పరువు పోగొట్టుకుంటున్న సినిమా జర్నలిజం...
ఇది సోషల్ మీడియా యుగం. కారెవరూ ఫేమస్ అవడానికి అనర్హం అన్నట్టుగా తయారు చేసిన సామాజిక మాధ్యమాల యుగం. ఇవి ప్రతీ ఒక్కరికీ కీర్తి దాహాన్ని పాప్యులారిటీ పిచ్చిని పెంచేస్తున్నాయి. ఉఛ్చనీచాలు, కనీస విలువలను మర్చిపోయేలా చేస్తున్నాయి. అయితే ఆ మైకంలో జర్నలిజం కూడా చిక్కుకుపోవడమే దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. నలుగురిలో ప్రత్యేకంగా నిలవడానికి ఒకప్పుడు పాత్రికేయులు గొప్ప గొప్ప కధనాలు రాసేవారు. సినిమాలపై అద్భుతమైన సమీక్షలతో ప్రేక్షకులకు మార్గదర్శకత్వం వహంచేవారు. ఇప్పుడు.. దాని కోసం కొందరు ఎంచుకుంటున్న దారులు సినీ జర్నలిస్టులు అంటేనే సెలబ్రిటీలు చీదరించుకునే స్థాయికి దిగజార్చుతున్నాయి.
ఆ మధ్య ఓ సినీ జర్నలిస్ట్ నటి మంచులక్ష్మి వస్త్రధారణపై ప్రశ్నించడం ద్వారా తల బొప్పి కట్టించుకున్న వైనం చూశాం. ఐదు పదుల వయసులో ఉన్న మహిళ అయి ఉండీ ఇలాంటి దుస్తులు ధరించడం కరెక్టా? అనే అసంబద్ధమైన ప్రశ్న ద్వారా మంచులక్ష్మి కోపాన్ని నషాళానికి ఎక్కించారాయన. ఇది చిలికి చిలికి చివరకి మా అసోసియేషన్‌కి మంచులక్ష్మి ఫిర్యాదు చేసే వరకూ వెళ్లింది.
ఆ ఉదంతం ఇంకా మరవకముందే... మరో పాత్రికేయ నారీమణి... తమిళ నటీనటుల సాక్షిగా తెలుగు జర్నలిస్ట్‌ల పరువు తీసిపారేశారు. ఒక యువ కధానాయకుడు, దక్షిణాదిలో మంచి పేరు తెచ్చుకున్న నటుడు ప్రదీప్ రంగనాథన్(pradeep ranganathan)ను ప్రశ్నించే క్రమంలో మీరు హీరో మెటీరియల్ కాదు కదా అంటూ వ్యాఖ్యానించడం ద్వారా ఆ మహిళా జర్నలిస్ట్ వివాదం రాజేసింది. దీంతో ఆమెపై నెటిజన్ల నుంచి సినీ జనం దాకా దుమ్మెత్తి పోశారు. సీనియర్ నటుడు శరత్‌కుమార్ నుంచి మన యువనటుడు కిరణ్ అబ్బవరం దాకా... సదరు జర్నలిస్ట్ ప్రశ్నలోని డొల్లతనాన్ని లేకితనాన్ని ఎత్తిచూపారు.
సరే... ఇప్పుడిప్పుడే ఆ సంగతి మరుగునపడుతోంది అనుకునేంతలో... తమిళ నాట మరోసారి మరో సినీ జర్నలిస్ట్ తన నోటికి పని కల్పించాడు. మార్గంకాలి, అనుగ్రహీతన్ అంటోనీ వంటి మళయాళ సినిమాల ద్వారా ప్రతిభావంతురాలైన యువనటిగా పేరు తెచ్చుకుంటున్న యువ కధానాయిక గౌరీ కిషన్(Gouri kishan) ను... తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మీ బరువు ఎంత? అంటూ ప్రశ్నించడం ద్వారా నోటికి ఉండే అన్ని హద్దులనూ చెరిపేశాడు. ఈ ప్రశ్నను ఎదుర్కున్న గౌరీ కిషన్ అదే సమావేశంలో సదరు జర్నలిస్ట్‌ను పట్టుకుని ఎదురు ప్రశ్నలతో ఉతికి ఆరేయడం వేరే సంగతి. ఈ ఘటన జరిగిన కాసేపటికే ఖుష్బూ, నటి రాధిక, గాయని చిన్మయి... వంటివారు గౌరీ కిషన్‌కు మద్ధతుగా పోస్టులు పెడుతున్నారు. ఆమె జర్నలిస్ట్‌ను ఉతికి ఆరేసిన తీరును ప్రత్యేకంగా శభాష్ అంటున్నారు.
ఇప్పుడు ఇకనైనా సినిమా జర్నలిజం తనను తాను ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజానికి ఈ మూడు సందర్భాల్లోనూ జర్నలిస్ట్‌లు వేసిన ప్రశ్నలు అత్యంత అసందర్భం, అసంబద్ధం అనేది నిస్సందేహం. అయినప్పటికీ అలా వారు అడగడం వెనుక పాప్యులారిటీ లేదా వైరల్ అవ్వాలనే దురాశ ఉండవచ్చునని అనిపిస్తోంది. వ్యక్తి దురాశ వ్యవస్థకు చేటు కాకూడదు. సినీ జర్నలిజం మొత్తానికి దీని వల్ల కలుగుతున్న, కలగబోతున్న నష్టాన్ని సీనియర్ పాత్రికేయులు, సినిమా పెద్దలు వెంటనే గుర్తించి తగిన మరమ్మతులు చేయడం తక్షణావసరంగా కనిపిస్తోంది.


