హైదరాబాద్‌ పబ్‌లో టాప్‌ హీరోయిన్‌... ఊపేస్తోందిగా.. | Shruti Haasan Ready To Hold Music Concert In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ పబ్‌లో టాప్‌ హీరోయిన్‌... ఊపేస్తోందిగా..

May 2 2025 3:14 PM | Updated on May 2 2025 8:48 PM

Shruti Haasan Ready To Hold Music Concert In Hyderabad

గత ఏడాది లండన్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో అతిధులకు అనుకోని షాక్‌.. అప్పటి దాకా సంగీతం అందిస్తున్న లోకల్‌ బ్యాండ్‌ బృందం మధ్యలోకి అనూహ్యంగా దూసుకొచ్చిందో అందమైన యువతి. హఠాత్తుగా మైక్‌ తీసుకుని పాడడం ప్రారంభించింది. కాసేపట్లోనే అతిధుల హర్షధ్వానాలతో ప్రాంగణం మారుమోగిపోయింది. అప్పట్లో అది అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. ఆమె సాదా సీదా యువతి కాదు మరి...భారత చలనచిత్ర రంగంలో టాప్‌ హీరోయిన్స్‌లో ఒకరైన శృతి హాసన్‌.
ప్రఖ్యాత నటుడు కమల్‌ హాసన్‌  నటి సరికా ఠాకూర్‌ కుమార్తె శృతి హాసన్, తెలుగు, తమిళం హిందీ చిత్రాల ద్వారా భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ  ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. ఆమె రెండు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌  ఏడు సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డులతో సహా అనేక అవార్డులను గెలుచుకుంది.  ఇటీవల రజనీకాంత్‌ నటించి లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన రాబోయే చిత్రం కూలీ షూటింగ్‌ను శ్రుతి హాసన్‌ పూర్తి చేసింది.  ఆమె అంతర్జాతీయ చిత్రం ‘ది ఐ’ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో సంచలనం సృష్టిస్తోంది.ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ఇటీవల భారతదేశంలో వెంచ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు నోచుకుంది కూడా.  సానుకూల సమీక్షలను అందుకుంటోంది.

ఇలా నటనా పరంగా అనేక రకాల సంచనాలను సృష్టిస్తోన్న శృతి...తన పేరును సార్ధకం చేసుకోవాలని అనుకుంటోంది. ఆమె పాటల ప్రపంచంలోనూ తన సత్తా చాటుతూ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. చిన్నతనంలోనే సంగీత శిక్షణ పొంది పాడటం ప్రారంభించింది  తరువాత తన సొంత బ్యాండ్‌ను సైతం ఏర్పాటు చేసుకుంది. నటీమణులలో పాడే వారే తక్కువ అంటే స్వంత బ్యాండ్‌ కూడా ఉన్న ఏకైక హీరోయిన్‌ ఆమె మాత్రమే ఆమె పలు చిత్రాలకు సైతం పాడింది. ఈ సంవత్సరంలో రాబోయే కూలీ చిత్రంలో ఆమె పాత్రతో పాటు, మిస్కిన్‌ దర్శకత్వం వహించి సంగీతం అందించిన విజయ్‌ సేతుపతి రాబోయే చిత్రం ‘ట్రెయిన్‌‘ కు కూడా ఆమె తన గాత్రాన్ని అందించింది. ‘ఇట్స్‌ ఎ బ్రేక్‌ అప్‌ డా‘ పాట కోసం రెహమాన్‌ తో కలిసి పనిచేసింది. నటన  గానం కాకుండా, శ్రుతి ఒక  పాటల రచయిత కూడా. ఆమె ‘ఎడ్జ్,‘ ‘మాన్స్టర్‌ మెషిన్,‘  ‘ఇనిమెల్‌‘ వంటి ప్రసిద్ధ సింగిల్స్‌తో ఇండీ సంగీత రంగంలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది.శ్రుతి తన స్పష్టమైన వ్యక్తిత్వం ప్రత్యేకమైన ఫ్యాషన్‌
సెక్షన్‌కు ప్రసిద్ధి చెందింది.

