ఓటీటీలో మస్ట్ వాచ్ థ్రిల్లర్.. నరాలు తెగే ఉత్కంఠ | Stolen Movie Review Telugu | Sakshi
Sakshi News home page

Stolen Review Telugu: గంటన్నరే కానీ బోలెడంత థ్రిల్.. ఓటీటీ తెలుగు రివ్యూ

Jun 15 2025 12:53 PM | Updated on Jun 15 2025 12:56 PM

Stolen Movie Review Telugu

ఓటీటీలో ఎప్పటికప్పుడు బోలెడన్ని కొత్త సినిమాలు వస్తుంటాయి. కొన్ని మాత్రమే నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. భాషతో సంబంధం లేకుండా మస్ట్ వాచ్ అనిపించుకుంటూ ఉంటాయి. అలాంటి ఓ మూవీ గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. కేవలం గంటన్నర నిడివితో రిలీజైన ఈ చిత్రం.. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తోంది? అదే 'స్టోలెన్'. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? అనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?
ఓ చిన్న ఊరి రైల్వే స్టేషన్. జుంపా(మియా మేల్జర్) అనే మహిళ.. ఐదు నెలల తన కూతురితో ఫ్లాట్‌ఫామ్‌పై నిద్రపోతుంటుంది. మరో మహిళ సైలెంట్‌గా ఈ పాపని ఎత్తుకుపోతుంది. అదే టైంలో ట్రైన్ దిగి సోదరుడి కోసం ఎదురుచూస్తున్న రామన్(శుభం).. పాపని ఎత్తుకుపోయిన దొంగ అని జుంపా అనుమానిస్తుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగుతారు. కేసు నమోదు చేస్తారు. కాసేపటి తర్వాత అక్కడికి వచ్చిన రామన్ సోదరుడు గౌతమ్(అభిషేక్ బెనర్జీ) కూడా.. ఈ వ్యవహారంలో ఇరుక్కుంటాడు. ఇంతకీ పాపని ఎత్తుకెళ్లింది ఎవరు? ఊరి ప్రజలు.. అన్నదమ్ములపై ఎందుకు దాడి చేశారు? చివరకు పాప దొరికిందా లేదా అనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
సీట్ ఎడ్జ్ థ్రిల్లర్.. ఈ మాట గతంలో మీరు చాలాసార్లు వినే ఉంటారు. 'స్టోలెన్' చూస్తున్నంతసేపు మీరు కచ్చితంగా అదే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎలాంటి అనవసర హంగామా లేకుండా స్ట్రెయిట్‌గా స్టోరీలోకి వెళ్లడంతో సినిమా మొదలవుతుంది. అక్కడి నుంచి 90 నిమిషాల పాటు నాన్‌స్టాప్‌గా కథ పరుగులు పెడుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే వచ్చే ట్విస్టులు మనకు మతిపోయేలా చేస్తాయి. చివరకు ఓ మంచి మూవీ చూసిన అనుభూతి కలుగుతుంది.

2017లో అసోంలో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా 'స్టోలెన్' సినిమా తీశారు. ఓ చిన్న ఊరిలోని రైల్వే స్టేషన్‌లో పాప కిడ్నాప్ కావడంతో మూవీ మొదలవుతుంది. పాపని ఎత్తుకుపోయిన కాసేపటికి నిద్రలేచిన తల్లి.. స్టేషన్‌లో ఓ వ్యక్తిని చూసి అనుమానిస్తుంది. కొంతసేపటి తర్వాత అసలు దొంగ ఎవరో ఆమెకు తెలుస్తుంది. కానీ అనుమానిత వ్యక్తి, అతడి సోదరుడు కూడా పోలీసుల దగ్గర ఇరుక్కుంటారు. సదరు వ్యక్తి అతి మంచితనం వల్ల.. గాలికి పోయే వ్యవహారాన్ని కాలికి తగిలించుకుంటాడు. అక్కడి నుంచి అన్మదమ్ములు ఎలాంటి కష్టాలు పడ్డారు? ఇంతకీ ఆ పాప.. సదరు మహిళ కూతురేనా? లేదంటే ఆమె కూడా దొంగతనంగా ఎత్తుకొచ్చిందా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి.

సినిమా చూస్తున్నప్పుడు మనం ఊహించింది జరగనప్పుడే థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఇందులో కేవలం నాలుగైదు పాత్రలే ఉంటాయి. అవి ప్రవరిస్తున్న విధానం చూసి వీడు మంచోడు, ఈమె చెడ్డది అని అనుకుంటాం. కానీ స్టోరీ ముందుకెళ్లేకొద్దీ మనం అనుకున్నది జరగదు. అదే టైంలో సాదాసీదాగా మొదలైన ఓ ఇన్వెస్టిగేషన్ డ్రామా కాస్త థ్రిల్లర్‌గా మారుతుంది. క్లైమాక్స్‌కి వచ్చేసరికి సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న పిల్లల అక్రమ రవాణా, సరోగసి గురించి సరికొత్త నిజం తెలుస్తుంది. కానీ చూస్తున్నంతసేపు మనం కూడా సినిమాలోని పాత్రలతో పాటు ఉన్నామా అనే అనుభూతి కలుగుతుంది. ఈ విషయంలో మాత్రం దర్శకనిర్మాతలు పూర్తిగా సక్సెస్ అయ్యారు.

ఎవరెలా చేశారు?
ఓటీటీలో సినిమాలు-వెబ్ సిరీసులతో పరిచయమైన అభిషేక్ బెనర్జీ ఇందులో గౌతమ్ పాత్రలో కనిపించాడు. ఇతడిదే మెయిన్ రోల్. రియలస్టిక్ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. రామన్‌గా చేసిన శుభం, జుంపా రోల్ చేసిన మియా మేల్జర్ కూడా జీవించేశారు. మిగిలిన పాత్రధారులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్‌గా చూస్తే చాలా బ్రిలియంట్ మూవీ. డైరెక్టర్ కరణ్ తేజ్‌పాల్‌కి ఇదే తొలి సినిమా. కానీ చూస్తున్నంతసేపు అలా ఎక్కడా అనిపించదు. సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే అయితే టాప్ నాచ్ ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మూడ్‌కి తగ్గట్లు భలే కుదిరిందని చెప్పొచ్చు. మిగిలిన టెక్నీషియన్స్ కూడా అదరగొట్టేశారు. ప్రస్తుతానికి ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. ఒకవేళ మంచి రియలస్టిక్ థ్రిల్లర్ చూద్దామనుకుంటే మాత్రం 'స్టోలెన్' బెస్ట్ ఆప్షన్. 

Advertisement
 
Advertisement
Advertisement