నాని 'ప్యారడైజ్' సినిమాకు రిలీజ్ రోజు దారుణమైన నెగిటివ్ టాక్ వచ్చింది. తర్వాత నుంచి మెల్లగా కుదురుకుంటోంది. చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే తొలిరోజు ఇలాంటి టాక్ రావడానికి ఓ కారణముంది. మరి ఈ చిత్రం ఎఫెక్టో ఏమో గానీ విజయ్ దేవరకొండ 'రణబాలి' టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది.
(ఇదీ చదవండి: తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో భారీ రెమ్యునరేషన్! రోజుకు రూ.7.5 లక్షలు)
'ప్యారడైజ్' సినిమా నుంచి పాటలు మాత్రమే రిలీజ్ చేశారు. కనీసం ట్రైలర్ కూడా చూపించలేదు. దీంతో అసలు మూవీ ఎలా ఉండబోతుందనేది కూడా ఎవరికీ తెలియలేదు. తీరా థియేటర్లలోకి వెళ్లాక కొందరికి నచ్చింది కొందరికి అస్సలు నచ్చలేదు. మూవీ థీమ్ ఏంటనేది ప్రేక్షకులకు తెలియకపోవడమే దీనికి కారణం.
ఇప్పుడు 'రణబాలి' టీమ్ మాత్రం ఆ తప్పు చేయట్లేదు. సినిమా ఎలా ఉండబోతుందనేది చూచాయిగా చెప్పే డాక్యుమెంటరీ సిరీస్‌ని నాలుగు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన చేసింది. వచ్చే నెల 16న మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఇందులో భాగంగానే డాక్యుమెంటరీలోని తొలి మూడు ఎపిసోడ్స్ వరసగా సోమవారం (సెప్టెంబరు 28), బుధవారం(సెప్టెంబరు 30), శుక్రవారం(అక్టోబరు 02) యూట్యూబ్‌లో వదలబోతున్నారు.
అయితే 'రణబాలి' టీమ్ ఇలా చేయడం ఒకందుకు మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా వచ్చేలోపు కంటెంట్ ఎలా ఉండబోతుందనేది వీటిని చూసే ప్రేక్షకులకు ఓ అంచనా ఏర్పడుతుంది. తద్వారా మూవీకి ప్లస్ అయ్యే అవకాశముంది. ఈ డాక్యుమెంటరీలో విజయ్ దేవరకొండ, రష్మిక, దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ చిత్ర సంగతుల్ని పంచుకోబోతున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మమిత సూపర్ హిట్ సినిమా.. అధికారిక ప్రకటన)


