
సాక్షి, చెన్నై: సేవా గుణం కలిగిన అతి తక్కువ మంది తమిళ నటుల్లో సూర్య ముందుంటారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. ఈ నటుడిలో ఎంత పెద్ద కథానాయకుడు ఉన్నాడో అంత మంచి విద్యాదాత ఉన్నారు. విద్యాదానంలో తన తండ్రి నటుడు శివకుమార్‌ను స్ఫూర్తిగా తీసుకొని సూర్య అగరం ఫౌండేషన్ ద్వారా అనేక మందిని చదివిస్తూ వారి ఉన్నత కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. అదేవిధంగా ప్రతిభ ఉండి చదువుకునే స్థోమత లేని పేద విద్యార్థులకు ప్రతి ఏడాది ఆర్థికసాయం, ప్రశంసా పత్రాలతో ప్రోత్సహిస్తున్నారు. ఈయన సేవా దాతృత్వం గురించి ఇటీవల స్టంట్ మాస్టర్ సెల్వ చెబుతూ గత పదేళ్లుగా సూర్య తమిళ సినిమాకు సంబంధించిన స్టంట్ మాస్టర్లకు ఏడాదికి అందరికి కలిపి రూ.10లక్షలు ఇన్సూరెన్స్ కడుతున్నారని చెప్పారు.
ఈ విషయాన్ని ఆయన ఎవరితోనూ చెప్పలేదని పేర్కొన్నారు. అంతటి మానవత్వం కలిగిన సూర్య బుధవారం 50 వసంతంలోకి అడుగుపెడుతున్నారు. దీంతో నాలుగు రోజుల నుంచే ఆయన అభిమానులు పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహించడం మొదలుపెట్టారు. అలా సూర్య సేవా సంఘం తరఫున ఉత్తర చెన్నై ప్రాంతంలో రూ.2లక్షల విలువైన సేవా కార్యక్రమాలను నిర్వహించారు. కుట్టుమిషన్లు, 150 మంది మహిళలకు చీరలు, 50 మంది పురుషులకు పంచెలు, 150 మంది విద్యార్థులకు చదువు ఉపకరణాలు, 150 మంచి నీటి బిందెలు, పదిమంది వృద్ధులకు ఆర్థికసాయం అందించారు.
ఈసేవా కార్యక్రమంలో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సహ నిర్మాత రాజశేఖర్ పాండియన్ పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సూర్య కథానాయకుడిగా నటిస్తున్న 45వ చిత్రం కడుప్పు. ఈ చిత్రం దీపావళికి సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం తన 46 వ చిత్రాన్ని టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్నారు.