ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ మూవీ ‘స్పిరిట్’. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ‘యానిమల్’ మూవీ ఫేమ్ తృప్తీ దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రకాష్‌రాజ్, వివేక్ ఒబెరాయ్, కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్, టీ–సిరీస్ బ్యానర్స్‌పై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారి పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పోలీస్ అనగానే పవర్‌ఫుల్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం సాగుతుందని అనుకుంటారు. అయితే ఈ సినిమాలో భావోద్వేగాలకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉందట. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ‘‘స్పిరిట్’ లో తన కెరీర్‌లోనే మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు ప్రభాస్.
తన మార్క్ యాక్షన్, ఎమోషన్స్‌తో అద్భుతమైన అనుభూతిని ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నారు సందీప్. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చూశాను. పోలీస్ స్టోరీ కథ అయినప్పటికీ కుటుంబ నేపథ్యం, బలమైన భావోద్వేగాలు ఉంటాయి. మునుపెన్నడూ చూడని సినిమా ఇది అని ప్రేక్షకులు భావిస్తారు’’ అని పేర్కొన్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడతో పాటు చైనీస్, జపనీస్, కొరియన్ సహా మొత్తం 8 భాషల్లో 2027 మార్చి 5న విడుదల కానుంది.


