ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ | Athiradi Movie Telugu Review And OTT Details | Sakshi
Sakshi News home page

Athiradi Review Telugu: కాలేజీ ఎంటర్‌టైనర్.. ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్

Jun 19 2026 3:48 PM | Updated on Jun 19 2026 3:50 PM

Athiradi Movie Telugu Review And OTT Details

మలయాళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాసిల్ జోసెఫ్, టొవినో థామస్, రియా షిబు ప్రధాన పాత్రలు చేసిన మూవీ 'అతిరథి'. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. గత నెలలో థియేటర్లలో రిలీజై ఓ మాదిరిగా ఆకట్టుకుంది. ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి:  సమంత 'మా ఇంటి బంగారం' రివ్యూ)

కథేంటి?
ఓ ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అయిన తుంటరి కుర్రాడు శామ్ కుట్టి (బాసిల్ జోసెఫ్). ఇదే కాలేజీలో రెండేళ్ల క్రితం జరిగిన ఓ విషాదం వల్ల ఆగిపోయిన 'ఆరోహన్' అనే ఫెస్ట్ జరిపించాలని ఇతడు ప్రయత్నిస్తుంటాడు. ఇది కచ్చితంగా చేయాలనుకోవడం వెనక ఓ కారణముంటుంది. తొలి ఏడాది నుంచి అనుకుంటే శామ్ తన ఫైనల్ ఇయర్ వచ్చేసరికి అందరినీ ఒప్పించి ఫెస్ట్ నిర్వహించేందుకు రెడీ అవుతాడు. కానీ తోట కుట్టన్(టొవినో థామస్) అనే మాజీ రౌడీ రూపంలో అనుకోని అవాంతరం ఎదురవుతుంది. ఇంతకీ శామ్, కుట్టన్ మధ్య గొడవేంటి? స్వాతితో శామ్ ప్రేమకథ ఎంతవరకు వచ్చింది? చివరకు ఫెస్ట్ జరిగిందా లేదా అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
అతిరథి గురించి సింపుల్‌గా చెప్పుకోవాలంటే ఇంజినీరింగ్ కాలేజీలో ఆగిపోయిన ఓ ఫెస్ట్‌ని చేయడంలో హీరో సక్సెస్ అయ్యాడా లేదా అనేది స్టోరీ. ఏంటి కథ ఇంతేనా? అసలు ఇందులో చెప్పడానికి, చూపించడానికి ఏముందా అనే సందేహం మీకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ మూవీ టీమ్ బాగానే మేనేజ్ చేశారు. పెద్దగా పాయింట్ లేని స్టోరీని కూడా రెండున్నర గంటల మూవీగా తీశారు. కాకపోతే యావరేజ్ దగ్గరే ఆగిపోయారు.

ఓ ఫెస్ట్‌లో ముగ్గురు స్టూడెంట్స్ చనిపోవడంతో సినిమా ప్రారంభమవుతుంది. ఈ విషాదం కారణంగా ప్రతి ఏడాది జరిగే ఫెస్ట్‌ని పూర్తిగా ఆపేస్తారు. అదే కాలేజీలో కొన్నేళ్ల తర్వాత ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అవుతాడు శామ్ కుట్టి. అల్లరి చేస్తూ, తుంటరి పనులతో ఎంటర్‌టైన్ చేసే ఇతడు.. ఈ ఫెస్ట్ కోసం అంతలా ఎందుకు పట్టుబట్టాడు? చివరకు చేయగలిగాడా లేదా అనేది కన్విన్సింగ్‌గానే చూపించారు. అయితే ఇంటర్వెల్ వరకు పెద్దగా స్టోరీ ఏం ఉండదు. సీన్స్ వస్తుంటాయి గానీ బోరింగ్‌గానే ఉంటుంది. ఇంటర్వెల్‌కి ముందు ఎప్పుడైతే కుట్టన్ పాత్ర ఎంట్రీ ఇస్తుందో అప్పటి నుంచి మూవీలో కాస్త జోష్ వస్తుంది.

సెకండాఫ్ అంతా కాలేజీ స్టూడెంట్ శామ్, రౌడీ షీటర్ నుంచి సింగర్‌గా మారాలనే ప్రయత్నాల్లో ఉన్న కుట్టన్ మధ్య క్యాట్ అండ్ మౌస్ స్టైల్ ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఫైట్స్ అన్నాం కదా అని ఏదో పెద్దగా ఊహించుకోకండి. చాలా సరదాగా, ఫన్నీగా సాగిపోతుంది. అదే టైంలో సహజంగానూ ఉంటుంది. చాలా మలయాళ చిత్రాల్లో ఉన్నట్లే ఇందులోనూ సాగదీత ఉంటుంది. కాకపోతే చివరకొచ్చేసరికి కాస్తంత ఎమోషనల్ చేసి ముగిస్తారు. కాలేజీలో సాగే స్టోరీ కావడంతో పెద్దగా ట్విస్టులు లాంటివి ఏం ఉండవు. సరదాగా సాగిపోతుంది అంతే. ఈ తరహా మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే ప్రయత్నించొచ్చు.

ఎవరెలా చేశారు?
శామ్ కుట్టి పాత్రలో బాసిల్ జోసెఫ్ అదరగొట్టేశాడు. స్వతహాగా దర్శకుడు, నటుడు అయిన ఇతడు.. కాలేజీ కుర్రాడిగానూ ఇందులో సెట్ అయిపోయాడు. కుట్టన్ అనే మాజీ రౌడీగా, సింగర్ అవ్వాలనుకునేవాడిగా టొవినో థామస్ పాత్ర కూడా కాస్తంత ఎంటర్‌టైనింగ్‌గానే ఉంది. వీళ్లిద్దరి తర్వాత కిడ్నాప్ అయి ఇబ్బందులు పడే వినీత్ శ్రీనివాసన్ పాత్ర బాగుంది. 'సర్వం మాయ' ఫేమ్ రియా షిబు ఇందులో స్వాతి అనే అమ్మాయిగా చేసింది గానీ ఈమెకు అస్సలు స్కోప్ దొరకలేదు. మిగతా యాక్టర్స్ ఓకే ఓకే.

టెక్నికల్ విషయాలకొస్తే.. స్టోరీ పెద్దగా ఏం లేదు కానీ టైమ్ పాస్ చేయించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్లు ఉంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. డైరెక్టర్ పర్లేదనిపించాడు. ఫస్టాప్‌లో కామెడీ సీన్స్ లాంటివి కొన్ని పెట్టుంటే బాగుండేది అనిపించింది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు. అభ్యంతరక సీన్స్ ఏం లేవు. ఓవరాల్‌గా అయితే టైమ్ పాస్ కామెడీ మూవీ చూద్దామనుకుంటే 'అతిరథి' ట్రై చేయొచ్చు.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 16 సినిమాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement