తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. డిసెంబర్ 28న హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ ఆఫీస్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోని ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియోలు ఈ నాలుగు సెక్టార్ల కౌన్సిల్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఈ ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు. ఎన్నికల నిర్వహణాధికారిగా దుర్గాప్రసాద్ వ్యవహరిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులలో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. అయితే, ఛాంబర్ ఎన్నికల్లో రెండు ప్యానెల్స్ మధ్యే వార్ ఉండనుంది. నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, సురేశ్ బాబు బలపరుస్తున్న 'ప్రోగ్రెసివ్ ప్యానల్' ఒకవైపు ఉంటే.. సి. కళ్యాణ్, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు బలపరుస్తున్న 'మన ప్యానెల్' మరోవైపు రేసులో వుంది. ఈ క్రమంలో తాజాగా మన ప్యానెల్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు.
మన ప్యానెల్ నుంచి చదలవాడ శ్రీనివాసరావు ఇలా అన్నారు. ఆదివారం ఛాంబర్ ఎన్నికలు జరగనున్నాయి. చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఛాంబర్‌లో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒకరికొకరు సహకరించుకుని ముందుకు వెళ్లాలి. గత పదేళ్లుగా చిత్ర పరిశ్రమ అదుపు తప్పింది. గిల్డ్ అని పెట్టి ఇష్టారీతిన కొందరు వ్యవహరిస్తున్నారు. 20 రోజుల పాటు కార్మికులకు పనిలేకుండా చేశారు. నిజానికి గిల్డ్ సభ్యులే సినిమా చిత్రీకరణలు ఆపారు. వారు తమ స్వార్దంగా వ్యవహరించడంతోనే ఇబ్బందులు వచ్చాయి. ఛాంబర్ సభ్యుల పేరుతో ముఖ్యమంత్రులతో ఫోటోలు దిగాలనే ఆలోచనతో మాత్రమే వారు ఉన్నారు.

చిత్ర పరిశ్రమ బాగు అనేది వారికి పట్టలేదు. సీఎం రేవంత్‌రెడ్డి యోగ్యులు కాబట్టి కార్మికుల సమస్యను పరిష్కరించారు. వాస్తవానికి ఫిల్మ్ ఛాంబర్ చేయాల్సిన పనిని సీఎం పూర్తి చేశారు. చిన్న హీరోలను బతకనివ్వడం లేదు. క్యూబ్, యుఎఫ్‌ఓ వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. వాటిని ఎవరూ పట్టించుకోలేదు. చిత్రపురికి సమస్య వస్తే చిన్న నిర్మాతలమే సపోర్ట్‌గా నిలిచాం. వారందరే మన ప్యానెల్ తరపున పోటీ చేస్తున్నాం. అందరికీ అర్ధరాత్రి కూడా అందుబాటులో ఉంటాం.' అని ఆయన అన్నారు.
రామానాయుడు ఇంటిని పబ్‌కి ఇచ్చారు: సి కల్యాణ్ కామెంట్స్
ప్రోగ్రెసివ్ ప్యానల్ (దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు) పేరుతో మన వారసత్వం మన స్వాభిమానం అంటూ ఏదో ప్రకటనలు వేశారు. నిజానికి వారికి ఎలాంటి స్వాభిమానం లేదు. వారు వ్యక్తిగత లాభం కోసం ఏదైనా చేస్తారు. మేము మొదటి నుంచి చిన్న నిర్మాతలకు అందుబాటులో ఉన్నాం. వాస్తవానికి వారిని రెండేళ్ల క్రితం మేము సపోర్ట్ చేసి గెలిపించాము. చదలవాడ నాడు అందరం కలిసి వెళదామని చెప్పటంతోనే సపోర్ట్ చేశాం. కానీ, పదవుల్లోకి వచ్చి కూర్చొన్నారు తప్ప పరిశ్రమ కోసం ఏమీ చేయలేదు. వారి నుంచి చిన్న సినిమాలకు ఎలాంటి సపోర్ట్ లేదు. గిల్డ్ సభ్యులు చెప్పెవన్నీ అబద్దాలే. దామోదర్ ప్రసాద్ కార్మికులకు ఏమి చెయలేకపొయాడు. గిల్డ్ ప్రొడ్యూసర్స్ కోసం మాత్రం చాలా చేశాడు. కామెడీగా లేబర్ కమీషనర్ వద్దకు నిర్మాతలు వెళ్లటం వీరి హయాంలోనే జరిగింది.
