పాన్‌మసాలా ప్రకటనల్లో నటించిన బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ‘విమల్’ పాన్‌మసాలా ప్రకటనలకు సంబంధించిన ప్రచార కంటెంట్‌ను 15రోజుల్లో తొలగించాలని వీరికి ఆదేశించింది.
ఈ నోటీసులు ఆగస్టు 11న మహారాష్ట్ర ఆహార భద్రతా విభాగం అధిపతి తుకారాయ్ జారీ చేశారు. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఆదేశాలను పాటించకపోతే 2006 ఆహార భద్రత, ప్రమాణాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎఫ్‌డీఏ హెచ్చరించింది. తప్పుడు ప్రకటనలు, ఆహార ఉత్పత్తుల ప్రచారంపై ఉన్న నిబంధనలను ఉల్లంఘించినందుకే ఈ నోటీసులు పంపించినట్లు పేర్కొంది.
కాగా నిషేధిత ఉత్పత్తి అయిన పాన్ మసాలను ఇప్పటికీ సోషల్ మీడియాతో పాటు ఇతర వేదికల్లో ప్రచారంలో ఉన్నాయి. పాన్‌మసాలా ఉత్పత్తుల ప్రకటనల్లో ప్రముఖుల భాగస్వామ్యంపై గత కొంతకాలంగా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


