సినిమా రంగంలో ఏదైనా జరగవచ్చు. ఎవరు ఎవరినైనా దర్శకత్వం వహించవచ్చు. అయితే కథే ఇక్కడ ప్రధానాంశం. అది సరిగా సెట్ కాకపోవడంతోనే రజనీకాంత్ హీరోగా సుందర్.సి దర్శకత్వం వహించాల్సిన చిత్రం తెర రూపం దాల్చలేదు. తాజాగా ఒక రేర్ కాంబో గురించి వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేంటంటే కమలహాసన్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో చిత్రం రూపొందే విషయమై చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం ఉంది.
కమలహాసన్ ఏ తరహా చిత్రాన్నైనా చేయగలరు. అయితే వెట్రిమారన్‌కు ఒక ముద్ర ఉంది. ఆయన చిత్రాల కథలు వెనుకబడ్డ వర్గాల ఇతి వృత్తం, నేరారోపణలకు బలైన యువత ఇతి వృత్తంతో ఉంటాయి. తాజాగా ఈయన శింబు హీరోగా అరసన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఉత్తర చెన్నైకి చెందిన గ్యాంగ్‌స్టర్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.థాను తన వి.క్రియేషన్ పతాకంపై నిర్మిస్తున్నారు.

అదే విధంగా నటుడు కమలహాసన్ తాజాగా స్టంట్‌మాస్టర్ల ద్వయం అన్బరివ్‌ల దర్శతకత్వంలో నటిస్తూ, తన రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషన్ పతాకంపై నిర్మించే పనిలో బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వెట్రిమారన్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా నటించే చిత్రం గురించి చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో నిజమెంతోగానీ, ఇదే గనుక జరిగితే కచ్చితంగా వైవిద్యభరిత కథా చిత్రం అవుతుంది.