విభజించు పాలించు అన్నట్టుగా గిల్డ్ సభ్యులు వ్యవహారశైలి ఉంది. ఛాంబర్ బిల్డింగ్ గురించి ఐకానిక్ టవర్ అంటూ కామన్‌సెన్స్ లేకుండా గిల్డ్ సభ్యులు మాట్లాడుతున్నారు. అది ఏ ఒక్కరిది కాదు. దాంట్లో మనం అద్దెకు ఉంటున్నాం. అది సినిమా ఇండస్ట్రీది కానేకాదు. సెకెండ్ ఫ్లోర్‌లో కొందరికి ఆఫీస్‌లు ఉన్నాయి కాబట్టి స్వార్దం కోసం ఎదెదో మాట్లాడుతున్నారు. ఫిలిం నగర్ సోసైటీ ఆస్తి అది. రామానాయుడు నివశించిన ఇంటిని పబ్‌కి ఇచ్చారు. బాధగా ఉంది. చిన్న నిర్మాతలందరు మన ప్యానెల్ వైపే ఉన్నారు. సినీ కార్మికులు, కృష్ణానగర్ ఆర్టిస్ట్‌లు బతకాలంటే చిన్న సినిమాలే ముఖ్యం. ఓటిటి విషయంలోనూ గిల్డ్ వారు మాయామాటలు చెప్పారు. టిక్కెట్ రేట్లు అడిగేది వారే.. వాటికి వ్యతిరేకం అనేది కూడా వారే కావడం విశేషం. నాలుగు సెక్టార్స్‌లలో మన ప్యానెల్ ఉంది. ఓట్లేసి గెలిపించండి' అని కల్యాణ్ అన్నారు
దిల్ రాజు చెప్పేవి అన్నీ మాయ మాటలే: నిర్మాత నట్టికుమార్
'గిల్డ్ నుంచి చిత్ర పరిశ్రమలోని వారికి ఎలాంటి సపోర్ట్ లేదు. గెలిచినవారు మీటింగ్‌లకు కూడా రాలేదు. పదిమంది స్వార్దం కోసం గిల్డ్ డబ్బు వాడారు. మేము 1600 మంది సభ్యుల మెడిక్లెయిమ్ కోసం కృషి చేశాం. దిల్ రాజు ఎన్నికలు కోసం మాయ మాటలు చెప్పారు. అతనికి చేతకాక ఏడాది తరువాత దిగిపోయారు. నాగవంశీ మాత్రం సినిమాలు తీయని వారికి ఎందుకు మెడిక్లెయిమ్ ఇవ్వాలని అంటాడు. సీనియర్‌లపై గౌరవం ఉండాలి. చిన్న సినిమాలకు థియేటర్స్ కావాలని ఎప్పటినుంచో అడుగుతున్నాం. ఛాంబర్ పదవుల్లో ఉండి.. వారి స్వార్దం కోసమే దామోదర్ ప్రసాద్ పని చేశారు. మన ప్యానెల్ తరపున మెడిక్లెయిమ్‌తో పాటు చిన్న సినిమాకు ఐదో షో ఉండేలా కృషి చేస్తాం. చిత్రపరిశ్రమలో దిల్ రాజు, వంశీ, సుప్రియ ఎవరికైనా సాయపడ్డారా..?' అంటూ నట్టి కుమార్ ప్రశ్నించారు.


