వయసు 65. ఈ రోజుకీ ఆయన ఉదయం 6.30కి ఉద్యోగానికి వెళ్తారు. సాయంత్రం 8 గంటలకు వస్తారు. పనిని ఫస్ట్ ప్లేస్‌లో పెట్టేవారిలో మా ఫాదర్ ఒకరు. అలాంటి ఇంటి నుంచి వస్తున్నాను కాబట్టే పనికి నేను ఇంత ప్రాధాన్యత ఇస్తున్నానేమో అనిపిస్తోంది. పనే దైవం అని భావిస్తాను.
⇒ కథ కుదరితే పాన్ ఇండియా స్థాయిలో నా సినిమా రిలీజ్ చేస్తాం. నిజానికి పాన్ ఇండియా సూపర్ స్టార్లు నా చిన్నప్పట్నుంచి ఉన్నారు. రామారావు, నాగేశ్వరరావుగార్ల సినిమాలు చెన్నైలో చూసేశారు. చిరంజీవిగారు స్ట్రయిట్‌గా హిందీలో సినిమాలు చేశారు. రజనీకాంత్, కమల్‌హాసన్‌గార్ల సినిమాలు నేను నా చిన్నప్పట్నుంచి చూస్తున్నాను. అలాంటి వారికి జోడించాల్సిన పాన్ ఇండియా స్టార్ ట్యాగ్‌ని నాలాంటి యంగ్ హీరోస్‌కి పెట్టడం ఏ మాత్రం కరెక్ట్ కాదని నమ్మేవారిలో నేనొకడిని. తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు మేం సినిమాలు చేస్తున్నాం. ఒకవేళ మేం చేసే చిత్రం ఇతర భాషల ఆడియన్స్‌కు కూడా నచ్చితే, అది మాకు బోనస్. దీని కోసం రిలీజ్ చేయడమే. అంతేకానీ... అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలన్న ప్రయత్నం ఏమీ లేదు.
⇒ ‘జై హనుమాన్’ చిత్రంలో నటిస్తున్నానా? లేదా అనేది ప్రశాంత్ వర్మగారు చెబుతారు. ‘జాంబిరెడ్డి 2’ సినిమాకు ఇంకా దర్శకుడు ఫిక్స్ కాలేదు. ప్రశాంత్‌గారు కథ అందిస్తున్నారు. విశ్వప్రసాద్‌గారు నిర్మిస్తారు. ‘మిరాయ్’ సినిమా విజయం సాధిస్తే, రెండో భాగం కూడా ఉంటుంది.