
ఇటీవల సినీ తారల వ్యక్తిగత అలవాట్ల గురించి మీడియా కన్నా సినీ రంగంలోని వాళ్లే ఎక్కువగా మాట్లాడుతున్నారు. అంతేకాదు మీడియా నుంచి వచ్చే విమర్శల కన్నా ఇవి చాలా వాడిగా వేడిగా పదనుగా ఉంటున్నాయి. సహజంగానే సినీతారల గురించి అందరి కన్నా ఎక్కువగా తెలిసేది అదే రంగంలో ఉన్న దర్శకులు, నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులకు కాబట్టి..వీరి విమర్శల్లో నిజం ఉంటుందని అనేక మంది భావిస్తుండడంతో ఇవి సంచలనంగా మారుతున్నాయి. ఇప్పుడు తారలపై విమర్శలు గుప్పించే సినీ ప్రముఖుల జాబితాలో మరో అగ్రదర్శక నిర్మాత కూడా జేరారు. ఆయన పేరు పహ్లాజ్ నిహలానీ.
భారతీయ చలనచిత్ర నిర్మాత పహ్లాజ్ నిహలానీ సాదా సీదా వ్యక్తి కాదు. ఆయన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్‌సి) మాజీ ఛైర్మన్ కూడా. ఆయన గత 2009 వరకు 29 సంవత్సరాల పాటు సినిమాలు, టీవీ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. నిహలానీ 1982లో హాత్కడితో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు నాటి టాప్ హీరో గోవింద (ఇల్జామ్, 1986) చంకీ పాండే (ఆగ్ హి ఆగ్, 1987) వంటి పలువురు నటులను పరిచయం చేశారు. షోలా ఔర్ షబ్నం ఆంఖేన్ తో సహా అనేక ప్రసిద్ధ చిత్రాలను నిర్మించారు. ఆయన 2012లో అవతార్ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు.
ఆ ప్రముఖ నిర్మాత మాజీ సిబిఎఫ్‌సి చీఫ్ పహ్లాజ్ నిహలానీ ప్రస్తుతం బాలీవుడ్‌లో విపరీతంగా పెరుగుతున్న విషపూరిత సంస్కృతిని విమర్శించడం సంచలనంగా మారింది. ఇటీవల లెర్న్ ఫ్రమ్ ది లెజెండ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త తరం సెలబ్రిటీ జీవనశైలిని ఆకర్షణీయమైన ముఖభాగాల వెనుక దాగి ఉన్న నిరంతర మాదకద్రవ్య సేవనాన్ని తూర్పారబట్టారు.
గతంలో ఒక నటుడు మాత్రమే కనిపిస్తే, నేడు నటులు పది మంది బృందాలతో కనిపిస్తారని ఆయన ఎద్దేవా చేశారు. నిన్న కాక మొన్న వచ్చిన కొత్తవారు కూడా తమ సొంత మేకప్ ఆర్టిస్ట్, హెయిర్‌డ్రెస్సర్‌ల నుంచి తమ అద్దం పట్టుకోవడానికి కూడా పర్సనల్ అసిస్టెంట్ కావాలంటున్నారని, అలాగే వ్యక్తిగత ఫిట్‌నెస్ ట్రైనర్‌ను కలిగి ఉండాలని పట్టుబడుతున్నారన్నాని వెల్లడించారు. చివరికి వీటన్నింటికీ ఖర్చులు నిర్మాత జేబుల నుంచే చెల్లిస్తారని ఆయన గుర్తు చేశారు. వ్యాయామం చేయడం, వంట చేయడం సమావేశాలు నిర్వహించడం వంటి వాటి కోసం ఏకంగా ఆరు వేర్వేరు వానిటీ వ్యాన్ల డిమాండ్ కూడా చేస్తున్నారని ఇది చాలా ఓవర్‌గా ఉందన్నారు. .
చాలా మంది నటులు ద్వంద్వ జీవితాలను గడుపుతున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు.. పగటిపూట శుభ్రమైన,ఆరోగ్యకర ఆహారం డిమాండ్ చేస్తూ, రాత్రిపూట మత్తుపదార్ధాల వినియోగంలో మునిగిపోతున్నారన్నారు. తారలు తరచుగా ప్రాథమిక సేవల కోసం పెంచిన బిల్లులను సమర్పిస్తారని, మేకప్ ఖర్చులే లక్షల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాల సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతోందా అని అడిగినప్పుడు స్పందిస్తూ, ఇప్పుడు చాలా ఎక్కువగా ఉందని కొన్ని సందర్భాల్లో, కొంతమంది నటుల ప్రవర్తనలో కూడా అది స్పష్టంగా కనిపిస్తుందని స్పష్టం చేశారు.
అంతేకాదు...తాను తీసిన తలాష్: ది హంట్ బిగిన్స్... చిత్రం సందర్భంగా జరిగిన విషయాల్ని గుర్తు చేసుకుంటూ, హీరో అక్షయ్ కుమార్ తన పక్కన కరీనా కపూర్‌ను ప్రధాన పాత్రగా తీసుకోవాలని పట్టుబట్టారని కూడా ఆయన వెల్లడించారు. తన కెరీర్‌లో ఒక నటుడు ఇలాంటి డిమాండ్ చేయడం ఇదే మొదటిసారి అని, ఇది సాంప్రదాయ నిర్మాత–దర్శకుడు కాస్టింగ్ విధానాన్ని అధిగమించిందని నిహలానీ పేర్కొన్నారు.
ఇప్పుడు అది సాధారణంగా మారిపోయిందన్నారు. నేడు, నటులు తరచుగా తారాగణం నుంచి దర్శకుడు సిబ్బంది వరకు ప్రధాన నిర్ణయాలను అన్నింటినీ నియంత్రిస్తున్నారని ఆయన వెల్లడించారు. హీరో, హీరోయిన్స్ మధ్య వయసు తేడా ల గురించి మాట్లాడుతూ వృద్ధ నటులు తాము యంగ్‌గా కనిపించడానికి యువ తారల్ని ఇష్టపడతారని ఆయన ఎద్దేవా చేశారు.