సమంత ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వరస సినిమాలు చేసింది. కానీ విడాకులు, మయోసైటిల్ వ్యాధి దెబ్బకు కొన్నేళ్లపాటు ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. చివరగా 'ఖుషి' మూవీలో కనిపించింది. చాన్నాళ్ల తర్వాత 'మా ఇంటి బంగారం'తో వచ్చింది. తాజాగా ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. అయితే కొన్నాళ్ల క్రితం సామ్ బాగా బక్కచిక్కిపోవడం చూసి అంతా షాకయ్యారు. అయితే దాని వెనకున్న కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈమె బయటపెట్టింది.
(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా 'అతిరథి' తెలుగు రివ్యూ)
'ఎందుకు అంతలా బరువు తగ్గిపోయావని.. చాలామంది ఎప్పుడూ నన్ను అడుగుతుంటారు. అవతలి వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికీ పూర్తిగా తెలియదు. నేను కావాలని డైటింగ్ చేసి బరువు తగ్గలేదు. నాకు తినాలని ఉన్నా కూడా తినలేని పరిస్థితి. అందుకే తినలేకపోయాను. అనారోగ్యం కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆ రెండేళ్లు నా తిండిపై ఎన్నో కండీషన్స్ ఉన్నాయి. ఏం తిన్నా సరే నా కడుపు చెడిపోయేది. మయోసైటిస్ మళ్లీ ఎక్కువయ్యేది. అందుకే రెండేళ్ల పాటు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒకే రకమైన ఎలాంటి రుచి లేని ఆహారాన్ని తిన్నా. ఆ నరకు చూసిన తర్వాత నా డైట్‌లో చేర్చుకోవడానికి డాక్టర్స్ పర్మిషన్ ఇచ్చిన మొదటి స్వీట్ ఐటమ్.. పంచదార, డెయిరీ లేని జెలాటో ఐస్‌క్రీమ్. ఆ టైంలో దీనికోసం ఎంతో ఎదురుచూసేదాన్ని. అందుకే దాని పేరుని నా పిల్లికి పెట్టుకున్నాను'
'కెరీర్‌లో పీక్ స్టేజీలో ఉన్నప్పుడు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో నా కెరీర్ ముగింపు చూశాను. అది నన్ను చాలా మార్చింది. ఒకవేళ మళ్లీ ఇండస్ట్రీకి వస్తే నా పాత పద్ధతులను, లైఫ్ స్టైల్‌ను పూర్తిగా మార్చుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఆహారం పట్ల నాకున్న ఆలోచనా విధానమే పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఆ కష్టమైన ఫేజ్ నుంచి బయటపడి, కాస్త కంఫర్టబుల్‌గా తినగలుగుతున్నాను' అని సమంత చెప్పుకొచ్చింది.
నందిని రెడ్డి దర్శకత్వం వహించిన 'మా ఇంటి బంగారం' సినిమాలో సమంతనే మెయిన్ లీడ్. ఈమె భర్త రాజ్ నిడిమోరు.. స్టోరీ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. అయితే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. మరి బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు నిలబడుతుందనేది చూడాలి?
(ఇదీ చదవండి: సమంత 'మా ఇంటి బంగారం' రివ్యూ)


