మలయాళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌కు ఈ ఏడాది బాగా కలిసొచ్చిందనుకుంటే.. తాజాగా విడుదలైన 'వృషభ' మూవీ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. 2025 మోహన్‌లాల్ నటించిన లూసిఫర్ (ఎంపురాన్) రూ. 268 కోట్లు, తుడరమ్ రూ. 235 కోట్లు, హృదయపూర్వం రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరాయి. కానీ, ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'వృషభ' భారీ నష్టాలను మిగిల్చింది.
క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన 'వృషభ' మూవీ బాక్సాఫీస్ వద్ద 5రోజుల్లో రూ. 1.94 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సుమారు రూ. 70 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ఈ సినిమా ఉంది. ప్రాంతాల వారిగా 5రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. ఓవర్సీస్‌లో ఈ చిత్రం దాదాపు రూ. 25 లక్షలు, మలయాళంలో రూ. 1.01 కోట్లు, హిందీలో రూ. 8 లక్షలు, తెలుగు వెర్షన్ రూ. 32 లక్షలు, కన్నడ వెర్షన్ దాదాపు రూ. 4 లక్షలు మాత్రమే సాధించింది. ఫైనల్‌గా ఈ మూవీ రూ. 65 కోట్లకు పైగానే నష్టాన్ని మిగల్చడం ఖాయంగానే కనిపిస్తుంది.
మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో దర్శకుడు నందకిషోర్ 'వృషభ' చిత్రాన్ని తెరకెక్కించారు. తండ్రీ కొడుకుల చుట్టూ తిరిగే జన్మజన్మల కథగా ఈ మూవీ ఉంది. కొత్తదనం లేని కథతో ప్రేక్షకులకు విసుగు తెప్పించారని విమర్శలు ఉన్నాయి. ఇందులో కేవలం మోహన్‌లాల్ నటన మాత్రమే బాగుందని ప్రశంసలు వచ్చాయి. అజయ్, అలీ, అయ్యప్ప పి.శర్మ వంటి తెలుగునటులు ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపిస్తారు.


