
తమిళ హీరో సూర్య ప్రస్తుతం తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. భార్య జ్యోతిక కూడా కొన్నాళ్ల క్రితం రీఎంట్రీ ఇచ్చింది. అడపాదడపా మూవీస్ చేస్తోంది. ఇప్పుడు ఈ కుటుంబం నుంచి తర్వాత తరం కూడా ఇండస్ట్రీలోకి వచ్చేసింది. సూర్య కూతురు దియా.. ఏ మాత్రం హడావుడి లేకుండా కొత్త ప్రాజెక్ట్ చేసింది. ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేయడంతో ఈ విషయం బయటపడింది.
సూర్య-జ్యోతిక లది ప్రేమ వివాహం. 'కాకా'(తెలుగులో ఘర్షణ) అనే సినిమా చేస్తున్నప్పుడు ప్రేమలో పడ్డారు. పెద్దల్ని ఒప్పించి 2006లో పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు దియా, దేవ్ అని కూతురు కొడుకు ఉన్నారు. దియా వయసు ప్రస్తుతం 17 ఏళ్లు. మొన్నీమధ్య స్కూలింగ్ పూర్తి చేసింది. ఇప్పుడు 'లీడింగ్ లైట్' అనే చిత్రంతో దర్శకురాలిగా మారింది.
(ఇదీ చదవండి: మరోసారి తండ్రయిన హీరో సుహాస్)
సినిమా తీయడంలో తెర వెనక చాలామంది మహిళలు పనిచేస్తుంటారు. అసలు వాళ్లు ఎలాంటి కష్టాలు పడుతుంటారు? అనే కాన్సెప్ట్‌తో ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ని దియా తీసింది. ఆస్కార్ అర్హత కోసం ప్రస్తుతం దీన్ని కాలిఫోర్నియాలోని రీజెన్సీ థియేటర్‌లో ప్రదర్శిస్తున్నారు. సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 02 వరకు ప్రతిరోజూ ఈ డాక్యుమెంటరీ వేయనున్నారు.
సూర్య-జ్యోతిక కూతురు ఇలా ఇండస్ట్రీలోకి వచ్చింది, దర్శకత్వం చేసింది అనే విషయాన్ని ఇప్పటివరకు సైలెన్స్‌గానే ఉంచారు. దీన్ని సూర్య-జ్యోతిక తమ ప్రొడక్షన్ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. తాజాగా సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ పెట్టేసరికి అందరికీ ఈ విషయం తెలిసింది. అలా సూర్య కూతురిని అభినందిస్తున్నారు. మొన్నీమధ్య షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్.. 'ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' సిరీస్‌తో దర్శకుడిగా మారాడు. ఇప్పుడు సూర్య కూతురు కూడా డైరెక్టర్ అయిపోయింది.
(ఇదీ చదవండి: ఓజీలో పవన్ కూతురిగా సాయేషా.. ఎవరీ పాప?)