గాయని శ్రుతి హాసన్‌ మార్చి 28న హైదరాబాద్‌లోని ప్రముఖ పబ్‌ కమ్‌ క్లబ్‌గా పేరున్న ఓడియం బై ప్రిజంలో ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వవలసి ఉంది. వయసు 21 ఏళ్లు  అంతకంటే ఎక్కువ  ఉన్నవారికి మాత్రమే ప్రవేశం అనే నిబంధనతో ఈ కన్సర్ట్‌ రాత్రి 8:00 గంటలకు ప్రారంభమై 4 గంటల 30 నిమిషాల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు.  టిక్కెట్లు ధరలు 1,000 నుంచి ఆపైన...బుక్‌మై షో ద్వారా విక్రయించారు కూడా అయితే ఏమైంతో ఏమో కానీ... ఆ షో వాయిదా పడింది. ఆ తర్వాత ఏప్రిల్‌ 28న శృతి హాసన్‌ ప్రదర్శన ఉంటుందని తిరిగి అనౌన్స్‌ చేశారు. అది కూడా వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి మే 3న శృతి రానున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌కు రానున్న శ్రుతి, తన అభిమానులను ఆకట్టుకోవడానికి రాక్, సోల్‌  భారతీయ ప్రభావాల  మిశ్రమాన్ని తీసుకువస్తోంది.

ఈ నేపధ్యంలోనే శ్రుతి హాసన్‌ తాజాగా తన రాబోయే ప్రత్యక్ష ప్రదర్శన సన్నాహాల  రిహార్సల్‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఆమె బ్యాండ్‌ సహచరులతో కలిసి ప్రాక్టీస్‌ సెషన్‌ లో మునిగిపోతున్న ఈ వీడియో, తెరవెనుక సంగీతం పట్ల ఉన్న ఆమె మక్కువను  చూడటానికి  అభిమానులకు వీలు కల్పిస్తుంది. తన ఇన్‌ స్ట్రాగామ్‌ పోస్ట్‌లో, శ్రుతి తన తోటి సంగీతకారులకు కృతజ్ఞతలు తెలుపుతూ,  వారిని ’నేరంలో సోదరులు’ అని పేర్కొంది. ఆమె ఇలా రాసింది, ‘మనం ఆ షో చేసి ఉంటే బాగుండేది కానీ చేయలేక పోయాం (మా తప్పు కాదు) కానీ మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడటానికి మేం ఇంకా వేచి ఉండలేం. త్వరలో మీ అందమైన ముఖాలన్నీ  చూడాలనుకుంటున్నాను. నా అద్భుతమైన సంగీతకారులకు, నేరంలో ఉన్న నా సోదరులకు  ఈ సంగీతం ప్రతిధ్వనించే ధైర్యం ఉన్న కొద్దిమంది ఆత్మలకు ధన్యవాదాలు. త్వరలో హైదరాబాద్‌లో కలుద్దాం, మీకు నా హృదయంలో చోటు ఉందని మీకు తెలుసు‘ అంటూ ఆమె అభిమానులను తన పోస్ట్‌ ద్వారా ఊరడించింది.

ఎప్పుడూ సంగీతం పట్ల మక్కువ కలిగి ఉండే శ్రుతి హాసన్‌  ఈ సంవత్సరం తన సినిమా కమిట్‌మెంట్‌లను నిర్వహిస్తూనే మరిన్ని స్వతంత్ర పాటలను విడుదల చేయనుంది.  భవిష్యత్తులో మరిన్ని ప్రత్యక్ష ప్రదర్శనలకు ఆమె సిద్ధమవుతున్నందున, ఆమె సంగీత ప్రయాణం ఎలా సాగుతుందో చూడటానికి ఆమె అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతానికి, హైదరాబాద్‌లో ఆమె తొలి షో ఆమె శృతి మ్యూజికల్‌ జర్నీకి మలుపు కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement