బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా 'బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్'పై చైనా తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. సినిమా తీసినంతమాత్రన చరిత్ర మారిపోదంటూ చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ లో అక్కసు వెళ్లగక్కింది. ఈ మేరకు తమ సంపాదకీయంలో బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ చిత్రంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇండియన్ సినిమాపై చైనాకు ఎందుకంత అక్కసు? బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ కథేంటి?
తెలంగాణ వీర సైనికుడిగా సల్మాన్
సల్మాన్‌ఖాన్(salman Khan) హీరోగా అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’(Battle of Galwan Movie). సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఈ చిత్ర టీజర్ విడుదలైంది. సల్మాన్ ఖాన్ ఇందులో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. 2020లో గల్వాన్ లోయలో భారత-చైనా సైనిక ఘర్షణ ఘటన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో వీరమరణం పొందిన తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమళ్ళ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ కనిపించబోతున్నాడు.
అయితే ఈ సినిమా కథపైనే ఇప్పుడు చైనా అభ్యంతరం చెబుతోంది. ఈ చిత్రం చరిత్రను వక్రీకరిస్తోందని చైనా మీడియా ఆరోపిస్తోంది. చైనా ప్రాదేశిక సమగ్రతను కాపాడటంలో తమ సైన్యం సంకల్పాన్ని ఇలాంటి సినిమాలు దెబ్బతీయబోదంటూ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. గ్లోబల్ టైమ్స్ ప్రచురించిన కథనంలో చైనా సైనిక నిపుణులు మాట్లాడుతూ..భారత్-చైనా గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణకు సంబంధించిన నిజాలను సినిమాలో చూపించలేదని ఆరోపించారు. మూవీ కథాంశం భారత్ కి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని, ఇది ప్రజలను రెచ్చగొట్టడానికి దోహదమవుతుందని చైనా మీడియా ప్రచారం చేస్తోంది.
అదే చైనా భయమా?
2020 జూన్ 15న గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది.భారత్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఆక్రమించేందుకు చైనా ఆర్మీ దుస్సాహసం చేయగా, 16వ బీహార్ బెటాలియన్‌కు చెందిన కమాండింగ్ అధికారి కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని భారత సైనికులు చైనా దళాలకు ధీటుగా జవాబిచ్చారు. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది జవాన్లు అమరులయనట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. అయితే చైనా మాత్రం వారికి జరిగిన ప్రాణనష్టంపై ప్రకటన విడుదల చేసేందుకు నిరాకరించింది.
ఈ ఘటనలో చైనాకు చెందిన 40 మందికిపైగా సైనికులు మరణించి ఉంటారని విదేశీ మీడియా కథనాలు వెలువరించినప్పటికీ, చైనా మాత్రం ఈ విషయంలో నోరు మెదపలేదు. ఇప్పుడు ఈ ఘటన నేపథ్యంలోనే 'బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్' సినిమా రాబోతుంది. ఈ సినిమా విడుదలైతే..అసలు నిజం చైనీయులకు కూడా తెలిసే అవకాశం ఉంది. భారత్ చేతిలో చైనా సైన్యం ఘోరంగా దెబ్బతిందనే విషయం కూడా ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది. అందుకే టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై చైనా దుష్ప్రచారం చేస్తోంది. ఈ సినిమా చైనా సర్కార్ పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని భారత విశ్లేషకులు చెబుతున్నారు.


