వైవిధ్య భరిత కథ చిత్రాలను నిర్మించడంలోనూ, టాలెంటెడ్ కళాకారులను ప్రోత్సహించడంలోనూ ముందుండే నటుడు శివ కార్తికేయన్.. తన ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న కొత్త చిత్రం తాయ్ కిళవి. ఈ చిత్రం ద్వారా శివ కుమార్ మురుగేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో నటి రాధిక శరత్ కుమార్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ను విడుదల చేశారు.
తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించిన రాధికా శరత్‌కుమార్.. ఈ మూవీలో ఉసిలంపట్టి గ్రామం కట్టుబాటులో నివసించే 75 ఏళ్ల బామ్మగా ఆమె కనిపించనున్నారు. ఆమె కుటుంబం, ఆ ఊరి ప్రజల జీవన విధానం, కట్టుబాట్లు, సమస్యలు తదితర అంశాలకు వినోదాన్ని జోడించి తెరకెక్కించినట్లు దర్శకుడు చెప్పారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ 2026 ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.


