
ఓటీటీలు అనగానే చాలామందికి మలయాళ సినిమాలే గుర్తొస్తాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు డిఫరెంట్ కథలతో మూవీస్‌ని రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా అలా 'రోంత్' అనే చిత్రం తెలుగు డబ్బింగ్‌తో హాట్‌స్టార్‌లోకి వచ్చేసింది. రాత్రి గస్తీలో పోలీసులు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటారు? వాళ్లకు ఎలాంటి రిస్కులు ఎదురవుతాయి అనే కాన్సెప్ట్‌తో తీసిన మూవీ ఇది. ఇంతకీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు)
కథేంటి?
ధర్మశాల పోలీస్ స్టేషన్‌లో యోహన్నా(దిలీశో పోతన్) ఎస్సై. దిన్నాథ్(రోషన్ మ్యాథ్యూ) కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటారు. ఓ రోజు రాత్రి గస్తీ కోసం వీళ్లకు డ్యూటీ వేస్తారు. అలా పెట్రోలింగ్‌కి వెళ్లిన వీళ్లిద్దరికి ఓ చోట లవర్స్ లేచిపోవడం, మరోచోట ఓ సైకో కన్నబిడ్డని డబ్బా కింద దాచడం, మరోచోట ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడం.. ఇలా రకరకలా సంఘటనలు ఎదురవుతాయి. చివరగా అనుకోకుండా జరిగిన ఓ మరణం వల్ల వీళ్లు సమస్యల్లో ఇరుక్కుంటారు. తర్వాత ఏమైంది అనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
మలయాళ సినిమాలు ఎందుకు చూస్తారు? అని అడిగితే.. సహజత్వానికి దగ్గరగా ఉంటాయని చాలామంది చెప్పేమాట. ఈ సినిమా కూడా సేమ్ అలాంటిదే. రోంత్ అంటే గస్తీ అని అర్థం. అందుకు తగ్గట్లే మూవీ అంతా ఇద్దరు పోలీసులు, జీప్‌లో తిరుగుతూ.. రాత్రి కాపల కాయడమే చూపిస్తారు. అదే టైంలో వాళ్ల జీవితంలో అనుకోని సంఘటనలు జరగడం, వాటి పరిణామాల వల్ల ఊహించని పరిస్థితులు ఎదుర్కోవడం లాంటివి కూడా చాలా రియలస్టిక్‌గా చూపించారు.
ఈ సినిమాలో దాదాపు 80 శాతం రాత్రిపూట ఇద్దరు పోలీసులు పెట్రోలింగ్ చేయడమే చూపిస్తారు. వాళ్లకు ఎదురయ్యే సంఘటనలు.. ఈ విషయంలో వాళ్లు తీసుకునే నిర్ణయాలే కథని ముందుకు తీసుకెళ్తాయి. మధ్యమధ్యలో వచ్చే ఎమోషన్స్ కూడా బాగుంటాయి.స్టోరీ సాఫీగా సాగిపోతుందే అనుకునే టైంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. చివరి అరగంట ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ కలిగిస్తుంది. ఊహించని క్లైమాక్స్ సర్‌ప్రైజ్ చేస్తుంది.

సిన్సియర్‌గా పనిచేయడమే కాదు, మన చుట్టూ ఏం జరుగుతుందో గమనించడం కూడా అవసరమే. లౌక్యం లేకపోతే ఉద్యోగ జీవితంతో పాటు వ్యక్తిగతంగానూ దెబ్బయిపోతాం అనే మెసేజ్ ఇచ్చిన స్టోరీ ఇది. పై స్థాయి అధికారులు అవసరమొస్తే కిందస్థాయి అధికారుల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తారనేది కూడా చాలా నేచురల్‌గా చూపించారు.
అయితే ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు ఎందుకంటే రెండు గంటల సినిమా. అంతా పోలీసులు డ్యూటీ చేయడం లాంటి సీన్సే ఉంటాయి. ఒకవేళ పోలీస్ డ్రామాలు అంటే ఆసక్తి ఉంటేనే దీన్ని చూడండి. లేదంటే మాత్రం డిసప్పాయింట్ కావొచ్చు. సింపుల్ కథలానే అనిపిస్తుంది గానీ చివరకొచ్చేసరికి పోలీసుల జీవితం ఇలా కూడా ఉంటుందా అని అనిపిస్తుంది.
ఎవరెలా చేశారు?
యోహన్నాగా చేసిన దిలీశ్ పోతన్, దిన్నాథ్‌గా చేసిన రోషన్ మ్యాథ్యూ చాలా నేచురల్‌గా నటించారు. సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతే వీళ్లతో పాటు మనం ప్రయాణించిన అనుభూతి కలుగుతుంది. మిగిలిన పాత్రధారులకు పెద్ద స్కోప్ లేదు. కానీ బాగానే చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. ఇందులో పెద్ద కథేం లేదు. కానీ డైరెక్టర్ షాహీ కబీర్ తనదైన స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడు. ఈయనకు మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ నుంచి మంచి సపోర్ట్ దొరికింది. పోలీసుల గురించి, రాత్రి పూట వాళ్లకు ఎదురయ్యే పరిస్థితుల గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీపై ఓ లుక్కేయండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.
- చందు డొంకాన
(ఇదీ చదవండి: 'డీఎన్‌ఏ' మూవీ రివ్యూ.. మెప్పించేలా థ్రిల్లర్ క్రైమ్ స్టోరీ)